
పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయన్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి. బ్యాలెట్ పత్రాలు తారుమారు కావడం వల్ల మూడు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలన్నారు. ఈ ఎన్నికల్లో కోటీ 20 లక్షల 86 వేల 395 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారని చెప్పారు. మొత్తం 77.46 శాతం పోలింగ్ నమోదైందన్నారు. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 87.02 శాతం, అత్యల్పంగా వికారాబాద్ జిల్లాలో 70.40 శాతం పోలింగ్ నమోదయ్యిందని చెప్పారు.
మే 27న కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నామని.. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుందన్నారు ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి. 123 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. ఓట్ల లెక్కింపు కోసం 11882 మంది సూపర్ వైజర్లు, 23647 అసిస్టెంట్లు పనిచేస్తారని అన్నారు . 5659 స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. మూడు దశల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు . ఒక్కో ఎంపీటీసీకి రెండు కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు . ఒక్కో రౌండ్ లో వెయ్యి ఓట్ల లెక్కింపు చేపడతారని.. ఎంపీటీసీ కౌంటింగ్ పూర్తయ్యాక జెడ్పీటీసీ ఓట్లు లెక్కిస్తారని చెప్పారు .అన్నింటినీ పూర్తి స్థాయిలో పరిశీలించాకే అధికారులు ఏకగ్రీవ స్థానాలను ప్రకటిస్తారని చెప్పారు.