జీడిమెట్ల, వెలుగు: కరెంట్ షాక్ తగిలి పేట్ బషీరాబాద్‌లో ఓ ఎలక్ట్రిషన్ మృతి చెందాడు. ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన షణ్ముఖ్ (35) మూసాపేట్లో నివాసముంటున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా, సాయిబాబ అనే విద్యుత్ కాంట్రాక్టర్ వద్ద గత ఐదేండ్లుగా ఎలక్ట్రిషన్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం జీడిమెట్ల డివిజన్ పరిధిలో మూడు గుళ్ల వద్ద రిపేర్లు జరుగుతుండగా, షణ్ముఖ్ కరెంట్ స్తంభంపై ఎక్కి పనులు చేస్తున్నాడు.
ఈ క్రమంలో ఒక్కసారిగా సరఫరా రావడంతో కరెంట్ షాక్ గురై కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కాంట్రాక్టరు, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే షణ్ముఖ్ మృతి చెందాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
