ఆర్టీసీని కాపాడేందుకే.. సర్కార్​లో విలీనం చేశాం: పువ్వాడ అజయ్

ఆర్టీసీని కాపాడేందుకే.. సర్కార్​లో విలీనం చేశాం: పువ్వాడ అజయ్

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీని కాపాడుకునేందుకే సంస్థను ప్రభుత్వంలో విలీనం చేశామని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ఈ నెల 15 నుంచే ఆర్టీసీ కార్మికులు.. ప్రభుత్వ ఉద్యోగులుగా మారారని తెలిపారు. బుధవారం గచ్చిబౌలి స్టేడియం దగ్గర 25 గ్రీన్ మెట్రో లగ్జరీ బస్సులను జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. గెజిట్ రావడంతో త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తుందని, తర్వాత అధికారుల కమిటీ ఏర్పాటు, రూల్స్ ప్రాసెస్ అంతా నెల రోజుల్లో పూర్తవుతాయన్నారు. తన హయాంలోనే ఆర్టీసీ విలీన బిల్లు పాస్ కావడం ఆనందంగా ఉందని చెప్పారు. 

సిటీలో పొల్యూషన్ పెరగకుండా మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. త్వరలో మరో 1,860 డీజిల్ బస్సులు కొనుగోలు చేస్తామని వివరించారు. ప్రతి వ్యక్తికీ ఆర్టీసీతో ఎంతో అనుబంధం ఉందని, 25 గ్రీన్ మెట్రో లగ్జరీ బస్సులు ప్రారంభించడం సంతోషంగా ఉందని ఎండీ సజ్జనార్ అన్నారు. ఎయిర్ పోర్ట్ కు నడుస్తున్న బస్సులతో మంచి రెవెన్యూ వస్తున్నదని తెలిపారు. 

ఐటీ కారిడార్​కు ట్రాన్స్​పోర్ట్ పెంచుతున్నామని, మహిళల కోసం సైబర్ లైనర్ పేరుతో బస్సులు నడుపుతున్నామని చెప్పారు. త్వరలో వీటి సంఖ్య పెంచుతామన్నారు. ఈ ప్రోగ్రామ్​లో బస్సులు సరఫరా చేసిన ఓలెక్ట్రా ఎండీ ప్రదీప్ రావు, తదితరులు పాల్గొన్నారు.