థర్డ్​ పార్టీ యాప్స్​తో కరెంటు బిల్లు కట్టుడు కుదరదు

థర్డ్​ పార్టీ యాప్స్​తో కరెంటు బిల్లు కట్టుడు కుదరదు
  •  బీబీపీఎస్​ను ఎనేబుల్ చేసుకోక పోవడంతో ఆర్బీఐ నిర్ణయం
  • కరెంటు బిల్లులు తమ వెబ్​సైట్, యాప్​ నుంచి చెల్లించాలని డిస్కంల ప్రకటన

న్యూఢిల్లీ/హైదరాబాద్, వెలుగు: ఫోన్​పే, గూగుల్​పే, పేటీఎం, క్రెడ్, అమెజాన్ పే వంటి థర్డ్​పార్టీ యాప్స్​తో కరెంటు బిల్లులు, క్రెడిట్​కార్డు బిల్లులు చెల్లించడం ఇకపై సాధ్యం కాదని ఆర్బీఐ తెలిపింది. బిల్లుల చెల్లింపుల్లో సెక్యూరిటీ కోసం తీసుకొచ్చిన భారత్ బిల్ పేమెంట్స్ సిస్టమ్ (బీబీపీఎస్​)ను ఇవి ఎనేబుల్ చేసుకోకపోవడంతో బిల్లులు కట్టడం కుదరదని తెలిపింది. 

ఆర్బీఐ గైడ్​లైన్స్​కు అనుగుణంగా, జులై 1 నుంచి బీబీపీఎస్​లో భాగమైన బ్యాంకులకు మాత్రమే క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులను అనుమతిస్తామని పేటీఎం తెలిపింది. హెచ్‌‌డీఎఫ్‌‌సీ, యాక్సిస్ సహా కొన్ని బ్యాంకులు బీబీపీఎస్​ను యాక్టివేట్ చేసుకోలేదు. ఎస్బీఐ, కోటక్​మహీంద్రా, ఇండస్​ఇండ్, ఫెడరల్ బ్యాంకులు బీబీపీఎస్​లో చేరాయి. ఐసీఐసీఐ బ్యాంక్ సోమవారం ఇందులో చేరింది. 

బీబీపీఎస్ అనేది ఇంటిగ్రేటెడ్ బిల్​పేమెంట్ ప్లాట్‌‌ఫారమ్. ఇది మొబైల్ యాప్‌‌లు, బ్యాంక్ శాఖలు సహా పలు చానెల్స్ ద్వారా బిల్లుల చెల్లింపును అనుమతిస్తుంది. కాగా, ఇక నుంచి థర్డ్​పార్టీ, పేమెంట్ యాప్స్​కు బదులు తమ వెబ్​సైట్ లేదా యాప్​ద్వారానే బిల్లులు కట్టాలని తెలంగాణ, ఏపీలోని విద్యుత్​ పంపిణీ సంస్థలు (డిస్కమ్​లు) వినియోగదారులను కోరాయి.