రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ రిలీజ్

రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ రిలీజ్

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్  రిలీజ్ అయ్యింది. ఈ మేరకు  విజ్ఞాన్ భవన్ లో నిర్వహించిన  మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం  నోటిఫికేషన్ ను విడుదల చేసింది.  నామినేషన్లకు  జూన్ 29 చివరి తేదీ కాగా... నామినేషన్ల స్క్రుటినీ జూన్ 30న,   నామినేషన్ల విత్ డ్రాకు జులై 2 వరకు కమిషన్ గడువు విధించింది. ఇక జులై 18న రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ నిర్వహించనున్నారు. జులై 21న కౌంటింగ్ జరగనుంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24న ముగియనుంది.  జులై 25న  కొత్త రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది.  

Image

ఎన్నిక ప్రక్రియ.. 

రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఇందులో పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాలు, ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా ఉంటారు. వీరంతా కలిసి ఓటు హక్కు ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ఎమ్మెల్యేలు,  ఎంపీలు బ్యాలెట్ పేపర్లలో తమ మొదటి ఎంపిక (చాయిస్), రెండో ఎంపిక, మూడో ఎంపిక లను టిక్ చేస్తారు. మొదటి ఎంపిక ఓట్లను తొలుత లెక్కిస్తారు. మొదటి ఎంపిక ఓట్లను మెజారిటీ సంఖ్యలో పొందే రాష్ట్రపతి అభ్యర్థిని గెలిచినట్లుగా ప్రకటిస్తారు. అందులో ఎవరికీ సరైన మెజారిటీ రాకపోతే.. రెండో, మూడో ఎంపిక ఓట్లను కూడా లెక్కిస్తారు.  

Image

 

తెలంగాణ, ఏపీ ఎమ్మెల్యే ఓటు విలువ.. 

ఈ ఎన్నికలో ఎమ్మెల్యేల ఓటు విలువ ఓ విధంగా, ఎంపీల ఓటు విలువ మరో విధంగా ఉంటుంది. 2017 లెక్కల ప్రకారం.. ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 4,896 మంది సభ్యులు(ఉభయ సభల ఎంపీలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలు)  ఉన్నారు. వీరిలో 4,120 మంది ఎమ్మెల్యేలు, 776 మంది ఎంపీలు. తొలుత ఒక రాష్ట్ర జనాభాను , ఆ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేల సంఖ్యతో భాగించాలి. అలా వచ్చే విలువను 1000తో భాగించగా వచ్చేదే.. ఆ రాష్ట్రంలోని ఎమ్మెల్యేల ఓటు విలువ. ఈ లెక్కల ప్రకారం.. రాష్ట్రపతి ఎన్నికల్లో  ఒక్కో తెలంగాణ ఎమ్మెల్యే ఓటు విలువ 132.  ఒక్కో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ఓటు విలువ 159. 
జులై 25లోగా కొత్త రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించాలి