- ఇద్దరు యూనియన్ లీడర్ల టర్మినేషన్
- కరెంట్ సప్లైపై సమ్మె ప్రభావం లేదు.. ఇయ్యాల విధుల్లోకి రాకపోతే తొలగిస్తాం
- ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు హెచ్చరిక
- సమ్మె కొనసాగుతుంది: ఆర్టిజన్ల సంఘం
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ కార్మికుల సమ్మెపై విద్యుత్ సంస్థలు తొలిరోజే ఉక్కుపాదం మోపాయి. మంగళవారం సమ్మెలో పాల్గొన్న 200 మంది ఆర్టిజన్లను విద్యుత్ సంస్థల యాజమాన్యం టర్మినేట్ చేసింది. బుధవారం ఉదయంలోగా డ్యూటీకి హాజరుకాని వాళ్లందరినీ ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు హెచ్చరించారు. విద్యుత్ ఆర్టిజన్ల సమ్మెను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. సోమవారం నుంచి పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి కక్కడ ఆర్టిజన్ సంఘాల నాయకులను అరెస్టు చేశారు. సంఘాల నేతలకు బెయిల్ కోసం ఇతర నేతలు, కార్మికులు మంగళవారం కోర్టుల చుట్టూ తిరుగుతుండగా.. ఇదే అదునుగా వారిపై సర్కారు వేటు వేసింది. దీంతో విద్యుత్ సంస్థల్లో గందరగోళం నెలకొంది. సమ్మె కొనసాగుతుందని, తమపై వేటు వేసినా హక్కుల కోసం ఉద్యమిస్తామని ఆర్టిజన్ల సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు.
యూనియన్ నేతలపై వేటు
సమ్మెలో పాల్గొనడంతో పాటు సహోద్యోగులను సమ్మెకి ఉసిగొల్పారనే ఆరోపణలపై తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్(హెచ్ 82) ప్రధాన కార్యదర్శి ఎస్.సాయిలును ఆర్టిజన్ గ్రేడ్-2 ఉద్యోగం నుంచి తొలగిస్తూ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే ఆరోపణలపై యూనియన్ సెక్రటరీ జె.శివశంకర్‌ను గ్రేడ్-1 ఆర్టిజన్ ఉద్యోగం నుంచి తొలగిస్తూ టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు మొత్తం 200 మంది ఆర్టిజన్లపై వేటు వేసింది. అయితే, న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తుంటే ఉక్కుపాదం మోపడంపై ఆర్టిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి క్షేత్రస్థాయిలో పని చేస్తున్న తమకు 7 శాతం ఫిట్ మెంట్ సరిపోదని, ఫిట్ మెంట్ ను పెంచాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.
సమ్మె ప్రభావం లేదు: ప్రభాకర్ రావు
కరెంట్ సరఫరాపై ఆర్టిజన్ల సమ్మె ప్రభావం లేదని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు చెప్పారు. ఆర్టిజన్ల సమ్మె నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరాపై విద్యుత్ సౌధలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీల మీద సమ్మె ప్రభావం లేదని, వినియోగదారులకు కరెంట్ సరఫరాలో అంతరాయాలు లేవన్నారు. జెన్ కో విద్యుత్ ఉత్పత్తి సంస్థల్లో 100 శాతం, ట్రాన్స్ కో డిస్కంలలో 80 శాతం మంది ఆర్టిజన్లు విధులకు హాజరయ్యారని తెలిపారు. అత్యవసర సర్వీసుల చట్టం (ఎస్మా) అమలులో ఉందని, సమ్మె చేస్తే మిస్ కండక్ట్ గా పరిగణిస్తామని హెచ్చరించినా వినకుండా సమ్మెలో పాల్గొన్నందుకు 200 మందిని విధుల నుంచి తొలగించామన్నారు. బుధవారం ఉదయంలోగా డ్యూటీలకు హాజరుకాని ఆర్టిజన్లు అందరినీ తొలగిస్తామని హెచ్చరించారు..
సమ్మె కొనసాగుతుంది: యూనియన్లు
ట్రాన్స్ కోలో 80% మంది, జెన్‌కో, డిస్కంలలో కలిపి 60% మంది ఆర్టిజన్లు మంగళవారం సమ్మెలో పాల్గొన్నారని తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్(హెచ్ 82) ప్రధాన కార్యదర్శిసాయిలు వెల్లడించారు. యూనియన్లకు అతీతంగా సమ్మెలో పాల్గొనడానికి ఆర్టిజన్లు ముందుకు వస్తున్నారని ఆయన తెలిపారు. బుధవారం మరింత మంది సమ్మెకి దిగుతారని చెప్పారు. అరెస్టులకు, ఉద్యోగాల తొలగింపులకు భయపడకుండా సమస్యలను పరిష్కరించేదాకా సమ్మెను కొనసాగిస్తామన్నారు. ఇత్తెహాద్ యూనియన్ సైతం తమతో కలిసి సమ్మెలో పాల్గొంటోందన్నారు. సమ్మెను విరమించుకోలేదని ఇత్తెహాద్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నందీశ్వర్ స్పష్టం చేశారు. సమ్మెను విరమించినట్టు వాట్సప్ గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతున్న మెసేజ్ ఫేక్ అని పేర్కొన్నారు.