వ్యర్థాలను కళాఖండాలుగా మార్చిన ప్లాస్టిక్ వాలా..యంగ్ ఆర్టిస్ట్ స్కాలర్‌‌‌‌షిప్ ఇన్ పెయింటింగ్ పురస్కారం

వ్యర్థాలను కళాఖండాలుగా మార్చిన ప్లాస్టిక్ వాలా..యంగ్ ఆర్టిస్ట్ స్కాలర్‌‌‌‌షిప్ ఇన్ పెయింటింగ్ పురస్కారం

2018లో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ అందించే “యంగ్ ఆర్టిస్ట్ స్కాలర్‌‌‌‌షిప్ ఇన్ పెయింటింగ్” పురస్కారం అందుకున్నాడు. అదే ఏడాది యుఎన్​డీపీ, భారత ప్రభుత్వం నిర్వహించిన “సెక్యూర్ హిమాలయా” పోటీలో కూడా అవార్డు సాధించాడు. దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక ప్రదర్శనల్లో పాల్గొన్నాడు. 

2022లో సౌదీ అరేబియాలో జరిగిన “జాక్స్​ ఆర్ట్స్ ఫెస్టివల్​”, ఢిల్లీలో జరిగిన “ది డైలమా ఆఫ్ సస్టైనబిలిటీ” ఎగ్జిబిషన్‌‌‌‌, 2021, 2023లో “మెటిస్​ ఆర్టిస్ట్​ స్కాలర్​షిప్​” ప్రోగ్రామ్స్​లో అతడి ఆర్ట్​కు ప్రత్యేక గుర్తింపు లభించింది. ప్రదర్శనలతో మాత్రమే పరిమితం కాకుండా, హిమాచల్ ప్రదేశ్ నుంచి గోవా వరకు దేశవ్యాప్తంగా అనేక పబ్లిక్ ఆర్ట్ ఇన్‌‌‌‌స్టాలేషన్లు కూడా ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం మే 6 నుంచి 20 కర్నాటకలో ఎగ్జిబిషన్ మొదలైంది. ఇది 20వ తేదీ వరకు కొనసాగుతుంది. 

రోడ్ల పక్కన పడేసిన బాటిళ్లు, ప్లాస్టిక్‌‌‌‌ కవర్లు...డంప్‌‌‌‌యార్డ్‌‌‌‌ల్లో పేరుకుపోయిన వ్యర్థాలు...వాడేసిన ఆటబొమ్మలు... విరిగిన బకెట్లు...వీటన్నిటినీ ప్రపంచం చూసింది చెత్తగా. కానీ మన్వీర్ సింగ్ గౌతమ్ చూసింది కళగా.ఒకప్పుడు అతడి చేతుల్లో రంగులు లేవు. కాన్వాస్‌‌‌‌ లేదు. ఖరీదైన బ్రష్‌‌‌‌లు కూడా లేవు. కళాత్మక దృష్టితో చూస్తే ప్లాస్టిక్​ చెత్తతోనూ కళాఖండాలు సృష్టించొచ్చని భావించాడు. అంతే.. దాన్నే తన సాధనంగా మలచుకుని, ‘ప్లాస్టిక్​ వాలా’గా మారాడు. అతడి కంటికి కనిపించిన ప్లాస్టిక్​ చెత్తను ఆర్ట్​ కోసం ఉపయోగిస్తూ.. ప్రపంచానికి సందేశాన్ని ఇస్తున్నాడు. 

బాల్యం నుంచే..

మన్వీర్ సింగ్ ఉత్తరాఖండ్‌‌‌‌లోని హరిద్వార్ సమీప గ్రామం పురన్‌‌‌‌పూర్‌‌‌‌లో పుట్టాడు. పచ్చని పొలాలు, ప్రకృతి మధ్య తాతయ్య, -అమ్మమ్మల దగ్గర గడిచిన బాల్యం అతడిలో ప్రకృతి పట్ల అపారమైన ప్రేమను పెంచింది. చిన్నప్పటి నుంచే చిత్రాలు, విజువల్స్‌‌‌‌ అతడిని బలంగా ఆకర్షించేవి. ఢిల్లీలో ఫైన్ ఆర్ట్స్‌‌‌‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. అదే రంగంలో మాస్టర్స్ కూడా పూర్తి చేసి ఆర్ట్​నే తన జీవిత మార్గంగా ఎంచుకున్నాడు. 

కెరీర్​ మొదలు..

గ్రామీణ ప్రకృతి మధ్య పెరిగిన మన్వీర్‌‌‌‌కి, ఢిల్లీ నగర జీవితం పూర్తిగా భిన్నంగా అనిపించింది. ఒకవైపు కాంక్రీట్ అడవులు.. మరోవైపు చెత్త గుట్టలు. ఈ విరుద్ధ దృశ్యాలు అతడిని తీవ్రంగా కలచివేశాయి. “రేపటి ప్రపంచం ఇలాగే మారిపోతుందా?” అనే భయం అతడి మనసులో నానాటికీ పెరిగిపోయింది. ప్రకృతి అందాలు కేవలం ఫోటోలు, పెయింటింగ్స్‌‌‌‌లో మాత్రమే మిగిలిపోవడం అతడికి ఇష్టం లేకపోయింది.
 
అందుకే కేవలం ప్రకృతిని చిత్రించడం కాకుండా, దాన్ని కాపాడేందుకు ఉపయోగపడే కళ క్రియేట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడే ప్లాస్టిక్ కాలుష్యం వాతావరణ మార్పులకు ప్రధాన కారణాల్లో ఒకటని తెలుసుకున్నాడు. ఆ తర్వాత నుంచి చెత్తకుప్పల్లో పడే ప్లాస్టిక్‌‌‌‌ను సేకరించి తన కళాఖండాల్లో ఉపయోగించడం ప్రారంభించాడు.

 ప్రకృతి అందాలు, ప్లాస్టిక్ కాలుష్యం వల్ల మారిపోతున్న భూమి రూపం.. ఇవే ఇప్పుడు అతడి ఆర్ట్​లో ప్రధాన అంశాలు. రంగులు, టెక్చర్లు, వ్యర్థ పదార్థాలు.. ఇవన్నీ కలిపి అతడు తనకంటూ ప్రత్యేక శైలి నిర్మించుకున్నాడు. మన సమాజంలో చాలాసార్లు మనుషుల వృత్తిని బట్టి పేర్లు ఏర్పడతాయి. అదేవిధంగా మన్వీర్​ని “ప్లాస్టిక్ వాలా” అని పిలవడం మొదలుపెట్టారు. ఆ పేరు తర్వాత అతడి గుర్తింపుగా మారిపోయింది.

ప్రకృతి కోసం.. ప్రజల కోసం..

మన్వీర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన “హ్యాబిట్ చేంజర్ బాక్సెస్​”లో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తాడు. ఒక్కో ముక్కను శుభ్రం చేసి, వేరు చేసి, వాటితో భారీ శిల్పాలు, ఇన్‌‌‌‌స్టాలేషన్లు తయారుచేస్తాడు. అతడు చేసే ప్రతి కళాఖండం ఒక సందేశాన్ని ఇస్తుంది. అది కేవలం ప్లాస్టిక్ కాలుష్యాన్ని చూపించే కళ కాదు. చెత్తకుప్పల్లో పడాల్సిన ప్లాస్టిక్‌‌‌‌ను మళ్లీ ఉపయోగంలోకి తీసుకురావాలనే ప్రయత్నం కూడా. అతడు చేసే పని ప్రకృతి కోసం. ఎందుకంటే అతడు ఉపయోగించే ప్లాస్టిక్‌‌‌‌లో చాలా భాగం పర్యావరణానికి ప్రమాదకరమైన వ్యర్థం. అదే పదార్థాన్ని రీసైకిల్‌‌‌‌, అప్‌‌‌‌సైకిల్ చేసి ఆర్టిస్టిక్​గా మార్చుతున్నాడు. 

గత ఐదేళ్లకుపైగా మన్వీర్ పూర్తిస్థాయి కళాకారుడిగా పనిచేస్తున్నాడు. పబ్లిక్ ఇన్‌‌‌‌స్టాలేషన్ల ద్వారా ప్రజల్లో ప్లాస్టిక్ వ్యర్థాల ప్రమాదాలపై అవగాహన పెంచుతున్నాడు. కాలక్రమేణా అతడు కేవలం కళాకారుడిగానే కాకుండా “ఆర్టిస్ట్- యాక్టివిస్ట్”గా కూడా గుర్తింపు పొందాడు. అంటే కళ ద్వారా సామాజిక మార్పు తీసుకురావాలని ప్రయత్నించే వ్యక్తిగా నిలిచాడు. ఇప్పుడు మన్వీర్ సింగ్ పేరు కేవలం ఒక కళాకారుడి పేరు కాదు. చెత్తను కళగా మార్చిన ఉద్యమానికి ప్రతీకగా మారింది. 

నదుల్లో ప్లాస్టిక్‌‌‌‌.. రోడ్లపై ప్లాస్టిక్‌‌‌‌.. పొలాల్లో ప్లాస్టిక్‌‌‌‌...జంతువుల కడుపుల్లో కూడా ప్లాస్టిక్‌‌‌‌.ప్రకృతి ఊపిరాడక తల్లడిల్లుతున్న దృశ్యం అతడిని ఆలోచింపజేసింది. “ఈ వ్యర్థాన్ని మళ్లీ ఉపయోగించలేమా?” అనే ప్రశ్న అక్కడే పుట్టింది. కళ కోసం కాదు.. మార్పు కోసం ప్రారంభమైంది ప్రయాణం. మొదట ప్లాస్టిక్‌‌‌‌ ముక్కలతో చిన్న చిన్న ప్రయోగాలు చేశాడు. బాటిల్‌‌‌‌ క్యాప్స్‌‌‌‌తో ఆకృతులు తయారు చేశాడు. పాడైన ప్లాస్టిక్‌‌‌‌ వస్తువులను కరిగించి కొత్త రూపాలు ఇచ్చాడు. తర్వాత అదే ప్రయోగం పెద్ద కళాఖండాలుగా మారింది. 

ప్లాస్టిక్‌‌‌‌ చెత్తతో మహాత్మా గాంధీ చిత్రపటం. సముద్ర జీవుల శిల్పాలు. పర్యావరణ హెచ్చరికలు చెబుతున్న ఇన్‌‌‌‌స్టాలేషన్లు. భూమి వేడెక్కిపోతున్న దృశ్యాలను చూపించే భారీ నిర్మాణాలు. ప్రతి కళాఖండం వెనుక ఒక సందేశం ఉంటుంది. “నువ్వు పారేసిన ప్లాస్టిక్‌‌‌‌... మళ్లీ నీ జీవితాన్నే వెంటాడుతోంది” అనే హెచ్చరిక.

లైఫ్​& లిటరేచర్​ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్​ ఐడీfeatureseditor@v6velugu.com