మరికల్, వెలుగు: మరికల్ మండల కేంద్రంలో జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఏబీవీపీ అధ్వర్యంలో నాయకులు, విద్యార్థులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఆందోళన చేయడానికి అనుమతి లేదని ఎస్సై రాము ఎంత చెప్పినా నాయకులు, విద్యార్థులు నిరసన విరమించలేదు. రోడ్డుపై బైఠాయించి ఎమ్మెల్యే వచ్చి హమీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని పట్టుబట్టారు.
ఏబీవీపీ జిల్లా అధ్యక్షులు నరేష్ మాట్లాడుతూ రెండు సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యేలు విద్యార్థులను మోసం చేశారని ఆరోపించారు. ఈ ఏడాది తప్పకుండా మంజూరు చేస్తామని ఎమ్మెల్యే చెబుతున్నారు కాని, చేయట్లేదని విమర్శించారు. ఇక్కడ ఇంటర్ కళాశాల లేకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లి వేలకు వేలు ఫీజులు కట్టి చదువుకుంటున్నారని అన్నారు.
వచ్చే విద్యా సంవత్సరానికి కళాశాల మంజూరు చేయించకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. అనంతరం ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. మండల అధ్యక్షులు బన్ని, వసంత్, రవి, రాకేష్, రాయుడు, ప్రశాంత్‌తో ధర్నాలో పాల్గొన్నారు.
