బీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్!.. ప్రతిపక్షాలను బలహీనం చేసే ప్లాన్

బీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్!.. ప్రతిపక్షాలను బలహీనం చేసే ప్లాన్
  • ఇప్పటికే కాంగ్రెస్‌ నుంచి కుంభం సహాలో కీలక నేతల చేరిక
  • తాజాగా బీజేపీ నుంచి కౌన్సిలర్‌‌, జిల్లా వైస్ ప్రెసిడెంట్..
  • మరికొందరికి గాలం వేస్తున్న బీఆర్ఎస్ నేతలు
  • నిరసనగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌ ముట్టడించిన బీజేపీ కార్యకర్తలు

యాదాద్రి, వెలుగు: ఎన్నికలు సమీపిస్తుండడంతో బీఆర్‌‌ఎస్‌ ఆపరేషన్ ఆకర్ష్‌ మొదలు పెట్టింది.  ప్రతిపక్షాలను బలహీనం చేయడమే లక్ష్యంగా కీలక నేతలకు గాలం వేస్తోంది.  ఇప్పటికే మాజీ డీసీసీ ప్రెసిడెంట్ కుంభం అనిల్‌ కుమార్‌‌ రెడ్డితో పాటు పలువురు నేతలను పార్టీలో చేర్చుకున్న బీఆర్‌‌ఎస్‌.. తాజాగా బీజేపీ కౌన్సిలర్ లక్ష్మి, బీజేపీ జిల్లా వైస్‌ ప్రెసిడెంట్ నీలం రమేశ్‌కు గులాబీ కండువా కప్పింది. ఇటీవల బీజేపీ నుంచి బీఆర్ఎస్​లో చేరిన ఓ లీడర్​ఆధ్వర్యంలో మరికొందరు కౌన్సిలర్లు, కీలక నేతలతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. హాట్రిక్​ కొట్టాలని తహతహలాడుతున్న బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్​రెడ్డి, గొంగిడి సునీత నేతృత్వంలోనే ఇదంతా జరుగుతోందని తెలుస్తోంది. 

అన్ని మండలాలపై దృష్టి

జిల్లాలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లోని 12 మండలాలు, ఐదు మున్సిపాలిటీలపై బీఆర్‌‌ఎస్‌ దృష్టి పెట్టింది. మండలాల్లో బీఆర్ఎస్​తో సమానంగా కాంగ్రెస్​బలంగా ఉంది. బీజేపీ కాస్త వెనుకబడినా కొన్నాళ్లుగా పుంజుకుంటోంది. మున్సిపాలిటీలకు వరకొస్తే  బీర్‌‌ఎస్‌, కాంగ్రెస్‌కు ధీటుగా బీజేపీకి క్యాడర్‌‌ ఉంది.  మున్సిపల్‌ ఎన్నికల్లో చైర్మన్​ సీట్లను బీఆర్​ఎస్​ దక్కించుకున్నా.. కాంగ్రెస్‌తో సమానంగా బీజేపీకి కౌన్సిలర్లు ఉన్నారు. బీఆర్‌‌ఎస్‌ ప్రస్తుతం వీరితో పాటు సెకండ్ క్యాడర్‌‌ను టార్గెట్ చేసింది.  అసంతృప్తిగా ఉన్న లీడర్లతో పాటు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారిని గుర్తింస్తోంది.  ముఖ్య లీడర్లను వారి వద్దకు పంపించి అవసరాలను తీరుస్తామని చెప్పిస్తోంది. 

కాంగ్రెస్‌కు షాకిచ్చిన బీఆర్​ఎస్​

బీఆర్‌‌ఎస్‌ పార్టీ డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం అనిల్​కుమార్​ రెడ్డిని పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్‌కు పెద్ద షాక్‌ ఇచ్చింది. ఆయన చేరికతో కాంగ్రెస్​కు ఆర్థిక వనరులున్న లీడర్ ​లేకుండా పోయారు.  ఈయనతో పాటు భువనగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ దోనకొండ వనిత, లీడర్లు బీసుకుంట్ల సత్యనారాయణ, బెండ శ్రీకాంత్, ఎల్లంల జంగయ్య,  ఆలేరు నియోజకవర్గానికి చెందిన నలుగురు సర్పంచులను కారు ఎక్కించింది.  ప్రస్తుతం భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్​ బలంగా ఉన్న వలిగొండ, భూదాన్​ పోచంపల్లి, భువనగిరి మున్సిపాలిటీ, ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట, బొమ్మల రామారం, గుండాల,ఆలేరు మండలాల్లోని క్యాడర్‌పై ఫోకస్ పెట్టింది.

బీజేపీపై దృష్టి 

ఇప్పటి వరకూ కాంగ్రెస్​ను మాత్రమే టార్గెట్​ చేసుకున్న బీఆర్​ఎస్​ ఇప్పుడు బీజేపీపై దృష్టి సారించింది. గడిచిన వారం రోజులుగా భువనగిరి మున్సిపాలిటీలోని బీజేపీకి చెందిన పలువురు కౌన్సిలర్లతో పాటు లీడర్లతో బీఆర్​ఎస్​ లీడర్లు సంప్రదింపులు జరుపుతున్నారు. వారిలో ఆర్థిక సమస్యలతో పాటు అసంతృప్తిగా ఉన్న వారిని గుర్తించి, నేరుగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డితోనే మాట్లాడించినట్టుగా సమాచారం.  భువనగిరి మున్సిపాలిటీకి చెందిన ఆ పార్టీ కౌన్సిలర్​ ఊదరిలక్ష్మి, బీజేపీ జిల్లా కార్యదర్శి నీలం రమేశ్​ను బీజేపీలోకి చేరేలా ఒప్పించారు.  వీరిద్దరు మరికొందరితో కలిసి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి సమక్షంలో బుధవారం బీఆర్‌‌ఎస్ కండువా కప్పుకున్నారు.

ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​ ముట్టడి

బీజేపీ నేతలను బీఆర్‌‌ఎస్‌లో చేర్చుకోవడం ఆ పార్టీ నేతలు నిరసన తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌‌ రెడ్డి క్యాంప్‌ ఆఫీస్‌ ముట్టడించారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు ఆయన ప్లెక్సీని దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీని  దెబ్బ తీసేందుకు వలసలు ప్రోత్సహిస్తున్నారని, డబ్బులు ఎరగా వేసి తమ లీడర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని బీజేపీ ప్లోర్​ లీడర్​ మాయ దశరథ, చందా మహేందర్​ గుప్తా, రత్నపురం బలరాం, మహమూద్​ సహా మరికొందరిని అరెస్ట్​ చేసి పీఎస్​కు తరలించారు.