పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో శనివారం రాత్రి వీచిన గాలి దుమారానికి కరెంట్ స్తాంభాలు నేలకూలాయి. మండలంలోని జగన్నాథపురంలో భారీ వృక్షం నేలకూలింది. నాగారం, తొగ్గూడెం, సూరారం, పాండురంగాపురం, రంగాపురం గ్రామాల్లో మొత్తం 23 విద్యుత్ స్తంభాలు పడిపోయాయి.
పట్టణంలోని హమాలి కాలనీ, రామ్నగర్, పేట చెరువు, శేఖరం బంజర తదితర ప్రాంతాల్లో మరో 10 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ములకలపల్లి మండలంలోని సీతారాంపురం, పూసగూడెం, సీతాయిగూడెం ప్రాంతాల్లో 15 విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. దీంతో స్పందించిన పాల్వంచ ఏడీఈ రహీముల్ హుస్సేన్ తక్షణ చర్యలు చేపట్టారు. ఆదివారం సాయంత్రం వరకు అన్ని ప్రాంతాల్లో కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి, సంబంధిత గ్రామాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
