మల్టీపర్పస్​ వర్కర్లకు కరెంట్​ షాక్​.. 15 రోజుల్లో ముగ్గురు మృతి

మల్టీపర్పస్​ వర్కర్లకు కరెంట్​ షాక్​..   15 రోజుల్లో ముగ్గురు మృతి

 బెల్లంపల్లి మండలం బుదాకుర్దు గ్రామంలో మల్టీపర్పస్​ వర్కర్​స్థానంలో అతడి కొడుకు రాచకొండ ప్రశాంత్(24)ను ఈ నెల 7న పోల్​ ఎక్కించారు.  సర్పంచ్​ దగ్గరుండి తన ఇంటిముందు స్ర్టీట్​ లైట్​ పెట్టాలని కోరాడు. ప్రశాంత్​పోల్​ ఎక్కగానే కరెంట్​ సప్లై కావడంతో షాక్​ కొట్టి కిందపడ్డాడు. తలకు బలమైన దెబ్బలు తగిలి స్పాట్​లోనే చనిపోయాడు. ఆ టైంలో లైన్​మన్​కూడా అక్కడే ఉన్నాడు. ఎల్​సీ తీసుకున్నప్పటికీ కరెంట్ సప్లై ఎట్ల జరిగిందన్నది అంతుచిక్కడం లేదు. 

మంచిర్యాల, వెలుగు:  గ్రామ పంచాయతీల్లోని మల్టీపర్పస్  వర్కర్ల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది.  వారికి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వకుండానే కరెంటు పనులు చేయిస్తోంది.  పోల్స్​ ఎక్కి  లైట్లు పెట్టేటప్పుడు పలువురు షాక్ తగిలి ప్రమాదాల బారిన పడ్తున్నారు. వీళ్లలో కొందరి జీవితాలు అర్ధంతరంగా ముగుస్తుండగా, మరికొందరు తీవ్ర గాయాలతో మంచాన పడ్తున్నారు. ఫలితంగా పంచాయతీల్లో వెలుగులు నింపేందుకు పనిచేస్తున్న కార్మికుల కుటుంబాల్లో చీకట్లు అలుముకుంటున్నాయి.  గత 15 రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ముగ్గురు కరెంట్ షాక్ తో చనిపోయారు. మరో టెంపరరీ కార్మికుడు తీవ్ర గాయాలపాలై  హాస్పిటల్​లో  కొట్టుమిట్టాడుతున్నాడు. ఇలాంటి ఘటనలు రాష్ర్టంలో ప్రతీరోజు ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. మృతులు, గాయాలపాలైన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎలాంటి ఎక్స్​గ్రేషియా చెల్లించడం లేదు. దీంతో వారిపై ఆధారపడ్డ భార్యాపిల్లలు, ఇతర కుటుంబసభ్యులు ఆగమవుతున్నారు. ఇంటి పెద్దను కోల్పోయిన పేదలు బతుకుదెరువు కోసం అవస్థలు పడ్తున్నారు.

 అన్ని పనులూ వాళ్లకే..

ప్రభుత్వం గ్రామపంచాయతీల్లో శానిటేషన్, కరెంట్ సప్లై​, వాటర్ సప్లై తదితర పనుల నిర్వహణకు మల్టీపర్పస్ వర్కర్లను నియమించింది. 500 మంది జనాభాకు ఒకరు చొప్పున మేజర్ పంచాయతీల్లో 10 మంది వరకు,  మైనర్ పంచాయతీల్లో జనాభాను బట్టి ముగ్గురు, నలుగురు పనిచేస్తున్నారు.  వీరికి నెలకు రూ.8,500 చొప్పున జీతాలు ఇస్తున్నారు.  ఇటీవల మరో రూ.వెయ్యి పెంచినప్పటికీ ఆ డబ్బులు ఇంతవరకు చెల్లించడం లేదు.  మల్టీపర్పస్ వర్కర్లు శానిటేషన్, వాటర్ సప్లై, కరెంట్ పనులు చేస్తుంటారు. ట్రాక్టర్  డ్రైవర్లుగా, ఎలక్ర్టీషియన్లుగా అందరూ చేయలేరు.  గతంలో ప్రైవేట్​గా ఈ పనులు చేసిన వారిని మల్టీపర్పస్ వర్కర్లుగా నియమించుకున్నారు. అయితే ఎలక్ర్టీషియన్లకు ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వకుండానే పనులు చేయించుకుంటున్నారు.  వీరు పోల్​ ఎక్కి  స్ట్రీట్ లైట్లు పెట్టే క్రమంలో షాక్ కు గురై ప్రాణాలు కోల్పోతున్నారు.  ఎల్​సీ (లైన్ క్లియరెన్స్) తీసుకోకపోవడం, పోల్​ పైన ఉన్న హై టెన్షన్, త్రీఫేజ్​ వైర్లతో పొంచివున్న ప్రమాదాలను అంచనా వేయకపోవడం వంటి కారణాలతో షాక్​కు గురవుతున్నారు. ప్రమాదాల్లో చనిపోయిన, గాయపడ్డ వర్కర్లకు గవర్నమెంట్​ ఎలాంటి ఎక్స్​గ్రేషియా ఇవ్వడం లేదు.  విద్యుత్​ శాఖ నుంచి కూడా నష్టపరిహారం రావడం లేదు.   

15 రోజుల్లో ముగ్గురు మృతి...

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో గత 15 రోజుల్లో ముగ్గురు కార్మికులు కరెంట్​ షాక్​తో చనిపోయారు.  ఈ నెల 10న దండేపల్లి మండలం కొవిచెల్మ గ్రామంలో మల్టీపర్పస్ వర్కర్ గంగాధరి మల్లేశం(49) పోల్​ ఎక్కి  లైట్లు పెడ్తుండగా షాక్ తగిలింది. శరీరం పూర్తిగా కాలిపోయి కిందపడడంతో స్పాట్​లోనే చనిపోయాడు. పంచాయతీ వర్కర్లు సమ్మెలో ఉన్నప్పటికీ ఎమర్జెన్సీ కావడంతో పోల్​ ఎక్కి ప్రాణాలు కోల్పోయాడు. పంపు ఆపరేటర్ కమ్ ఎలక్ట్రీషియన్ గా పనిచేసే మల్లేశంకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంతకుముందు ఆదిలాబాద్​ జిల్లా గుడిహత్నూర్ మండలం కొల్హారిలో  మల్టీపర్పస్‌‌‌‌ వర్కర్‌‌‌‌ దత్తా మానె(40) కరెంట్​ సప్లై  నిలిపివేసి స్ర్టీట్​లైట్లు పెడ్తుండగా షాక్‌‌‌‌కు వచ్చి పోల్​ పైనుంచి కిందపడ్డాడు. 

తీవ్రగాయాలైన అతడు కూడా స్పాట్​లోనే ప్రాణాలు విడిచాడు. విద్యుత్​, పంచాయతీ శాఖల ఆఫీసర్లే మృతికి బాధ్యత వహించాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు.  ఆఫీసర్లను రైతు వేదికలో నిర్బంధించి  తాళం వేశారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని ఆఫీసర్లు హామీ ఇచ్చినప్పటికీ ఎలాంటి ఆర్థికసాయం అందలేదు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.  ఈ నెల 12న ఆసిఫాబాద్​ జిల్లా వాంకిడి మండలం చౌపన్​గూడలో టెంపరరీ వర్కర్​ గాయపడ్డాడు.  జీపీ వర్కర్లు సమ్మెలో ఉండడంతో సర్పంచ్​సిడాం అన్నిగ సడక్​గూడకు చెందిన ఆత్రం అన్నిగ(25)ను స్ర్టీట్​లైట్లు పెట్టేందుకు నియమించాడు. అతడు లైట్లు పెట్టేందుకు పోల్​ ఎక్కగానే షాక్​ తగిలి కిందపడ్డాడు. రెండు చేతులతోపాటు కాలు కొంతవరకు కాలిపోయింది. బాధితుడిని తొలుత ఆసిఫాబాద్​ హాస్పిటల్​కు, అక్కడినుంచి ఆదిలాబాద్​ రిమ్స్​కు తరలించారు.  పోల్​ ఎక్కే ముందు ఎల్​సీ తీసుకోకపోవడంతోనే ప్రమాదం జరిగిందని విద్యుత్​ శాఖ ఆఫీసర్లు పేర్కొన్నారు. 

రూ.25 లక్షలు చెల్లించాలి..

విద్యుత్ ప్రమాదాల్లో చనిపోయిన మల్టీపర్పస్  వర్కర్ల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్​గ్రేషియా చెల్లించాలి. అలాగే కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. టెక్నికల్ అంశాలపై  ట్రైనింగ్ ఇవ్వాలి.  


దుంపల రంజిత్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి, మంచిర్యాల 

ప్రమాద బీమా చేయిస్తున్నాం..

 గ్రామ పంచాయతీ మల్టీపర్పస్​ వర్కర్లు విధి నిర్వహణలో ప్రమాదాల బారిన పడ్తున్నారు. వారి కుటుంబాలను ఆదుకునేందుకు బ్యాంకుల ద్వారా రూ.10 లక్షల ప్రమాదబీమా చేయిస్తున్నాం. ప్రీమియం డబ్బులను ముందుగా పంచాయతీ నుంచి చెల్లించి తర్వాత వర్కర్ల శాలరీలో కట్​ చేస్తాం.  
- వెంకటేశ్వర్​రావు, డీపీవో, మంచిర్యాల 

విద్యుత్ ఆఫీసర్లను సంప్రదించాలి..  

మల్టీపర్పస్ వర్కర్లు కరెంటు పనులు చేస్తున్నప్పుడు తప్పనిసరిగా ఎల్ సీ తీసుకున్న తర్వాతే  పోల్​ ఎక్కాలి. ఇటీవల చనిపోయిన వర్కర్లకు రూ.5లక్షల ఎక్స్​గ్రేషియా చెల్లించే అంశాన్ని పరిశీలిస్తాం.  - శేషారావు, ఎస్​ఈ, మంచిర్యాల