సింగరేణి గుర్తిపు సంఘం ఎన్నికల్ని నిర్వహించలేం

సింగరేణి గుర్తిపు సంఘం  ఎన్నికల్ని నిర్వహించలేం

హైదరాబాద్, వెలుగు: వరుస పండుగలు, అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ ఆఫీసర్లతో సమావేశాలు, ఈ పరిస్థితుల్లో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను ఇప్పుడు నిర్వహించలేమని సింగరేణి  మేనేజ్​మెంట్‌‌ హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది. ఈ ఏడాది అక్టోబర్‌‌లోగా సింగరేణి సంఘానికి ఎన్నికలు నిర్వహించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. ఆ గడువు సమీపిస్తున్న తరుణంలో యాజమాన్యం తాజా పిటిషన్‌‌ను దాఖలు చేసింది. అక్టోబర్‌‌లోగా  ఎన్నికలు నిర్వహించలేమని, మరికొంత గడువు కావాలని మేనేజ్​మెంట్‌‌ పిటిషన్‌‌లో హైకోర్టును కోరింది. 

ఆరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు కూడా ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖలు రాశారని తెలిపింది.  ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించలేమని చెప్పింది. తొలుత సింగరేణి కోల్‌‌మైన్‌‌ వర్కర్స్‌‌ యూనియన్‌‌ తరఫున సీనియర్‌‌ న్యాయవాది జి.విద్యాసాగర్‌‌ వాదనలు వినిపిస్తూ..2019లోనే గుర్తింపు సంఘం కాల పరిమితి ముగిసిందని గుర్తు చేశారు. 

గత నాలుగేండ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం ఏదో ఒక సాకు చెబుతోందన్నారు. 11 జిల్లాల పరిధిలో  దాదాపు 42 వేల మంది కార్మికులున్న సింగరేణికి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించకపోవడం చట్ట వ్యతిరేకమన్నారు. సింగరేణి యాజమాన్యం పిటిషన్‌‌ను అనుమతించవద్దని కోరారు. దీంతో జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డి పిటిషన్​విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.