
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానం ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ ప్రకటించింది. దీంతోపాటు బీహార్‌లోని రెండు సీట్లు, మహారాష్ట్రలోని ఒక సీటుకు కూడా షెడ్యూల్ ఇచ్చింది. ఈ నెల 21న నోటిఫికేషన్ ఇస్తారు. నామినేషన్ల దాఖలుకు 28 ఆఖరు తేదీ. 29న స్క్రూటినీ. ఉప సంహరణకు 31 ఆఖరు తేదీ. జూన్ 7న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లు లెక్కిస్తారు.
టీఆర్‌ఎస్ ఖాతాలోకే సీటు
2016లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన మైనంపల్లి హన్మంతరావు అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంతో ఈ స్థానానికి డిసెంబర్ 30న రాజీనామా చేశారు. అధికార టీఆర్‌ఎస్ సంఖ్యాబలం దృష్ట్యా ఈ స్థానం ఆ పార్టీ ఖాతాలోనే చేరనుంది.
గుత్తాకు అవకాశం
నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్ నాయకత్వం భావిస్తోంది. నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో దించాలని పార్టీ భావించినా కాంగ్రెస్ సిట్టింగ్ సీటు నుంచి పోటీకి ఆయన ఆసక్తి చూపలేదు.