
- ప్రస్తుతం రాష్ట్రంలో 38 సెగ్మెంట్లు రెండు, మూడు జిల్లాల్లో విస్తరణ
- గత ప్రభుత్వం ఇష్టారీతిన కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో సమస్య
- పునర్విభజనతో ఒక్కో జిల్లాకే పరిమితం కానున్న నియోజకవర్గాలు
- జనాభా లెక్కల కోసం గ్రామం, మండలం, జిల్లాల వివరాలడిగిన కేంద్రం
- దాని ప్రకారమే డీలిమిటేషన్ ఉంటుందని స్పష్టీకరణ
హైదరాబాద్, వెలుగు: ప్రస్తుతం రెండు, మూడు జిల్లాల్లో విస్తరించి ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు.. పునర్విభజన తర్వాత ఒక్కో జిల్లా కిందికి రానున్నాయి. దీంతో ప్రస్తుత నియోజకవర్గాలతోపాటు భవిష్యత్తులో ఏర్పడబోయే కొత్త సెగ్మెంట్లు కూడా ఒక్కో జిల్లా పరిధిలోనే ఉంటాయి. ఫలితంగా అటు పరిపాలన పరంగా, ఇటు రాజకీయపరంగా పూర్తి స్థాయిలో మార్పులు వస్తాయని అధికారవర్గాలు అంటున్నాయి. రానున్న సాధారణ అసెంబ్లీ ఎన్నికలు డీలిమిటేషన్ తర్వాతే జరిగే అవకాశం ఉన్నందున.. ఇప్పుడు ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు, కొత్తగా పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహులు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంటున్నాయి.
గ్రామాలు, మండలాలు, జిల్లాలు సరిహద్దులుగా చేసుకొని త్వరలో లెక్కించనున్న జనాభా లెక్కల ప్రకారమే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది. దీంతో ప్రతి సెగ్మెంట్లోనూ భౌగోళికంగా మార్పులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. డిసెంబర్ 31 నాటికి గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీలు, జిల్లాల సరిహద్దులకు సంబంధించిన తుది జాబితాను పంపాలని ఆ లేఖల్లో కోరింది. ఆ తేదీ నాటికి ఉన్న సరిహద్దుల ఆధారంగానే జనగణన చేపడతామని స్పష్టం చేసింది. ఈ లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన జరుగనుంది.
ఒకటికంటే ఎక్కువ జిల్లాల్లో విస్తరించిన38 సెగ్మెంట్లు
2016లో కొత్త జిల్లాలను ఇష్టారీతిన విభజించడం వల్ల కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు, మూడు జిల్లాల్లో విస్తరించాయి. ఉదాహరణకు.. మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, జనగాం, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, వర్ధన్నపేట, భూపాలపల్లి, దుబ్బాక, గజ్వేల్, ఎల్బీ నగర్, చేవెళ్ల, పరిగి, కొడంగల్, దేవరకొండ, మక్తాల్, కల్వకుర్తి, ఖానాపూర్, బాన్సువాడ, ధర్మపురి, చొప్పదండి, వేములవాడ, మానకొండూర్, హుస్నాబాద్ వంటి 38 నియోజకవర్గాలు ఒకటి కంటే ఎక్కువ జిల్లాల్లో ఉన్నాయి. ఇప్పుడు జరగబోయే పునర్విభజనతో ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది.
నియోజకవర్గాల పునర్విభజనలో జనాభాతో పాటు జిల్లాలనే యూనిట్‌గా పరిగణించనున్నారు. అంటే.. ఒక నియోజకవర్గం ఒకే జిల్లా పరిధిలోకి రానుంది. దీని ప్రకారం.. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల సరిహద్దులు మారడంతోపాటు కొన్ని కొత్త నియోజకవర్గాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టం ప్రకారం, పునర్విభజనలో జిల్లానే ప్రామాణికంగా ఉంటుంది. దీనివల్ల ప్రస్తుతం రెండు, మూడు జిల్లాల్లో విస్తరించి ఉన్న సుమారు 38 నియోజకవర్గాల సరిహద్దులు మారే చాన్స్ ఉంది. రాబోయే జనగణన తర్వాత అసెంబ్లీ స్థానాల సంఖ్య కూడా పెరుగనుంది.
153కు పెరిగే చాన్స్
జనగణన పూర్తయిన తర్వాత అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచనున్నారు. ఒకవేళ జనాభా లెక్కలు.. ప్రస్తుతం ఉన్న పునర్విభజన చట్టం ప్రకారం చేస్తే ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు 153కు పెరగవచ్చని అంచనా. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసిన సమగ్ర కులగణన సర్వేలోని మ్యాపింగ్ ప్రకారం రాష్ట్రంలో 3.71 కోట్ల మంది ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జనాభా సగటు ఆధారంగా జరుగుతుంది.
ఉదాహరణకు..: 2027లో రాష్ట్ర జనాభా 4 కోట్లుగా అంచనా వేస్తే, ప్రతి నియోజకవర్గం సగటు జనాభా సుమారు 2.60 లక్షల నుంచి 2.61 లక్షలుగా ఉంటుంది. ఈ సగటుకు 10 శాతం ఎక్కువ లేదా తక్కువ ఉండేలా అసెంబ్లీ నియోజకవర్గాలను విభజిస్తారు. మొదట జిల్లాకు ఎన్ని నియోజకవర్గాలు ఉండాలో నిర్ణయించి, ఆ తర్వాత వాటి సరిహద్దులను ఖరారు చేస్తారు. 2009లో కూడా ఇదే పద్ధతిని అనుసరించి పునర్విభజన చేశారు.