ఎలక్షన్​ డ్యూటీలో తప్పు చేస్తే ..వదిలిపెట్టం

ఎలక్షన్​ డ్యూటీలో తప్పు చేస్తే ..వదిలిపెట్టం
  • అధికారులను, ప్రభుత్వ వాహనాలనూ చెక్​ చేయాల్సిందే
  • ఎలక్షన్​ సిబ్బందికి సీఈసీ రాజీవ్​కుమార్​ ఆదేశం
  • మనీ, మందు, గిఫ్టుల పంపిణీపై ప్రత్యేక నిఘా పెడ్తం
  • హెలిక్యాప్టర్లు, హెలీప్యాడ్లు కూడా తనిఖీ చేస్తం 
  • గూగుల్​ పే, ఫోన్ పే పేమెంట్లపై మానిటరింగ్​
  • ఆఫీసర్ల అండతో డబ్బు తరలిస్తున్నట్లు 
  • మా దృష్టికి వచ్చింది, 35,356 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడి
  • అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై ముగిసిన ఈసీ 3 రోజుల టూర్

హైదరాబాద్​, వెలుగు: ఎన్నికల్లో మనీ, మద్యం కట్టడికి ప్రభుత్వ వాహనాలను, ప్రభుత్వ అధికారులను కూడా చెక్​ చేయాల్సిందేనని ఎన్నికల సిబ్బందిని కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ రాజీవ్​ కుమార్ ఆదేశించారు. ఎన్నికల డ్యూటీలో ఉండే అధికారులు ఏకపక్షంగా ఉండరాదని, ఎవరైనా అట్ల చేసినట్లు తమ దృష్టికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎన్నికల డ్యూటీని ఎవరైనా పకడ్బందీగా చేయకుంటే వారితో ఎలా చేయించుకోవాలో తమకు తెలుసని వార్నింగ్​ ఇచ్చారు. పరిస్థితి ఇంతకు ముందులా ఉండదని, ఏదైనా తప్పు జరిగితే సీరియస్​ యాక్షన్ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించేందుకు రాష్ట్రానికి వచ్చిన సీఈసీ రాజీవ్​కుమార్​తో కూడిన ఈసీ బృందం మూడు రోజుల పర్యటన గురువారం ముగిసింది. మొదటి రోజు పొలిటికల్ పార్టీలు, ఎన్​ఫోర్స్​మెంట్​ ఏజెన్సీలతో.. రెండో రోజు జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలతో.. మూడో రోజు సీఎస్​, డీజీపీతో సమావేశమై ఈసీ టీమ్​ చర్చించింది. గురువారం మధ్యాహ్నం తాజ్​కృష్ణ హోటల్​లో ఎలక్షన్​ కమిషనర్లు అనూప్​ చంద్ర పాండే, అరుణ్​ గోయల్​తో కలిసి చీఫ్​ కమిషనర్​ రాజీవ్​ కుమార్​ మీడియా సమావేశం నిర్వహించి పర్యటన వివరాలు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణలో మద్యం సరఫరా, నగదు పంపిణీ, గిఫ్టుల డిస్ట్రిబ్యూషన్ లాంటివి సవాల్​గా మారాయన్నారు. వీటిని కట్టడి చేసి పారదర్శకంగా ఎలక్షన్లు నిర్వహించడంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. 

ALSO READ :  ఓట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ..దొంగ జపం చేస్తున్నయ్ : కేటీఆర్

అధికారుల సహకారంతో డబ్బులు తరలిస్తున్నరు

ఎన్నికల టైమ్​లో కొందరు ప్రభుత్వ అధికారుల సహకారంతో ప్రభుత్వ వాహనాల్లో డబ్బులు తరలిస్తున్నట్లు, హెలికాప్టర్లలో  కూడా డబ్బు తీసుకెళ్తున్నట్లు కంప్లయింట్స్​ ఉన్నాయని సీఈసీ రాజీవ్​ కుమార్​ తెలిపారు. వీటన్నింటిపై నిఘాతో పాటు చెకింగ్​ ఉంటుందని అన్నారు. ఈ ప్రలోభాలను కంట్రోల్ చేయడానికి  టెక్నాలజీని వినియోగిస్తామని చెప్పారు. హెలికాప్టర్లు, హెలిప్యాడ్లు, అన్ షెడ్యూల్డ్​ ఫ్లైట్స్​ దగ్గర కచ్చితంగా తనిఖీలు ఉంటాయన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మరీ నిఘా పెడుతామని స్పష్టం చేశారు.  ఎయిర్​పోర్ట్స్, రైల్వే ప్రయాణాలపైనా ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. 

డిజిటల్​ లావాదేవీలపై మానిటరింగ్​

బ్యాంకు అకౌంట్లపై దృష్టి పెట్టామని, డిజిటల్ లావాదేవీలపై కూడా మానిటరింగ్​ ఉంటుందని సీఈసీ రాజీవ్​కుమార్​ తెలిపారు. ఫోన్​ పే, గూగుల్​ పే ట్రాన్స్​ఫర్స్​పై నేషనల్​ పేమెంట్స్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా (ఎన్​పీసీఐ)తో సమన్వయం చేసుకుని పనిచేస్తామన్నారు. రాష్ట్రంలో మొత్తం 21 ఎన్‌‌‌‌ఫోర్స్ మెంట్ ఏజెన్సీల సహకారాన్ని తీసుకుని సమన్వయం కోసం పకడ్బందీ మెకానిజం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికల నిర్వహణ కోసం తాము కమిట్‌‌‌‌మెంట్‌‌‌‌తో పనిచేస్తున్నామన్నారు. ఎన్నికలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న (ఫిర్యాదు వచ్చిన)  ప్రతి లీడర్​సమాధానం చెప్పాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఓటుకు నోటు ఇవ్వడం,

తీసుకోవడం రెండూ నేరమే

ఓటర్లకు లీడర్లు డబ్బులు పంచడం, ఓటర్లే తమకు డబ్బు అందలేదని ధర్నాలు చేయడం వంటి వాటిపై ఈసీ చర్యలు ఏమిటని మీడియా ప్రశ్నించగా.. తెలంగాణలో గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచిపెట్టిన సంఘటనలు ఉన్నాయని, వీటిపై ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని సీఈసీ రాజీవ్​ కుమార్​ తెలిపారు. డబ్బులు అందని వారు ధర్నాలు చేసినట్లు కూడా తమ దృష్టికి వచ్చిందన్నారు. ఓటుకు నోటు ఇవ్వడం, తీసుకోవడం.. రెండూ నేరమేనని, దీనిపై ఈసారి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరిహద్దుల్లో చెక్ పోస్ట్‌‌‌‌లు 89,  మొత్తం 148 చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అక్రమంగా నగదు,  మద్యం సరఫరా చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ ఏజెన్సీ లు ప్రతి వారానికి ఒకసారి రిపోర్ట్ చేస్తాయని, వాటికి తగ్గట్టుగా చర్యలు ఉంటాయన్నారు. ఎన్​ఫోర్స్​మెంట్​ ఏజెన్సీలు చర్యలు తీసుకోకపోతే.. చర్యలు తీసుకునేలా తాము చేస్తామని తెలిపారు. కుక్కర్లు, ఫ్యాన్లు, వంట సామాగ్రి, గార్మెంట్స్​ ఇతరత్రా స్టోర్​ చేసే గోదాముల దగ్గర చెకింగ్​ ఉంటుందని ఆయన తెలిపారు. అక్రమంగా నగదు, మద్యం సరఫరా చేస్తున్నట్లు ఎవరి దృష్టికి వచ్చినా సివిజిట్​ యాప్‌‌‌‌లో ఫొటో పెడితే 100 నిమిషాల్లో చర్యలు ఉంటాయని చెప్పారు. మనీ పవర్, ఫ్రీబీస్ వంటివి తమ ప్రత్యేక రాడార్‌‌‌‌లో ఉంటాయని తెలిపారు.

అర్బన్​ ప్రాంతాల్లో పోలింగ్​ పెంచాలి

జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 29 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అందులో 24 చోట్ల గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్త సగటు కంటే తక్కువ పోలింగ్ నమోదైందని సీఈసీ రాజీవ్​కుమార్​ తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో తక్కువ పోలింగ్ జరగడం బాధాకరమని, పోలింగ్​ శాతం పెరిగేలా ఓటర్లు ముందుకు రావాలని ఆయన కోరారు. ఓటర్లలో దాదాపు సగం మంది మహిళలు ఉన్నప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 13,400 పోలింగ్ కేంద్రాల్లో పురుషులకంటే తక్కువగా మహిళల పోలింగ్ నమోదైందన్నారు. హైదరాబాద్‌‌‌‌ మినీ భారత్‌‌‌‌ లాంటిదని, యంగెస్ట్​ స్టేట్​అని తెలంగాణకు ఎంతో ప్రాధాన్యం ఉందని తెలిపారు. పోలింగ్​లో ఓటర్లు తమ స్ఫూర్తిని చాటాలని ఆయన కోరారు. కాగా.. చెంచు, కొలాం, తోటి, కొండారెడ్డి తెగలకు చెందినవాళ్లందరికీ 100 శాతం ఓటు హక్కును కల్పించినట్లు సీఈసీ రాజీవ్​కుమార్​ తెలిపారు. వీరి సంఖ్య 59,583 ఉండగా.. ఇందులో 18 ఏండ్లు పైబడినోళ్లు 39,186 మంది ఉన్నారని, వీరందరికీ ఓటు హక్కు అందిందని చెప్పారు. వృద్ధులు ఇంటి వద్దే ఓటు వేయడానికి ఫామ్ 12డీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కేవైసీ అంటే నో యువర్​ క్యాండిడేట్​ ద్వారా అభ్యర్థుల  క్రిమినల్ బ్యాగ్రౌండ్​ చెక్ చేసుకోవచ్చని చెప్పారు.

22 లక్షల ఓట్లు తొలగింపు

రాష్ట్రంలో 22 లక్షల ఓట్లను తొలగించామని సీఈసీ రాజీవ్​కుమార్​ తెలిపారు. ఏకపక్షంగా ఓట్లు తొలగించామనడం సరికాదన్నారు. పారదర్శకంగా ఓటర్ల జాబితాను రూపొందించామని, ప్రతి ఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొనాలని ఆయన కోరారు.  అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రంలో 35,356 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. 100 ఏండ్లు దాటిన ఓటర్లు 7,689 మంది ఉన్నారని, కొత్తగా 8,11,640 మంది యువత ఓటు నమోదు చేసుకున్నారని ఆయన వివరించారు. 2018తో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో పోలింగ్ బూత్​లలో ఓటర్లకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పిస్తామన్నారు. 

అన్ని పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాం

తమ పర్యటనలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించామని, అన్ని పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని సీఈసీ రాజీవ్​కుమార్​ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించామన్నారు. అక్రమ నగదు, మద్యాన్ని కట్టడి చేయాలని.. సీఏపీఎఫ్,  మైక్రో అబ్జర్వర్లను పెంచాలని.. అర్బన్ ఏరియాల్లో ఓటింగ్​ పెంచాలని రాజకీయ పార్టీలు కోరాయని ఆయన వివరించారు. ‘‘ఎలక్షన్ల వ్యయం పెంచాలని ఒక పార్టీ కోరింది. సోషల్ మీడియా ప్రకటనలపై ఒక రేటు నిర్ణయించి..  వాటిని కూడా ఖర్చులో కలపాలని మరో పార్టీ కోరింది. ఫ్యామిలీ ఓటర్లకు ఒకే పోలింగ్​ కేంద్రంలో ఓటు వేసేలా చూడాలని కొందరు, ఓటరు స్లిప్పులు సమయానికి పంపిణీ చేయాలని మరికొందరు కోరారు” అని తెలిపారు. ఒకరికి బదులు ఇంకొకరు ఓటు వేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించేలా చూడాలని కూడా రాజకీయ పార్టీలు తమ మీటింగ్​లో విజ్ఞప్తులు చేశాయని వివరించారు.