బ్రిటీష్ వలస పాలన కాలంలో సంఘ సంస్కరణ ఉద్యమ ఆశయాలకు అనుగుణంగా అభిప్రాయాలను కూడగట్టడానికి పత్రికలు సాధనాలయ్యాయి. ఆ తర్వాత జాతీయోద్యమ రాజకీయ భావ ప్రచారానికి వేదికలయ్యాయి. తెలంగాణలో హితబోధిని, తెనుగు, నీలగిరి వంటి పత్రికలు ఆధునికతకు తొలి వేకువ గీతాలయ్యాయి. తెలుగు భాష, తెలుగు వారి ఆత్మాభిమాన చైతన్యం ఉద్యమ రూపాన్ని తీసుకుంటున్న పందొమ్మిదో శతాబ్ది తొలిపాదంలో ఈ పనిని వేగవంతం చేయడానికి వచ్చిన పత్రికే గోలకొండ పత్రిక.
తెలంగాణ సాంస్కృతిక పునురుజ్జీవానికి, పునర్వికాసానికి దోహదపడేందుకు గోలకొండ పత్రిక1926 మేలో ప్రారంభమైంది. రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఉన్న సురవరం ప్రతాపరెడ్డి అప్పటి హైదరాబాద్ కొత్వాల్(సిటీ పోలీస్ కమిషనర్) రాజబహద్దూర్ వెంకట్రామిరెడ్డి ప్రోత్సాహంతో ఈ పత్రికకు సంపాదక బాధ్యతలు నిర్వహించారు.
తొలుత సోమ, బుధవారాల్లో వెలువడిన గోలకొండ పత్రికలో వ్యవసాయం, సాహిత్యం, సంఘ సంస్కరణ, మహిళాభివృద్ధి, అణగారిన కులాల హక్కుల చైతన్యం తదితర అంశాలపై విరివిగా వ్యాసాలు, వార్తలు అచ్చయ్యాయి. తెలంగాణలో గ్రంథాలయోద్యమం, ఆంధ్రోద్యమం జమిలిగా నడవగా వాటితోపాటు గోలకొండ పత్రిక కూడా కలిసే నడిచింది.
తెలంగాణ ప్రాంత యాజమాన్యంలో1926 నుంచి1966 వరకు నాలుగు దశాబ్దాల కాలంపాటు వెలువడిన పత్రిక ఇప్పటి వరకు గోలకొండ పత్రికే కావడం విశేషం. గోలకొండ పత్రిక నడిచిన 40 ఏళ్లలో తెలంగాణలో రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు జరిగాయి. ఈ కాలంలోనే ఆంధ్ర జన సభ, ఆ తర్వాత ఆంధ్ర మహాసభ స్థాపన జరిగింది.
హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు తెలంగాణలోనూ విస్తరించాయి. ఆదిలాబాద్ జిల్లా బాబేఝరీలో కొమురమ్భీం నాయకత్వాన సాయుధ పోరాటం, కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రైతాంగ సాయుధ పోరాటం నడిచాయి. యూనియన్ సైన్యాలకు నిజాం లొంగుబాటు, ప్రభుత్వ ఏర్పాటు జరిగాయి.
అంతేగాక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలనే ఆందోళనలు, పెద్దమనుషుల ఒప్పందాలు, హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్రాల విలీనం కూడా ఈ సమయంలోనే జరిగాయి.1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కారణమైన అనేక ఘటనలు ఈ కాలంలోనే చోటుచేసుకున్నాయి. వీటిలో చాలా ఘటనలపై గోలకొండ పత్రికలో వార్తా కథనాలు, వ్యాఖ్యానాలు, ప్రత్యేక కథనాలు అచ్చయ్యాయి.
గోలకొండ పత్రికలో అప్పటికే మద్రాస్ నుంచి వెలువడుతున్న కృష్ణా, ఆంధ్ర పత్రికల తరహాలోనే గ్రామ స్థాయి వార్తలు మొదలు అంతర్జాతీయ వార్తల వరకు ప్రాచుర్యం కల్పించారు. అర్ధవార పత్రికగా వెలువడినప్పుడు ఒక నమునాలో, 1947లో దినపత్రికగా మారాక కొన్ని మార్పులతో మరో నమూనాలో పత్రికను ముద్రించారు.
►ALSO READ | ఆధ్యాత్మికం : పరాశక్తికి ప్రతిరూపం అమ్మ ..తల్లి గర్భంలో ఉండగానే వ్యక్తిత్వానికి పునాది పడుతుంది..!
స్థానిక వృత్తాంతములు, తెలంగానా వార్తలు, రాష్ట్రీయ వార్తలు, పల్లెటూరి ప్రజల నివేదనం, గ్రామ సమాచారములు అనే శీర్షికల కింద గోలకొండ పత్రిక విలేఖరులు, పాఠకులు రాసిన వార్తలను ప్రచురించేవారు.
గోలకొండ పత్రికలో నాలుగు దశాబ్దాల కాలంలో కవిత్వం విశేషంగా ముద్రితమైంది. పద్య కవితా ఖండికలు, వచన కవితలు, దీర్ఘకవితలు, శతక సాహిత్యం, విదేశీ కవులు రాసిన కవితలకు తెలుగు అనువాదాలు ఇందులో ప్రచురితమయ్యాయి. పత్రిక వ్యవస్థాపక సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి కవిత్వ ప్రచురణకు ప్రాధ్యాన్యమిచ్చారు.
తెలంగాణలో కవులు లేరన్న ఓ కవి తప్పుడు వ్యాఖ్యానానికి ‘గోలకొండ కవుల సంచిక’ రూపంలో సమాధానమిచ్చారు. అందుబాటులో ఉన్న గోలకొండ ప్రతులను పరిశీలిస్తే 228 వచన కవితలు,156 పద్య కవితా ఖండికలు, 22 గేయాలు, 22 అనువాద కవితలు లభ్యమయ్యాయి.
తొలి తెలుగు కథ రచయిత్రి బండారు అచ్చమాంబతో ప్రారంభమైన తెలంగాణ కథాసాహిత్య చరిత్రను గోలకొండ పత్రిక మరింత సుసంపన్నం చేసింది. తెలంగాణలో లబ్ధప్రతిష్టులైన కవులే కాదు.. కథకులు కూడా చాలా మంది ఉన్నారనే విషయం గోలకొండ పత్రిక చదివితే అర్థమవుతుంది. తెలంగాణకు చెందిన తొలితరం రచయితల్లో ఎక్కువ మంది ఈ పత్రికలో కథలు, గల్పికలు, స్కెచ్‌లు రాశారు. వీరిలో కొందరు మాత్రం తర్వాతి రోజుల్లో కథకులుగా ప్రసిద్ధిచెందగా, అనేక మంది తెలంగాణ కథాచరిత్రలో నమోదుకాక గోలకొండ పత్రిక పుటలకే పరిమితమయ్యారు.
గోలకొండ పత్రికలో అచ్చయిన కథలు 415 వకు ఉండగా.. ఇందులో స్వతంత్ర కథలు 333, అనువాద కథలు 82 ఉన్నాయి. కథలతోపాటు 43 స్కెచ్‌లు అచ్చయ్యాయి. యానాంకు చెందిన దళిత విద్యార్థి శ్రీనివాసులు ‘నేరేడుపండ్లకంటు’ శీర్షికతో రాసిన కథ1929లో గోలకొండ పత్రికలో అచ్చయింది.
తెలంగాణ సాహిత్య విమర్శ చరిత్ర ప్రత్యేకతను, వైశిష్ట్యాన్ని అంచనా వేయడానికి గోలకొండ పత్రిక విశేషంగా ఉపయోగపడుతుంది. పరిశోధన విమర్శ, వ్యాఖ్యానాలు కలగలసిన స్థితి గోలకొండ పత్రికలోని విమర్శ వ్యాసాల ప్రత్యేకత. లభించినంతవరకు సాహిత్య విమర్శ వ్యాసాలు 253. వీటితోపాటు 588 గ్రంథాలను సమీక్షించారు. సాహిత్య విమర్శలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది రచయితల వ్యాసాలు గోలకొండ పత్రికలో అచ్చయ్యాయి.
గోలకొండ పత్రికలో తెలుగు భాషపై అర్థవంతమైన చర్చ జరిగింది. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ భాష, మాండలికంపై జరిగిన చర్చ వాస్తవానికి 80 ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. ‘వ్యావహారిక భాషయనగాయేది? రాజమండ్రి తెలుగా, గుంటూరు తెలుగా ? రాయలసీమ తెలుగా ? నైజాం తెలుగా’? అని ప్రశ్నిస్తూ సుదర్శనచార్యులు అనే రచయిత1935లోనే గోలకొండ పత్రికలో వ్యాసం రాశారు.
తెలుగువారు మాట్లాడే భాష ఉత్తర సర్కార్‌ల భాష, రాయలసీమ భాష, తెలంగాణ భాష అని మూడు విధాలుగా ఉంటుందని ‘తెలంగాణ తెలుగు’ శీర్షికతో1943లో గోలకొండ పత్రికలో రాసిన వ్యాసంలో సురవరం ప్రతాపరెడ్డి చెప్పారు. ‘వచ్చినాడు’ అనే రాయలసీమ వారి మాటను ఉత్తర సర్కార్ వారు ‘వచ్చాడు’ అని అంటే తెలంగాణ వారు ‘వచ్చినడు’ లేక ‘వచ్చిండు’ అంటారని చెప్తూ ఆ మూడు ప్రాంతాల భాషా వ్యవహారంలోని సంబంధ భేదాలను వివరించారు.
అంతేకాక తెలంగాణలోనూ ఒక జిల్లాలో వాడే పదాలు ఇంకొక జిల్లాలో కానరావని తెలంగాణలో కనబడే భాషా వైవిధ్యాన్ని ప్రస్తావించారు. కరీంననగర్ జిల్లాలో ‘వ’ కార ప్రయోగం లేదు. ‘అంకాయ, అచ్చినాడు’ అని అంటారని వివరించారు.
తెలంగాణలో రాజకీయ భాష అయిన ఉర్దూ మూలంగా ఆ భాషా పదాలన్నీ తెలుగులోకి చేరి తెలంగాణ తెలుగు సంకరమైందని అంటాడు సురవరం. గోలకొండ పత్రికలో తెలంగాణ చరిత్ర, ఇక్కడి ఆచార, వ్యవహారాలు, సాంస్కృతికపరమైన అంశాలపై అనేక వ్యాసాలు అచ్చయ్యాయి. శేషాద్రి రమణ కవులు, సురవరం ప్రతాపరెడ్డి, దేవులపల్లి రామానుజరావు, పింగళి లక్ష్మీకాంతంలాంటి సాహితీ దురంధరులు తమ వ్యాసాల ద్వారా తెలుగు నేల సాంస్కృతిక వైభవాన్ని, సాహిత్య విశిష్టతను తెలియజేశారు.
చారిత్రక ప్రాంతాలు, పండుగలు, జీవన విధానం గురించి ఈ వ్యాసాలు విపులంగా ఆవిష్కరించారు. చరిత్ర పరిశోధనకు బాటలు వేశారు. తెలంగాణలోని లక్ష్మణరాయ పరిశోధక మండలి, వరంగల్ కేంద్రంగా స్థాపితమైన ఆంధ్ర చారిత్రిక పరిశోధక మండలి ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనలను గోలకొండ పత్రిక ఎప్పటికప్పుడు ప్రచురిస్తూ తెలంగాణ ప్రజలు తమ ప్రాంత చరిత్రను తెలుసుకునేలా చేసింది. ఇలా పరిశోధకులను కూడా ప్రోత్సహించింది. తెలంగాణ ప్రాంతంలో చరిత్ర పరిశోధన 20వ శతాబ్ధి నుంచే ప్రారంభమైందని ఈ పత్రికలో వచ్చిన వ్యాసాలు, వార్తల ద్వారా తెలుస్తోంది.
►ALSO READ | ఆధ్యాత్మికం: అపూర్వ ఘటన.. సహస్రారచక్ర ఆవిష్కరణ.. అసూయ, ద్వేషంతో విషవలయంగా సమాజం
‘నిజాం రాష్ట్రమునందు ఆంధ్ర కవులే పూజ్యమ’ అంటూ గోలకొండ భావ సంవత్సరాది సంచికలో ముడుంబై వెంకటరాఘవాచార్యులు అనే రచయిత తన వ్యాసంలో చేసిన ప్రకటనకు సమాధానంగా, తెలంగాణ ఆత్మ గౌరవ ప్రకటనగా వెలువడిందే గోలకొండ కవుల సంచిక. తెలంగాణ సాహిత్య చరిత్రలో మైలురాయిగా నిలిచిన ఈ సంచికను తీసుకురావాలన్న సురవరం ప్రతాపరెడ్డి ఆలోచనకు గోలకొండ పత్రికే వేదికగా మారింది. ఈ సంచికకు సంబంధించిన పనులన్నీ హైదరాబాద్ ట్రూప్ బజార్ లోని గోలకొండ పత్రిక ఆఫీసు కేంద్రంగానే సాగాయి. 354 మంది కవుల కవిత్వంతో కూడిన ఈ గోలకొండ కవుల సంచిక తెలుగు సాహిత్య చరిత్రలో ఒక సంచలనంగా చెప్పవచ్చు.
గోలకొండ పత్రిక సంపాదకులకు ఉన్న పరిమితులు, కాంగ్రెస్ అనుకూల భావజాలం దృష్ట్యా కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారాన్ని సాగించారు. తొలిసారి తెలంగాణలో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అనూకూలతను ప్రదర్శించడం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది పత్రిక నిర్వహణలో ఒక పాలసీగా కొనసాగింది.
1955 నవంబర్‌లో విశాలాంధ్రను వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగించాలనే డిమాండ్తోఈ ప్రాంతంలో జరిగిన ఆందోళనలు, సభలను పతాక శీర్షికగా ప్రచురించింది. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను బలపరిచింది. రాష్ట్రాల పునర్విభజన కమిషన్ రాష్ట్రంలో పర్యటించినప్పుడు తెలంగాణ వాణిని ఈ పత్రిక వినిపించింది.1926 నుంచి1966 వరకు తెలంగాణ జనజీవనాన్ని, సంస్కృతిని, చైతన్యాన్ని గోలకొండ పత్రిక గొప్పగా రికార్డు చేసింది.-
-డాక్టర్ నుగ్గునూతుల యాకయ్య,సీనియర్ జర్నలిస్ట్-
లైఫ్& లిటరేచర్ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్ ఐడీ featureseditor@v6velugu.com
