ఎలక్షన్‌‌ కమిషన్‌‌ షాక్‌‌ .. జనసేనకు దక్కని గాజు గ్లాసు

ఎలక్షన్‌‌ కమిషన్‌‌ షాక్‌‌ ..  జనసేనకు దక్కని గాజు గ్లాసు

హైదరాబాద్‌‌, వెలుగు : జనసేన పార్టీకి ఎలక్షన్‌‌ కమిషన్‌‌ షాక్‌‌ ఇచ్చింది. తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచిన ఆ పార్టీకి గ్లాస్‌‌ గుర్తును కేటాయించలేదు. ఆ సింబల్​ను రిజర్వ్‌‌లో పెట్టడంతో జనసేన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. పార్టీ బలం ఉన్న  8 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపింది. అభ్యర్థులంతా గ్లాస్‌‌ గుర్తుతో ప్రచారం  షురూ చేశారు. తాజా పరిణామాల  నేపథ్యంలో పవన్‌‌ కల్యాణ్‌‌ పార్టీ ఏం చేస్తుందనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

గుర్తింపు పొందక పోవడంతోనే..

జనసేనకు తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు లేకపోవడంతోనే సింబల్‌‌ ప్రాబ్లమ్‌‌ తలెత్తింది. జనసేన రాష్ట్రంలో కేవలం రిజిస్టర్డ్‌‌ పార్టీయే. రికగ్నైజ్డ్‌‌ పార్టీ కావాలంటే గత ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు  పోలైన ఓట్లలో నిర్ణీత శాతం ఓట్లు పొందాల్సి ఉంటుంది. నిబంధనలకు తగిన ఓట్ల శాతం పొందని కారణంగానే ఆ పార్టీకి గుర్తు దక్కలేదు.  గ్లాస్‌‌ గుర్తు జనసేనకు దక్కని పరిస్థితిలో ఆ పార్టీ అభ్యర్థులను స్వతంత్రులుగా పరిగణిస్తారని చర్చ జరుగుతున్నది. దీంతో జనసేన అభ్యర్థులకు ఒక్కొక్కరికి ఒక్కో గుర్తు కేటాయిస్తారా? తాత్కాలికంగా 8 మంది ఒకటే కోరుకుంటారా? అనేది తేలాల్సి ఉంది.