
ఎక్స్ పర్ట్స్ స్టడీ ప్రకారం.. ఒక రోజులో సాధారణంగా 300 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ కంటే ఎక్కువ తినకూడదు. ఒక గుడ్డులో 373 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. కాబట్టి.. గుండె సమస్యలున్నవాళ్లు గుడ్డును తినడం మంచిదా కాదా.. తింటే రోజుకు ఎన్ని గుడ్లు తినాలి? బరువు పెరగాలనుకునేవారు ఎన్ని గుడ్లు తింటే ఆరోగ్యం?.. అనే ప్రశ్నలకు సమాధానాలేంటో తెలుసుకుందాం..
చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ గుడ్డును ఇష్టంగా తింటారు. ఉడికించిన గుడ్డును బ్రెడ్ తో కలిపి టోస్ట్ గా, పలావ్ లలో.. బేకరీ ఐటమ్స్ రకరకాలుగా వాడతాం. కోడి గుడ్డులో బోలెడన్ని ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, పాస్ఫరస్, అయోడిన్, సెలీనియం, ఐరన్, జింక్, ఉంటాయి. ఇవి పలు రకాలు అనారోగ్య సమస్యలు దగ్గరకు రాకుండా చేయడంలో సాయపడతాయి. అందుకే.. పిల్లలు, గర్భిణులు, అథ్లెట్లు, బరువు పెరగాలనుకునేవాళ్లు గుడ్లను తప్పనిసరిగా తింటారు. అయితే, గుడ్లలో ఉండే పోషకాలు శరీరానికి మేలు చేసేవే కదా అని అతిగా తింటే నష్టమే అని ఎక్స్ పర్ట్స్ చెప్తున్నారు.
రోజుకు ఒక గుడ్డు బెటర్
పిల్లల నుంచి పెద్దల వరకు, పేషెంట్లు, గర్భిణులు ఇలా ఎవరైనా సరే... రోజుకు ఒక గుడ్డు తినడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని ఒక సంస్థ నిర్వహించిన మూడు ఇంటర్నేషనల్ స్టడీల అనాలిసిస్ లో వెల్లడైంది. 21 దేశాల్లో, ఒక లక్షా 46 వేల మందిని స్టడీ చేసి ఈ రిపోర్టు తయారు చేశారు. ఇందులో రోజుకు ఒకటి లేదా అంతకంటే తక్కువ గుడ్డును తినేవారు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడలేదని ఎక్స్ పర్ట్స్ గుర్తించారు. అయితే బరువు పెరగాలనుకున్న వాళ్లు మాత్రం రోజుకు మూడు వరకు గుడ్లు తినొచ్చు. డయాబెటిస్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందేనని, రోజుకు ఒకటి కంటే ఎక్కువ గుడ్లను తింటే ప్రమాదమని సర్వేలో తేలింది. గుండె జబ్బులున్నవాళ్లు రోజుకు తినే గుడ్ల సంఖ్య ఎంత పెరిగితే ముప్పు కూడా అంతే పెరుగుతుందని తేల్చారు.
హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు జాగ్రత్త
రోజుకు ఒక గుడ్డు తినడం పూర్తిగా ఆరోగ్యకరమని, షుగర్.. గుండె సమస్యలను డెవలప్ చేయడంలో ఇది ఎలాంటి ప్రభావం చూపదని ఎక్స్ పర్ట్స్ చెప్తున్నారు. అంటే... షుగర్, గుండె సమస్యలున్న పేషెంట్లు కూడా రోజుకు ఒక గుడ్డును తినొచ్చని చెప్తున్నారు. నిజానికి కొంతమంది రోజుకు రెండు మూడు... గుడ్లు తింటుంటారు. అలాంటి వారిలో బరువు పెరగాలనుకునే వారికయితే ఎలాంటి ప్రమాదం లేదని, షుగర్.. గుండె సమస్యలున్నవారిపై మాత్రం ఎఫెక్ట్ పడుతుందని చెప్తున్నారు..