యూపీలో 11 ఎమ్మెల్యే సీట్లకు.. త్వరలో ఎన్నికలు

యూపీలో 11 ఎమ్మెల్యే సీట్లకు.. త్వరలో ఎన్నికలు

14 రాష్ట్రాల్లోని 49   అసెంబ్లీ సీట్లకు  వచ్చే ఆర్నెళ్లలో  ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ సీట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలంతా తాజా లోక్‌‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఉత్తరప్రదేశ్‌‌ నుంచి అత్యధికంగా 11 మంది ఎమ్మెల్యేలు లోక్‌‌సభకు  ఎన్నికైయ్యారు. ఆరుగురు ఎమ్మెల్యేలతో మహారాష్ట్ర రెండో ప్లేస్‌‌లో, ఐదుగురు  ఎమ్మెల్యేలతో  బీహార్‌‌ మూడోస్థానంలో ఉంది.  వీటితోపాటు మరో రెండు ఎమ్మెల్సీ, నాలుగు రాజ్యసభ సీట్లకు కూడా ఎన్నికలు జరగనున్నాయి.  ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌‌ పట్నాయక్‌‌  హింజిలి, బీజేపూర్‌‌ రెండు అసెంబ్లీ సీట్లలోనూ గెలిచారు. అంచేత ఆయన ఒక సీటుకు రాజీనామా చేయాల్సి ఉంది. జార్ఖండ్‌‌కు చెందిన ఇద్దరు  ఎమ్మెల్యేలు కూడా ఎంపీలుగా గెలిచారు. ఆ రాష్ట్ర అసెంబ్లీకి మరో ఆర్నెళ్లలో ఎన్నికలు జరగనున్నందున… అసెంబ్లీ ఎలక్షన్లతోపాటే ఆ రెండు సీట్లకూ ఎన్నికలు జరిగే అవకాశముంది. యూపీలో బీజేపీ తరపున ఎనిమిది మంది, బీఎస్పీ, ఎస్పీ, అప్నాదళ్‌‌కు చెందిన ఒక్కో ఎమ్మెల్యే లోక్‌‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. వీరిలో ముగ్గురు ఆదిత్యనాథ్‌‌ సర్కార్‌‌ కేబినెట్లో  మంత్రులుగా కూడా ఉన్నారు. బీహార్లో ఐదుగురు ఎమ్మెల్యేలతోపాటు ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా లోక్‌‌సభకు ఎన్నికయ్యారు.  నితీశ్‌‌కుమార్‌‌ ప్రభుత్వంలో ముగ్గురు మంత్రులుగా పనిచేస్తున్నారు. ముగ్గురు జేడీయూ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌‌ ఎమ్మెల్యే కూడా లోక్‌‌సభ ఎన్నికల్లో గెలిచారు. ఒడిశాకు చెందిన నలుగురు బిజూ జనతాదళ్‌‌ రాజ్యసభ ఎంపీలు లోక్‌‌సభకు ఎన్నికయ్యారు. దీంతో వాళ్లు రాజీనామా చేసిన సీట్లకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది.