అవినీతిలో మోదీ చాంపియన్: రాహుల్

అవినీతిలో మోదీ చాంపియన్: రాహుల్

బీజేపీకి 150 సీట్లు కూడా రావని తేల్చేసిన ఎంపీ
    ఏఎన్ఐకి మోదీ ఇచ్చిన ఇంటర్వ్యూ.. ఒక స్క్రిప్టెడ్
    పార్టీ ఆదేశిస్తే అమేథి నుంచి కూడా పోటీ చేస్తానని వెల్లడి

ఘజియాబాద్, న్యూఢిల్లీ:  ప్రధాని నరేంద్ర మోదీ అవినీతిలో చాంపియన్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ పథకం ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అని విమర్శించారు. ఇండియాలోని వ్యాపారవేత్తలందరికీ ఈ విషయం అర్థమైందన్నారు. సమాజ్​వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్​తో కలిసి రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ‘‘ఇండియా కూటమి బంపర్ మెజారిటీతో అధికారంలోకి వస్తుంది. బీజేపీకి 150 సీట్లు కూడా రావు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. ప్రధాని మోదీ ఏమో.. ఒకసారి సముద్రంలో లోపలికి వెళ్తారు.. ఒక్కోసారి సీ ప్లేన్​లో ప్రయాణిస్తారు. కానీ.. ప్రజా సమస్యలపై ఆయన మాట్లాడరు. ఏఎన్​ఐకు మోదీ ఇచ్చిన ఇంటర్వ్యూ అంతా స్క్రిప్టెడ్. బీజేపీ ఇచ్చిన ప్రశ్నలే.. ఏఎన్ఐ అడిగింది. వాటికి మోదీ ముందే జవాబులు రెడీ చేసి పెట్టుకున్నరు. అవే మన ముందు చదివి వినిపించారు. ఇదంతా స్క్రిప్టెడ్’’అని ఎద్దేవా చేశారు. ఇంటర్వ్యూ ఒక ఫ్లాప్ షో అని విమర్శించారు.

బాండ్ల వివరాలు బయటపెట్టాలి

రాజకీయాల్లో పారదర్శకత తీసుకొచ్చేందుకే ఎలక్టోరల్​బాండ్ల స్కీమ్ తీసుకొచ్చామన్న మోదీ కామెంట్లను రాహుల్ ఖండించారు. అంత మంచి ఆలోచనతో స్కీమ్ తీసుకొస్తే సుప్రీం కోర్టు ఎందుకు రద్దు చేసిందని మోదీని రాహుల్ ప్రశ్నించారు. ‘‘పారదర్శకత కోసమే తీసుకొచ్చినట్టు మీరు చెప్తున్నరు.. మరీ మీ పార్టీకి వేల కోట్ల రూపాయలు ఇచ్చిన కంపెనీల పేర్లు, వ్యక్తుల గురించి ఎందుకు చెప్పడం లేదు? ఈ విషయంలో పారదర్శకత ఎందుకు పాటించడం లేదు? డేటా మొత్తం ఎందుకు దాచి పెడ్తున్నది’’అని మోదీని రాహుల్ ప్రశ్నించారు. ‘‘ఏదైనా ఒక కంపెనీకి వేల కోట్లు విలువ చేసే కాంట్రాక్ట్​లను బీజేపీ ప్రభుత్వం అప్పజెప్తే.. ఆ కంపెనీ కొన్ని రోజుల తర్వాత పెద్ద మొత్తంలో డొనేషన్ ఇచ్చినట్టు స్పష్టమైంది. డొనేషన్లు ఇచ్చేందుకు నిరాకరించిన కంపెనీలపై సీబీఐ, ఈడీతో దాడులు చేయించారు. ఒకవేళ వాళ్లు దిగొచ్చి డొనేషన్లు ఇస్తే.. వారిపై ఎంక్వైరీ ఆగిపోతుంది’’అని రాహుల్ ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్ల మీద ప్రధాని మోదీ ఎంత వివరణ ఇవ్వాలనుకున్నా ఎలాంటి మార్పూ ఉండబోదని స్పష్టం చేశారు.

రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నరు

ప్రస్తుత ఎన్నికలు ఐడియాలజీకి సంబంధించిన ఎన్నికలని రాహుల్ అన్నారు. ‘‘ఒకవైపు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేసేందుకు ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌, బీజేపీ ప్రయత్నిస్తుండగా.. మరోవైపు ఇండియా కూటమి ఆ రెండు వ్యవస్థలను రక్షించేందుకు కష్టపడుతున్నది’’ అని తెలిపారు. అలాగే.. అమేథీలో పోటీ చేయడంపై రాహుల్ స్పందిస్తూ.. పార్టీ ఆదేశిస్తే తప్పకుండా అక్కడి నుంచి కూడా పోటీ చేస్తానన్నారు. యూపీలో కాంగ్రెస్, ఎస్పీ కలిసి పోటీ చేస్తున్నాయన్నారు. ఇక్కడ సీట్ల షేరింగ్ అంశం అంతా ముఖ్యం కాదని.. ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని రాహుల్​ చెప్పారు.

కూటమి అభ్యర్థులను గెలిపించాలి

ప్రజలు, రైతులు, కార్మికులతో పాటు వ్యాపారులకు మేలు జరగాలంటే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని రాహుల్ కోరారు. కర్నాటకలోని మాండ్యాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘‘బీజేపీ అధికారంలోకి వస్తే 22 నుంచి 25 మంది కోసమే పని చేస్తుంది. అదే ఇండియా కూటమి అధికారంలోకి వస్తే పేద, మధ్య తరగతి, సాధారణ ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుంది. ఎన్నికల బాండ్ల రద్దు బీజేపీకి చెంపపెట్టు. అదొక పెద్ద స్కామ్. ఏఎన్​ఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలక్టోరల్ బాండ్ల మీద ప్రశ్నిస్తే.. మోదీ చేతులు వణికాయి. వీడియో చూస్తే స్పష్టంగా తెలుస్తది. ఎలక్టోరల్ బాండ్లు అనేవి పెద్ద స్కామ్ అన్నది ఆయనకు కూడా తెలుసు’’అని విమర్శించారు.