విప్లవ భావాలకు అక్షర స్వరం తాడిగిరి.. ఐదు దశాబ్దాల పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు

విప్లవ భావాలకు అక్షర స్వరం తాడిగిరి.. ఐదు దశాబ్దాల పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు

తెలుగు సాహిత్య చరిత్రలో కొందరు రచయితలు కేవలం కథలు రాసినవాళ్లు కాదు.. కాలాన్ని నమోదు చేసిన సాక్షులు. అలాంటి అరుదైన రచయితల్లో తాడిగిరి పోతరాజు పేరు ముందువరుసలో నిలుస్తుంది. ఐదు దశాబ్దాల పాటు సాగిన ఆయన సాహితీ ప్రయాణం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 

గుంటూరు జిల్లా తాడికొండ మండలం అత్తిలి గ్రామంలో 1937 మేలో సారమ్మ – రాయపరాజు దంపతులకు పోతరాజు జన్మించాడు. చిన్నప్పటి నుంచే సాహిత్యం, సామాజిక చైతన్యం ఆయనతో కలిసి పెరిగాయి.1967లో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ బేసిక్ ట్రైనింగ్ స్కూల్‌‌‌‌లో ఇంగ్లిష్ టీచర్‌‌‌‌గా చేరాడు. తర్వాత ఎల్కతుర్తి మండలం శాంతినగర్‌‌‌‌లో నివాసం ఏర్పరుచుకున్నాడు.

సమాజం గురించిన ఆలోచనలు ఆయనను రచనల వైపు నడిపించాయి.1958 నుంచే సాహిత్యంపై మక్కువ పెంచుకున్న పోతరాజు “గృహోన్ముకుడు” కథతో రచనా ప్రయాణం ప్రారంభించాడు. మొదటి కథ నుంచే ఆయన శైలి ప్రత్యేకంగా కనిపించింది. మాటలు అలంకారాల కోసం కాకుండా, ఆలోచనల కోసం వాడేవాడు. అందుకే ఆయన రచనలు సాధారణ పాఠకుడికి దగ్గరయ్యాయి.

విప్లవ భావజాలానికి కలం

పోతరాజు కేవలం కథకుడు కాదు. సమాజంలో అన్యాయం కనిపిస్తే ప్రశ్నించిన రచయిత. విప్లవ రచయితల సంఘం, పౌరహక్కుల సంఘాల్లో చురుకుగా పనిచేశాడు. పేదలు, కార్మికులు, రైతులు ఎదుర్కొన్న కష్టాలు ఆయన కథల్లో ప్రధానాంశాలయ్యాయి. ఆ కాలంలో సామాజిక అన్యాయాలపై రాయడం ఈజీ కాదు. అయినా వెనుకడుగు వేయలేదు.ఎడిటర్ విజయ్‌‌‌‌కుమార్ ఆధ్వర్యంలో వచ్చిన “విద్యుల్లత” పత్రికలో “ఎర్రబుట్ట” పేరుతో ఆయన రాసిన కథ తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రభుత్వం ఆ కథను అభ్యంతరకరంగా భావించి పత్రికపై నిషేధించింది. 

1973లో ఆవునూరి సమ్మయ్య, నరేడ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో హుజురాబాద్‌‌‌‌లో స్థాపించిన “జన సాహితి” సంస్థకు పోతరాజు సలహాదారుగా ఉన్నాడు. అదే సమయంలో వెలువడిన “నిప్పు రవ్వలు” కవితా సంకలనంలో పోతరాజు రాసిన “మోదుగు పూలు” కథ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.
1975 మే15న హుజురాబాద్‌‌‌‌లో మహాకవి శ్రీశ్రీ చేతుల మీదుగా ఆ పుస్తకం ఆవిష్కరణ జరిగింది. కానీ కొద్ది రోజులకే ప్రభుత్వం ఆ పుస్తకాన్ని నిషేధించింది. ఆ తర్వాత దేశంలో ఎమర్జెన్సీ అమల్లోకి రావడంతో పోతరాజు అరెస్టయ్యాడు. ఉద్యోగం నుంచి కూడా ఈతొలగింపునకు గురయ్యాడు.

జైలు గోడల మధ్య పుట్టిన కథలు

జైలు జీవితం చాలామందిని మౌనంగా మార్చేస్తుంది. కానీ పోతరాజును మాత్రం మరింత పదునైన రచయితగా తీర్చిదిద్దింది. తోటి ఖైదీల జీవితాలు, వారి బాధలు, నిరాశలు, ఆశలు అన్నీ ఆయన కథల్లో ప్రతిబింబించాయి. ఎండమావులు, ఎర్రబుట్ట, ఆశల వాన, గాజు కిటికీ, చేదు నిజం, జిల్లేడు, పావురాలు, పెళ్లిగాని తల్లి, బోయలు, మాయసభ, లోయలు, విలాపాగ్నులు, శకలాల క్రింద శిక్ష, సెలవు, సముద్రం వంటి కథలు పాఠకుల్లో తీవ్ర స్పందన కలిగించాయి. పేదరికం, సామాజిక దౌర్జన్యం, రాజకీయ అణచివేత, మహిళల బాధలు, కులవివక్ష.. ఇవన్నీ ఆయన కథల్లో స్పష్టంగా కనిపిస్తాయి.
 
నవలా రచయితగా..

కథలతోపాటు పోతరాజు రాసిన ‘‘మట్టిబొమ్మలు”, “త్యాగశీలి” నవలలు అప్పటి సామాజిక పరిస్థితులను ప్రతిబింబించాయి. నాటికలు కూడా రాశాడు. వేదికపై ప్రదర్శనకు అనువుగా, సందేశాత్మకంగా రచనలు ఉండేవి.2010లో మహాకవి శ్రీ శ్రీ శతజయంతి సందర్భంగా “కెటిల్” పేరుతో పోతరాజు కథల సంకలనం వెలువడింది. హుజురాబాద్‌‌‌‌లో జరిగిన సభలో విప్లవ కవి వరవరరావు చేతుల మీదుగా ఆ పుస్తకం ఆవిష్కరణ జరిగింది. కొత్త తరం పాఠకులకు పోతరాజు రచనలను పరిచయం చేసిన ముఖ్య ఘట్టంగా అది నిలిచింది.

పౌరహక్కుల ఉద్యమంలో కీలక పాత్ర

పౌరహక్కుల సంఘం నాయకుడు జాప లక్ష్మారెడ్డి హత్య తర్వాత ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల బాధ్యతలు స్వీకరించాడు. గ్రామాల్లో జరిగే అన్యాయాలు, పోలీసు దౌర్జన్యాలు, సామాజిక వివక్షపై గళమెత్తాడు.

చివరి దశ..

1995లో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌‌‌‌గా పదవీ విరమణ పొందాడు. 2015 జనవరి 9న అనారోగ్యంతో కన్నుమూశాడు. పోతరాజు భార్య కాత్యాయనీ కూడా విద్యారంగంలో సేవలందించింది. హుజురాబాద్ ప్రభుత్వ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా పదవీ విరమణ పొంది, ప్రస్తుతం కరీంనగర్‌‌‌‌లో నివసిస్తోంది.

-తాళ్లపెల్లి సురేందర్-

లైఫ్​& లిటరేచర్​ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్​ ఐడీfeatureseditor@v6velugu.com