భారత క్రెడిట్ కార్డ్ మార్కెట్లో రూపే తన స్థాయిని వేగంగా పెంచుకుంటోంది. అక్టోబర్‌లో రూపే క్రెడిట్ కార్డుల మార్కెట్ వాటా 18 శాతానికి చేరిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీనితో అంతర్జాతీయ నెట్‌వర్క్‌లైన వీసా, మాస్టర్ కార్డ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌ల ఆధిపత్యాన్ని రూపే సవాలు చేస్తోంది. వాస్తవానికి రూపే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించే దేశీయ నెట్‌వర్క్. ప్రస్తుతం దేశంలో జారీ చేసిన క్రెడిట్ కార్డుల్లో సుమారు మూడవ వంతు రూపే కార్డ్స్ ఉన్నాయి. మొత్తం లావాదేవీల విలువలో రూపే కార్డ్స్ వాటా 25 శాతానికి దగ్గరలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఈ వృద్ధికి ప్రధాన కారణం రూపే క్రెడిట్ కార్డులు యూపీఐకి లింక్ చేసుకుని పేమెంట్స్ చేసేందుకు అవకాశం ఇవ్వటమే. యూపీఐ ప్రస్తుతం భారతదేశ డిజిటల్ చెల్లింపుల్లో సుమారు 85 శాతం వాటాను కలిగి ఉంది. కోవిడ్ తర్వాత డిజిటల్ పేమెంట్స్ విస్తరించటంతో దేశవ్యాప్తంగా "స్కాన్ అండ్ పే" లావాదేవీలు ప్రజాదరణ పొందాయి. దీనివల్ల రూపే- యూపీఐ క్రెడిట్ కార్డుల వినియోగం రోజువారీ చిన్న చెల్లింపుల్లో పెరిగిపోయింది.
రూపే రైజ్..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11 కోట్లు యాక్టివ్ క్రెడిట్ కార్డులు ఉన్నాయి. రూపే క్రెడిట్ కార్డుల నెలవారీ యూపీఐ లావాదేవీల విలువ రూ.18వేల కోట్లుగా ఉంది. పాయింట్ ఆఫ్ సేల్ లావాదేవీలతో కలిపి రూపే మొత్తం నెలవారీ వ్యయం రూ.35వేల కోట్లకు చేరింది. ఇది మొత్తం క్రెడిట్ కార్డ్ మార్కెట్‌లో 18 శాతానికి సమానం. ఏడాదిన్నర క్రితం రూపే నెలవారీ టర్నోవర్ కేవలం రూ.10వేల కోట్ల విలువైన లావాదేవీలు మాత్రమే నమోదు చేసింది. ప్రస్తుతం సగటు రూపే కార్డ్ ట్రాన్సాక్షన్ విలువ రూ.3వేల 400 ఉండగా.. మాస్టర్ కార్డ్ రూ.4వేల 300గా ఉంది. యూపీఐ ద్వారా నేరుగా ఆదాయం లేని ఫిన్‌టెక్ కంపెనీలకు రూపే క్రెడిట్ కార్డులు కొత్త ఆదాయ మార్గంగా మారింది.
►ALSO READ | Gold Rate: శుక్రవారం తగ్గిన గోల్డ్.. ఇవాళ హైదరాబాదులో తులం రేటు ఇలా..
రూపే క్రెడిట్ కార్డుల ద్వారా యూపీఐ పేమెంట్స్ చేయటం ద్వారా వినియోగదారులు 40–50 రోజుల వడ్డీ రహిత గడువు, రివార్డు పాయింట్లు, మారుమూల ప్రాంతాల్లోని వ్యాపారుల వద్ద చెల్లింపు సౌకర్యం పొందుతున్నారు. ప్రస్తుతం 90 లక్షల వ్యాపారులు కార్డులు అంగీకరిస్తుంటే.. యూపీఐ 35 కోట్లకు పైగా వ్యాపారుల వద్ద అందుబాటులో ఉంది. ఐపీఎల్‌కు రూపే రెండు సంవత్సరాలుగా బ్రాండ్ భాగస్వామి, వార్షికంగా రూ.100 కోట్లు ఖర్చు చేస్తుందంటే ఆదాయం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
చిన్న మొత్తాల లావాదేవీలకు బ్యాంక్ అకౌంట్‌పై ఆధారపడ్డ చెల్లింపులను ఇప్పుడు క్రెడిట్ వైపు మళ్లించే దిశగా ఫిన్‌టెక్‌లు కృషి చేస్తున్నాయి. ఎఫ్‌డి ఆధారంగా ఇచ్చే సెక్యూర్డ్ రూపే కార్డులు మొదటిసారి క్రెడిట్ వినియోగదారులకు కొత్త అవకాశం అందిస్తుండటంతో యూజర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూనే ఉంది. మెుత్తానికి రూపే క్రెడిట్ కార్డ్స్ డిజిటల్ చెల్లింపుల యుగంలో పెద్ద సక్సెస్ చూస్తున్నాయి.
