రేపే రాజ్యసభ ఎన్నికలు... సర్వం సిద్దం

రేపే రాజ్యసభ ఎన్నికలు... సర్వం సిద్దం

రాజ్యసభ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. రేపు 16 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. తక్కువ సీట్లకు ఎక్కువ మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మొత్తం 15 రాష్ట్రాల్లో 57 స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. వారిలో 11 రాష్ట్రాల నుంచి 41 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, హర్యానా నుంచి మిగిలిన 16 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఓపెన్ బ్యాలెట్ విధానంలో ఓటింగ్ నిర్వహిస్తారు. రాజ్యసభ ఎన్నికల్లో నోటా ఆప్షన్ ఉండదు.

రాజ్యసభ ఎన్నికలతో నేతల దృష్టి సడెన్ గా క్యాంపు రాజకీయాలపై మళ్లింది. రాజస్థాన్ లో ఇప్పటికే రిసార్ట్ రాజకీయాలు జరుగుతున్నాయి. రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యేలను జైపూర్ లోని దేవీ రతన్ రిసార్ట్ కు తరలించింది అధిష్టానం. దేవీ రతన్ రిసార్ట్ లో యోగా నిర్వహించారు బీజేపీ ఎమ్మెల్యేలు. రాజస్థాన్ లో 4 స్థానాలకు పోటీ ఏర్పడంతో.. ఎమ్మెల్యేలను రిసార్ట్ కు తరలించారు. బీజేపీకి సంఖ్య బలం లేకున్న రాజస్థాన్ లో అభ్యర్థిని నిలబెట్టడంతో క్యాంప్ రాజకీయాలు ఊపందుకున్నాయి. ఇటు కాంగ్రెస్ కూడా తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడింది.

మహారాష్ట్రలో కూడా రాజకీయం రోజురోజుకు వేడెక్కుతుంది. ఇప్పటికే అధికార పార్టీ శివసేన తమ  ఎమ్మెల్యేలను బస్సుల్లో ముంబయిలోని ఓ హోటల్ కు తరలించింది. అక్కడ ఎమ్మెల్యేలకు రాజ్యసభ ఎన్నికలపై సూచనలు చేశారు ఉద్దవ్ ఠాక్రే. మహారాష్ట్రలో గత 22 ఏళ్లుగా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేవారు. కానీ ఈసారి మళ్లీ ఓటింగ్ జరగడంతో ఉత్కంఠ నెలకొంది. మహారాష్ట్రలో అత్యధికంగా 6 సీట్లకు ఎన్నికలు జరగుతున్నాయి.

కర్ణాటకలో కూడా దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తుంది.  కర్ణాటకలో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. జేడీఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు మాజీ ప్రధాని దేవెగౌడ రంగంలోకి దిగారు. ఇప్పటికే ఆయన సోనియా గాంధీతో ఫోన్ లో చర్చలు జరిపారు.  జేడీఎస్ తమ ఎమ్మెల్యేలను క్యాంప్ కు పంపించింది. అయితే ఇక్కడ బలం లేకున్న బీజేపీ మూడో  అభ్యర్థిని నిలబెట్టింది.

ఒక్కో అభ్యర్థిని గెలిపించుకోవాలంటే 45 ఓట్లు అవసరం కానున్నాయి. బీజేపీకి 122 మంది ఎమ్మెల్యే బలం ఉంది.  కాంగ్రెస్ కు 71 మంది సభ్యులున్నారు. జేడీఎస్ కు 31 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే కాంగ్రెస్ కూడా బలం లేకున్నా రెండో అభ్యర్థిని బరిలోకి దింపింది. దీంతో కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇక హర్యానాలో 2 సీట్లకు ఓటింగ్ జరగనుంది. హర్యానాలో  పోటీ వాతావరణం నెలకొంది.  నాలుగు రాష్ట్రాల్లోని అభ్యర్థులెవరూ పోటీ నుంచి తప్పుకోకపోవటంతో ఆయా రాష్ట్రాల్లో తీవ్ర పోటీ నెలకొంది.