
- ఖర్చులకు ఎక్కడి నుంచి తేవాలని హైరానా
- ఇప్పటి నుంచే నిధుల సమీకరణపై కొందరి ఫోకస్
- ఉన్న జాగలు, ఆస్తులు అమ్ముకునే ప్రయత్నాలు
- దేశంలోనే కాస్ట్లీ ఎన్నికగా నిలిచిన హుజూరాబాద్ బైపోల్
- ఆ ఎఫెక్ట్ రాబోయే ఎన్నికలపై ఉండొచ్చని అంచనా
ఈ డిసెంబర్లో.. లేదా.. వచ్చే ఏడాది మార్చిలో..!
వాస్తవానికి రాష్ట్రంలో 2023 డిసెంబర్ నాటికి అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. కానీ, ఇప్పుడున్న పరిస్థితి చూస్తే మాత్రం 2022 డిసెంబర్.. లేదంటే 2023 మార్చిలో ముందస్తు ఎన్నికలకు పోనున్నారనే ప్రచారం రాజకీయాల్లో జోరుగా సాగుతున్నది. లాస్ట్ టైం టర్మ్ ముగియడానికి ఎనిమిది తొమ్మిది నెలలు ఉండగానే సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అప్పుడు 2019 ఏప్రిల్, మేలో జరగాల్సిన ఎన్నికలు ముందస్తు వల్ల 2018 డిసెంబర్లోనే జరిగాయి. ఇప్పుడు కూడా ముందస్తు ఎన్నికలకు పోవాలని టీఆర్ఎస్ చూస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తే ఎట్లా అని ప్రతిపక్ష పార్టీల లీడర్లు టెన్షన్ పడుతున్నారు. టికెట్ కన్నా.. ఎన్నికల్లో చేయాల్సిన ఖర్చు గురించే ఎక్కువగా మదనపడుతున్నారు. పోటీ చేసేందుకు సిద్ధమే కానీ.. ఖర్చు పెట్టడానికి కోట్లకు కోట్ల డబ్బు ఎక్కడి నుంచి తేవాలని ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో నానాటికీ ఎన్నికల ఖర్చు పెరిగిపోతున్నది. ఇటీవల హుజూరాబాద్‌లో జరిగిన ఉప ఎన్నిక దేశంలోనే అత్యంత కాస్ట్లీగా నిలిచింది. ఈ ఎఫెక్ట్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు అధికార పార్టీ లీడర్లు సిద్ధమై ఉంటే.. ప్రతిపక్ష పార్టీల నేతలు మాత్రం డబ్బుల కోసం తంటాలు పడుతున్నారు. కరోనాతో రెండేండ్లుగా వ్యాపారాలన్నీ
కుదేలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలు జరిగితే అప్పటికప్పుడు డబ్బులు పుట్టడం కష్టమని లీడర్లు భావిస్తున్నారు. కొందరు ఇప్పటి నుంచే నిధుల సేకరణకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెలిసినవాళ్ల దగ్గర సర్దుబాట్ల కోసం ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.
సీఎం కేసీఆర్ ఇటు పాలన పరంగా, అటు పార్టీ వ్యవహారాల్లో అనుసరిస్తున్న తీరును చూస్తే ‘ముందస్తు’ మాటకు బలం చేకూర్చినట్లుగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రతిపక్షాల నేతలు కూడా ఈ మధ్య పదే పదే ‘ముందస్తు’ మాటను వాడుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని, అందుకు పార్టీ లీడర్లు, కేడర్ సిద్ధంగా ఉండాలని బీజేపీ సమావేశాల్లో ఆ పార్టీ ఇన్చార్జ్ తరుణ్ చుగ్, పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, ఇతర నేతలు ప్రస్తావిస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా.. కేసీఆర్ ముందస్తుకు పోనున్నారని పలు సందర్భాల్లో అన్నారు. ఇట్ల ప్రతిపక్ష పార్టీల పెద్దలు కూడా తమ కేడర్‌ను ముందస్తుకు అలర్ట్ చేస్తున్నారు.
ఇప్పటి నుంచే సర్దుబాట్లకు ఏర్పాట్లు
ప్రతిపక్షాల్లోని కొందరు లీడర్లు మాత్రం ఎన్నికల ఖర్చును భరించే స్థాయిలో ఇప్పటి నుంచే సర్దుబాట్లు చేసుకుంటున్నారు. తమకున్న భూములను, ఇతర ఆస్తులను అమ్మడంపై ఫోకస్ పెడుతున్నారు. తమకు సన్నిహితంగా ఉండే వ్యాపార వర్గాలు, పారిశ్రామిక వేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ విషయం చెపుతూ నిధుల సమీకరణలో బిజీగా ఉన్నారు. వడ్డీ వ్యాపారులతో ముందుగానే మాట్లాడుకొని ఇంత డబ్బు అవసరం ఉంటుందని, ఏ సమయంలో నైనా సర్దుబాటు చేయాలంటూ ముందస్తుగా ఒప్పందాలు చేసుకునే పనిలో పడ్డారు. మరికొందరు నేతలు.. తమ వ్యాపార విస్తరణను తాత్కాలికంగా ఆపుతున్నారు. ఇప్పుడు వ్యాపారాల్లో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే ఎన్నికల ఖర్చు కష్టమవుతుందని పెట్టుబడులు పెట్టడం వాయిదా వేసుకుంటున్నారు. ఇంకొందరు లీడర్లు.. ముందస్తు ఎన్నికల విషయం తమ వ్యాపార భాగస్వాముల చెవిన వేస్తూ, ఎప్పుడైనా డబ్బు సమాకూర్చేలా నిధులను అందుబాటులో ఉంచాలని సూచిస్తున్నారు.
కుమ్మరిచ్చుడు పనిచేయదంటున్న మరికొందరు..!
రెండు టర్మ్‌ల టీఆర్ఎస్ పాలనపై జనం విసిగిపోయారని, ఈ సారి తాము అసెంబ్లీలో అడుగుపెట్టాల్సిందేనని బీజేపీ, కాంగ్రెస్ నేతలు చాలామంది గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో కొందరు ఎన్నికల ఖర్చుపై ఆందోళనతో ఉండగా.. మరి కొందరు మాత్రం బేఫికర్‌గా ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందని, కాబట్టి అధికార పార్టీ నేతల స్థాయిలో తాము ఖర్చు చేయాల్సిన పని ఉండదని అంటున్నారు. ఇందుకు హుజూరాబాద్ ఉప ఎన్నికనే ఉదాహరణగా చూపుతున్నారు. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ వందల కోట్ల రూపాయలు కుమ్మరించినా ప్రయోజనం దక్క లేదని, ఇప్పుడు ముందస్తు వచ్చినా అదే పరిస్థితి ఉంటుందని ఆ లీడర్లు అంచనా వేసుకుంటున్నారు.
టీఆర్ఎస్లో ‘ప్రజా వ్యతిరేకత’ బుగులు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆర్థికంగా పెద్దగా ఇబ్బందుల్లేవు. దీంతో ఎన్నికల ఖర్చుపై వారిలో టెన్షన్ లేకపోయినప్పటికీ.. సర్కార్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మాత్రం వెంటాడుతున్నది. రెండు టర్మ్‌లు చాన్స్ ఇచ్చిన ప్రజలు మరోసారి కూడా తమకే అవకాశం ఇస్తారని వాళ్లు పైకి చెప్తున్నా.. లోలోపల భయపడుతున్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓడిపోవడం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని కొందరు టీఆర్ఎస్ లీడర్లు కలవరపడుతున్నారు.