విద్యుత్ శాఖలో వన్ మినిట్ రూల్.. ఉద్యోగులను ప్రమాదాల నుంచి రక్షిస్తాం

విద్యుత్ శాఖలో వన్ మినిట్ రూల్.. ఉద్యోగులను ప్రమాదాల నుంచి రక్షిస్తాం
  • విద్యుత్ ఉద్యోగులు, సిబ్బందిని ప్రమాదాల నుంచి రక్షించడానికి సరికొత్త ప్రయత్నం
  • సేఫ్టీ పరికరాలు, సేఫ్టీ రూల్స్ పాటిస్తున్నామా? లేదా? 
  • ఒక నిమిషం ఆగి చెక్ చేసుకోవాలంటున్న ఆఫీసర్లు
  • మే 8 నుంచి రాష్ట్రంలో అమలు 
  • గతేడాది విద్యుత్​ షాక్​ గురై 8 మంది విద్యుత్ ఉద్యోగులు మృతి, 69 మందికి గాయాలు

హైదరాబాద్, వెలుగు: విద్యుత్​సిబ్బందిని ప్రమాదాల నుంచి రక్షించడానికి ఆ శాఖ ‘వన్​ మినిట్​ రూల్’ తీసుకొచ్చింది. విద్యుత్​ శాఖలో పనిచేసే సిబ్బంది, ఉద్యోగుల ప్రాణాలను రక్షించడానికి, గాయాల పాలు కాకుండా కాపాడటానికి ఉన్నతాధికారులు ఈ  సరికొత్త ప్రయత్నం చేస్తున్నారు. పని వెంటనే అయిపోవాలనే తొందరపాటులో సేఫ్టీ రూల్స్ పాటించక పదుల సంఖ్యలో విద్యుత్​ సిబ్బంది చనిపోతున్నారు. అనేక మంది గాయాల పాలై మంచాన పడుతున్నారు. 

గతేడాది విద్యుత్​ షాక్​ గురై 8 మంది విద్యుత్​ ఉద్యోగులు మృతి చెందగా.. 69 మంది తీవ్రంగా గాయపడినట్టు ప్రభుత్వ రికార్డులు చెప్తున్నాయి. ఇక వీటిని అరికట్టడానికి డిస్కమ్​ల ఉన్నతాధికారులు సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. పనిచేసే స్థలంలో సేఫ్టీ పరికరాలు వినియోగిస్తున్నారా? సేఫ్టీ రూల్స్ పాటిస్తున్నామా? లేదా? అని ఒక నిమిషం ఆగి చెక్ చేసుకోవాలంటున్నారు. ‘వన్​ మినిట్​ రూల్’ పాటిస్తే వంద శాతం ప్రమాదాలు నివారించవచ్చని చెబుతున్నారు. నేటి (శుక్రవారం) నుంచి రాష్ట్రంలో ఈ రూల్​ అమలు కానున్నది. 

వన్ మినిట్ రూల్ అంటే ఏమిటి?

విద్యుత్ రంగంలో పని చేసే సిబ్బంది భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ తీసుకొచ్చిందే ఈ ‘వన్ మినిట్ రూల్’. ఉత్తర డిస్కమ్​ (ఎన్​పీడీసీఎల్)​ సీఎండీ వరుణ్​ రెడ్డి ఆలోచనల నుంచి ఇది పుట్టింది. ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్న చోట కరెంట్​ షాక్​కు గురై ఎందుకు చనిపోతున్నారు? దీనికి గల కారణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన దీనికి ముగింపు పలకడానికి ఈ ‘వన్​ మినిట్​ రూల్’ తీసుకొచ్చారు. ఉద్యోగుల భద్రతకు సంబంధించిన ఈ రూల్​ను దక్షిణ డిస్కమ్​లో కూడా అమలు చేయడానికి సీఎండీ జితేష్​ వి.పాటిల్​అంగీకరించారు. 

దీంతో ఈ రూల్​ నేటి(2026 మే 8శుక్రవారం) నుంచి రాష్ట్రంలో అమల్లోకి రానున్నది. ఈ నియమం ద్వారా ప్రతి పనికి ముందుగా కేవలం ఒక నిమిషం సమయం కేటాయించి అవసరమైన భద్రతా చర్యలను పరిశీలించడం తప్పనిసరి చేశారు. 

దీనిద్వారా ప్రమాదాలను తగ్గించడం, సిబ్బంది ప్రాణాలను రక్షించడం, విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత సురక్షితంగా నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉన్నందున, ఈ ఒక్క నిమిషం సమయం ప్రాణాలను కాపాడగలదని ఉన్నతాధికారులు చెబుతున్నారు.ఈ రూల్​కు సంబంధించిన వీడియో, ఫొటోలను క్షేత్రస్థాయిలో ప్రతి ఉద్యోగికి చేరే విధంగా వాట్సాప్​ గ్రూప్​లు, వ్యక్తిగతంగా పోస్టులు పంపిస్తున్నారు. అలాగే, సోషల్​ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 

పనికి ముందు తప్పనిసరిగా చెక్ చేయాల్సిన అంశాలు ఇవే..

విద్యుత్​ శాఖ ఉద్యోగులు ఎక్కడైనా కరెంట్​ పనులు చేస్తున్నట్టయితే ముందుగా అక్కడ పనిచేయడానికి కావాల్సిన సేఫ్టీ పరికరాలను తీసుకెళ్లాలి. ఆ పరికరాలు సరిగ్గా ఉన్నాయా? లేదా సరిచూసుకోవాలి. ఆ తర్వాత పని స్టార్ట్​ చేయడం కంటే వన్​ మినిట్​ ముందు అక్కడ కరెంట్​ సప్లయ్​ బంద్​ కావడానికి సబ్​ స్టేషన్​ నుంచి లైన్​ క్లియర్​ (ఎల్​సీ) పొందామా? లేదా? సరిచూసుకోవాలి. అలాగే ఇండక్షన్ టెస్టర్‌‌తో లైన్‌‌లో విద్యుత్ లేదని నిర్ధారించుకోవాలి.


 వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ) కిట్లు సరిగ్గా ధరించామా? లేదా చూసుకోవాలి. ఎర్తింగ్ ఏర్పాటు సరిగ్గా ఉన్నదా? డబుల్ ఫీడింగ్ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామా? పని చేసే ప్రదేశంలో ఇతర ప్రమాదాలు లేవా? టీమ్ సభ్యులందరూ అప్రమత్తంగా ఉన్నారా? అనేవి పునఃపరిశీలన చేసుకున్న తర్వాతే పని చేయడం మొదలుపెట్టాలి.

గతేడాది 16 మంది మృతి..

రాష్ట్ర విద్యుత్​ శాఖ పరిధిలో 50 వేల మందికి పైగా ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. గతేడాది (2024–25) విద్యుత్​ ప్రమాదాలకు గురై రెండు డిస్కమ్​ల పరిధిలో 16 మంది ఉద్యోగులు, సిబ్బంది మృతి చెందగా మరో 69 మంది గాయపడ్డారు. ప్రభుత్వం ఇటీవల విద్యుత్​ షాక్ తో మరణించేవారికి ఇచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచింది.

గతేడాది సెప్టెంబర్​ 21న హైదరాబాద్‌‌ మహానగరం జీడిమెట్ల పరిధిలోని షాపూర్ నగర్​లో ఆర్టిజన్ రాంబాబు (35) ప్రమాదవశాత్తు విద్యుత్​ షాక్​కు గురై మృతి చెందారు. నిలిచినపోయి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంలో భాగంగా విద్యుత్ స్తంభంపైకి ఎక్కి మరమ్మతులు చేస్తుండగా విద్యత్ షాక్‌‌కు గురై దుర్మరణం పాలయ్యారు.

షాపూర్ నగర్ సబ్ స్టేషన్-2 లో ఆర్టిజన్​గా విధులు నిర్వహిస్తున్న  ఆయన ఏఈ ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తూ చనిపోయారు. గతేడాది సెప్టెంబర్​ 16న  హైదరాబాద్‌‌లోని రామాంతపూర్ ప్రాంతంలో విద్యుత్ లైన్లకు మరమ్మతు పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై, టీజీఎస్‌‌సీపీసీఎల్‌‌లో లైన్‌‌మ్యాన్‌‌గా పనిచేస్తున్న సేవియా నాయక్​ (50) మృతి చెందాడు.

 లైన్‌‌మ్యాన్‌‌గా పనిచేస్తున్న ఆయన విద్యుత్​ మరమ్మతుల సమయంలో కరెంట్​ వైర్‌‌ను తాకినట్టు ఉప్పల్ పోలీస్ ఇన్‌‌స్పెక్టర్ కె. భాస్కర్ తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు అతని మరణానికి విద్యుత్ శాఖే కారణమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే నాయక్ విద్యుదాఘాతానికి గురయ్యాడని వారు ఆరోపించారు. 

సిబ్బంది భద్రతే మాకు ముఖ్యం 

మా డిస్కమ్​ పరిధిలో పనిచేసే ప్రతి ఉద్యోగి, సిబ్బంది భద్రత మాకు ఎంతో ముఖ్యం. కరెంట్​ పనులు చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు షాక్​ తగిలి ఉద్యోగులు మరణించడం ఎంతో బాధాకరం. దీనివల్ల కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఇక నుంచి భద్రతా లోపాల వల్ల ఒక్కరు కూడా మరణించకూడదు. గాయాల పాలు కాకూడదు. ఉద్యోగులు, సిబ్బంది భద్రత కోసమే ‘వన్​ మినిట్​ రూల్’ రూపొందించి అమలు చేస్తున్నాం. 

- కర్నాటి వరుణ్ రెడ్డి, ఉత్తర డిస్కమ్​ సీఎండీ, వరంగల్​–

మరిన్ని వార్తలు