డిమాండ్ల పరిష్కారానికి సమ్మెబాట పట్టిన విద్యుత్​ సిబ్బంది

డిమాండ్ల పరిష్కారానికి సమ్మెబాట పట్టిన విద్యుత్​ సిబ్బంది
  • సమస్యల్లో ‘సెస్’
  • డిమాండ్ల పరిష్కారానికి సమ్మెబాట పట్టిన విద్యుత్​ సిబ్బంది
  • రీడింగ్ తీయని అసిస్టెంట్ హెల్పర్లు
  • నిలిచిన రూ.14.70 కోట్ల విద్యుత్​బిల్లుల వసూలు
  • గతనెల బిల్లులే చెల్లించాలంటున్న అధికారులు

సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు :  రాజన్న సిరిసిల్ల సెస్(సహకార విద్యుత్ సరఫరా సంఘం) లో ఆర్థిక సంక్షోభం నెలకొంది. రెండేళ్లుగా పాలకవర్గం లేకపోవడం, ఆఫీసర్ల నిర్లక్ష్యంతో సెస్ వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జిల్లాలో 255 గ్రామాలు, సిరిసిల్ల, వేములవాడ పట్ణణాలలో ఉండే 2.54లక్షల వినియోగదారులకు సెస్ సేవలందిస్తోంది. 1.60లక్షల మంది వినియోగదారులు విద్యుత్ బిల్లు చెల్లిస్తారు. వారి నుంచి ప్రతీనెల రూ.14.70 కోట్లు వసూలవుతాయి.సెస్ పరిధిలో 372 మంది సిబ్బందికి నెలవారి సుమారు 2.50 కోట్ల జీతాలు చెల్లిస్తారు.  

జూలై బిల్లే ఆగస్టులో..

విద్యుత్​సిబ్బంది సమ్మెబాట పట్టడంతో వినియోగదారులకు ఆగస్టు కరెంట్ బిల్లు అందలేదు. దీంతో జూలై లో వచ్చిన బిల్లు ప్రకారమే ఆగస్టులో చెల్లించాలని సెస్​ అఫీసర్లు ప్రకటించారు.147 మంది అసిస్టెంట్ హెల్పర్ తమకు ప్రమోషన్లు కావాలని కోరుతూ గతనెల చివరి వారంలో సెస్ సంస్థకు సిమ్ కార్డులను వాపస్ ఇచ్చారు. ప్రతీరోజూ నిరసనలు తెలుపుతున్నారు. హెల్పర్ లు  రీడింగ్ తీయలేదు. వినియోగదారులకు  బిల్లులు ఇవ్వలేదు. హెల్పర్ల సమస్యను సెస్ అధికారులు పట్టించుకోకపోవడంతో సమస్య జటిలమైంది. మరోవైపు హెల్పర్ లు రీడింగ్ తీయకపోవడంతో జూలై నెలకు చెందిన రూ.14.70 కోట్ల విద్యుత్ బిల్లల వసూలు నిలిచిపోయింది. 
డబుల్ బిల్లులతో ఇబ్బంది

ఆగస్టు నెలలో బిల్లులు ఇవ్వకపోవడంతో జూలైలో వచ్చిన బిల్లు ప్రకారం చెల్లించాలని అధికారులు చెబుతున్నారు. నెల రోజుల తర్వాత రీడింగ్ తీస్తే స్లాబ్​ మారిపోయి వినియోగదారుల మీద అదనపు భారం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే 90 శాతం బిల్లులు నిలిచిపోవడంతో వచ్చే నెల సిబ్బంది జీతాలు చెల్లించేందుకు ఇబ్బందులు తలెత్తుతాయి. సంస్థ నిర్వాహణ వ్యయానికి, ఎన్​పీడీసీఎల్ కు చెల్లించే విద్యుత్ బిల్లులకు ఇబ్బందులు రానున్నాయి. 

పాలకవర్గం లేని సెస్..

సిరిసిల్ల సెస్ కు పాలక వర్గం లేకపోవడంతో సమస్యలు ఎక్కువయ్యాయి. రెండేళ్లుగా పాలవ వర్గంలేక స్పెషల్ ఆఫీసర్లే ఇన్​చార్జిలుగా కొనసాగుతున్నారు. 2021 తర్వాత ఎన్నికలు నిర్వహించలేదు. 2022 ఏప్రిల్ 18న సెస్ కు పర్సన్ ఇన్​చార్జితోపాటు 14 మంది డైరెక్టర్లను నియమించారు. పర్సన్ ఇన్​చార్జి చైర్మన్ గా సిరిసిల్లకు చెందిన గూడూరి ప్రవీణ్ ను నియమించగా.. ఏప్రిల్ 19న పాలక వర్గం బాధ్యతలు స్వీకరించింది. అయితే సెస్ కు ఎన్నికల నిర్వహించకుండా పాలక వర్గాన్ని నియమించడంపై బోయిన్ పల్లి మండలం విలాసాగర్ కు చెందిన ఏనుగుల కనకయ్య హై కోర్టును ఆశ్రయించగా కోర్టు జూన్ 15న వీరి నియామాకం చెల్లదని స్టే విధించింది. దీంతో సెస్ కు పాలక వర్గం లేకుండా పోయింది. సమస్య కోర్టు పరిధిలో ఉండటంతో పాత కమిటీని కొనసాగించలేక, కొత్త పాలక వర్గాన్ని నియమించలేకపోతున్నారు. 

సమ్మె నోటీసులు ఇచ్చాం

సెస్ లో ఏడేండ్ల నుంచి హెల్పర్ గా పని చేస్తున్న. మూడేండ్ల కింద పర్మినెంట్ కాగా, రెండేడ్ల కిందట ప్రొబెషన్ డిక్లేర్ అయ్యింది. ప్రొబెషన్ పూర్తయిన ఏడాదికే ప్రమోషన్ ఇవ్వాలి. కానీ ఇంత వరకు ఇవ్వలేదు. ఆరు  నెలలుగా ప్రమోషన్ ఇవ్వాలని అడుగుతున్నా సెస్ మేనేజ్​మెంట్​పట్టించుకోవడంలేదు. దీంతో జూలై 15న స్ట్రైక్ నోటీస్ ఇచ్చాం. ఆగస్టు 21 నుంచి సంపూర్ణ సమ్మెకు దిగుతాం. - రమేశ్, హెల్పర్​

ప్రతిపాదనలు పంపాం

హెల్పర్స్ డిమాండ్ లను పరిశీలిస్తున్నాం. నివేదికను పై ఆఫీసర్లకు పంపాం. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తాం. ఆగస్టు నెల కరెంట్ బిల్లు రీడింగ్ రానందున గత నెల బిల్లు ప్రకారం చెల్లించాలని  ప్రకటించాం.


- రామకృష్ణ, సెస్ ఎండీ