
విద్యుత్ వైర్లు తగిలి కరెంటు షాక్ తో చనిపోతున్న ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. మొన్న రామంతాపూర్ లో కరెంటు షాక్ తో యువకులు చనిపోయిన ఘటన, నిన్న బండ్లగూడలో గణేష్ విగ్రహాన్ని తరలిస్తుండగా యువకుడు ప్రాణాలు వదిలిన ఘటనలు మరువక ముందే ఆదివారం (ఆగస్టు 24) సికింద్రాబాద్ లో మరో యువకుడు చనిపోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. విద్యుత్ వైర్ తగిలి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర నాందేడ్ ప్రాంతానికి చెందిన లక్కీ (26) బొల్లారం రీసాల బజార్ లోని ఓ టెంట్ హౌస్ లో కూలీగా పని చేస్తున్నాడు. ఈ మేరకు ఓ శుభకార్యానికి వేసిన టెంట్ హౌస్ ను మరో ముగ్గురితో కలిసి తొలగిస్తుండగా విద్యుత్ వైర్ తగిలి కరెంటు షాక్ కు గురయ్యారు.
ఇనుప నిచ్చెనపై నిలబడి టెంట్ ను విప్పుతుండగా ఘటన జరిగింది. నిచ్చెనపై ఉన్న వ్యక్తితో పాటు కింద ఉన్న మరో ముగ్గురు కూడా కరెంటు షాక్ కొట్టింది. దీంతో నిచ్చెనపై ఉన్న వ్యక్తి అలాగే పడిపోయాడు. నిచ్చెన పట్టుకున్న వ్యక్తి అలాగే వెనకకు పడిపోయాడు. గాయపడిన ముగ్గిరిన ఆస్పత్రికి తరలిస్తుండగా లక్కీ మార్గమధ్యలోనే చనిపోయాడు.
ఈ ఘటనలో మరో ముగ్గురు యువకులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. మున్నా, విజయ్, సంతోష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.