విద్యుత్​ సంస్కరణ బిల్లుతో అన్ని వర్గాలకు మేలు

విద్యుత్​ సంస్కరణ బిల్లుతో అన్ని వర్గాలకు మేలు
  • కేసీఆరే గుత్తాధిపత్యం కోరుకుంటున్నరు 
  • మీడియాతో కేంద్ర విద్యుత్​ శాఖ మంత్రి ఆర్​కే సింగ్​

న్యూఢిల్లీ, వెలుగు: దేశంలోని అన్ని వర్గాలకు మేలు చేసేందుకే కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణ బిల్లును తెచ్చిందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్​కే సింగ్ స్పష్టం చేశారు. ఈ బిల్లులో ఎక్కడ కూడా ఫ్రీ కరెంట్​ ఇవ్వొద్దనే మాట లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను ఇది అడ్డుకోదని తేల్చిచెప్పారు. బిల్లులో మోనోపోలి(గుత్తాధిపత్యం) లేదని,  కేసీఆరే మోనోపోలి కావాలని కోరుకుంటున్నారని, అందుకే బిల్లును వ్యతిరేకిస్తున్నారని ఆయన మండిపడ్డారు. విద్యుత్ రంగంలో మోనోపోలిని అరికట్టడానికి విద్యుత్ సంస్కరణ బిల్లు దోహదపడుతుందని, ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. బుధవారం ఢిల్లీలోని బీజేపీ హెడ్ ఆఫీసులో ఆయనను మీడియాతో మాట్లాడారు. కేంద్ర విద్యుత్ సంస్కరణ బిల్లుపై ఇటీవల అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

‘‘విద్యుత్​ సంస్కరణ బిల్లు పవర్ కంపెనీల మధ్య పోటీ తత్వాన్ని పెంచుతుంది. ఫలితంగా ప్రజలకు మంచి  సర్వీస్ అందుతుంది. పైగా తక్కువ ధరకే కరెంట్ వస్తుంది’’ అని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లును వెనక్కి తీసుకోబోమన్నారు. ప్రజలకు తక్కువ ధరకు బెటర్ సర్వీస్ అందించడం తమ ఆలోచన విధానమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు, ఇతర వర్గాలకు ఇచ్చే  విద్యుత్ సబ్సిడీలను అడ్డుకునేలా ఎక్కడా బిల్లులో లేదన్నారు. రైతులకే కాకుండా, ఏ వర్గం వారికైనా ఫ్రీ కరెంట్ ఇచ్చుకోవచ్చని, ఇందులో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది, అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.