Big Breaking : గ్లాస్ ఉంటదా! : ఇండిపెండెంట్లుగా జనసేన అభ్యర్థులు?

Big Breaking : గ్లాస్ ఉంటదా! : ఇండిపెండెంట్లుగా జనసేన అభ్యర్థులు?

= తెలంగాణలో గుర్తింపులేకపోవడమే కారణం
= ఎనిమిది సెగ్మెంట్లలో సింబల్ ప్రాబ్లం
= బీజేపీ వెంటాడుతున్న పొత్తు కష్టాలు

హైదరాబాద్: బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగుతున్న జనసేనకు గ్లాస్ గుర్తు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. జనసేన.. ఏపీలో మాత్రమే  ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందింది. తెలంగాణలో ఆ పార్టీకి ఎలాంటి గుర్తింపు లేకపోవడమే కారణమని సమాచారం. బీజేపీ, జనసేన పొత్తులో బాగంగా ఎనిమిది సెగ్మెంట్ల నుంచి ఆ పార్టీ అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. వారికి సిమిలర్ గుర్తు కాకుండా ఇండిపెండెంట్లుగా పరిగణిస్తూ ఏదేని ఒక గుర్తు కేటాయించే అవకాశం ఉంది.  జనసేనకు కేటాయించిన సెగ్మెంట్లలో  బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మాత్రం దానికి జనసేనతో ఎందుకు పొత్తు పెట్టుకున్నట్టు..? అనే వాదన బలంగా వినిపిస్తోంది. పొత్తు పెట్టుకోకుండా ఉంటే తమకు అవకాశం దక్కదంటున్నారు. ఏండ్ల తరబడి పార్టీకోసం కష్టపడిన తమకు టికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రధానంగా కూకట్ పల్లి  విషయంలో రెండు పార్టీల నేతల మధ్య  కొద్ది రోజుల పాటు ప్రతిష్టంబన నెలకొన్న విషయం తెలిసిందే. కీలక స్థానాలను పార్టీ జనసేనకు వదులుకుందని బీజేపీ లీడర్లు నాంపల్లి ఆఫీసు వద్ద ధర్నాకు దిగారు. ఇంత జరిగినా కూకట్  పల్లి స్థానుం నుంచి అంతకు ముందు రోజే బీజేపీ నుంచి జనసేనలో చేరిన ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కు కేటాయించారు. ఆ పార్టీకి తెలంగాణలో నిర్మాణం లేదని, కేవలం పవన్ అభిమానులు మాత్రమే ఉన్నారని తాము ఎంత చెప్పినా అధినాయకత్వం వినిపించుకోలేదని బీజేపీ నాయకులే  అంటుండటం గమనార్హం. 

8 సెగ్మెంట్లలో  ఏమేం గుర్తులొస్తాయో..?

జనసేన పోటీ చేస్తున్న 8 సెగ్మెంట్లలో అభ్యర్థులకు ఏమేం గుర్తులు కేటాయిస్తారు..? తాము ఎలా ప్రచారం చేయాలన్న టెన్షన్ కమలనాథులను వెంటాడుతున్నది.  కూకట్‌పల్లి  నుంచి  ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, తాండూరు నుంచి  నేమూరి శంకర్ గౌడ్, కోదాడ నుంచి  మేకల సతీష్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి  వంగల లక్ష్మణ్ గౌడ్, ఖమ్మం నుంచి  మిర్యాల రామకృష్ణ, కొత్తగూడెం నుంచి  లక్కినేని సురేందర్ రావు, వైరా (ఎస్టీ) నుంచి   తేజావత్ సంపత్ నాయక్, అశ్వారావుపేట(ఎస్టీ) నుంచి  ముయబోయిన ఉమాదేవి జనసేన తరఫున పోటీలో ఉంటున్నారు. వీరికి గ్లాస్ గుర్తుకు బదులుగా ఏం గుర్తులు కేటాయిస్తారనేది ఉపసంహరణల తర్వాత తేలనుంది.