గడ్డు పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్స్ కంపెనీలు.. టారిఫ్లతో ఎగుమతులకు దెబ్బ.. ఆల్టర్నేటివ్స్ వైపు పరుగు

గడ్డు పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్స్ కంపెనీలు.. టారిఫ్లతో ఎగుమతులకు దెబ్బ.. ఆల్టర్నేటివ్స్ వైపు పరుగు

న్యూఢిల్లీ: అమెరికా విధించిన తాజా టారిఫ్​లు వల్ల చిన్న భారతీయ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఎగుమతులు దెబ్బతినకుండా చూడటానికి ప్రయత్నాయ మార్గాలను వెతుకుతున్నాయి. దేశంలోనే విస్తరణను పెంచడం గురించి ఆలోచిస్తున్నాయి. ఇతర అంతర్జాతీయ మార్కెట్ల కోసం వెతుకుతున్నాయి. ప్రస్తుతం, స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌‌‌‌టాప్స్​ వంటి కీలక ఉత్పత్తులకు ఈ 50శాతం టారిఫ్​ల నుంచి మినహాయింపు లభించింది. 

దాదాపు 50 బిలియన్ల విలువైన ఈ ఉత్పత్తులకు ప్రస్తుతం టారిఫ్​లు లేవు. అయితే, ఎలక్ట్రిక్ ఇన్వర్టర్లు, బ్యాటరీ చార్జర్లు వంటి ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు 50శాతం టారిఫ్ పడుతోంది. దీనివల్ల చాలా కంపెనీలు తమ బిజినెస్​ప్లాన్లను మార్చుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీల ఎగుమతులు నిలిచిపోయాయి. ఉదాహరణకు, మునోత్ ఇండస్ట్రీస్ పవర్ బ్యాంకుల కోసం లిథియం- అయాన్ సెల్స్ తయారు చేస్తుంది. అమెరికా మార్కెట్ కోల్పోవడం తమకు పెద్ద నష్టమని తెలిపింది. యూఎస్​ వ్యాపారంలో దేశీయ మార్కెట్ కంటే రెట్టింపు లాభం ఉంటుందని కంపెనీ పేర్కొంది. 

డిక్సన్ టెక్నాలజీస్ వంటి కాంట్రాక్ట్ తయారీదారులు పరిస్థితిని గమనిస్తూ  వేచి చూసే ధోరణిలో ఉన్నారు. సెమీకండక్టర్ ఆధారిత ఉత్పత్తులపై యూఎస్​ ప్రభుత్వం త్వరలో టారిఫ్​లను ప్రకటించవచ్చని  భావిస్తున్నారు. ఇదే జరిగితే ప్రభుత్వ సహాయం కోరాలని నిర్ణయించుకున్నారు. అంబర్ ఎంటర్‌‌‌‌ప్రైజెస్ వంటి ఇతర కంపెనీలు ప్రస్తుతం ఎగుమతులను నిలిపివేసి,  ఇతర మార్కెట్ల వైపు దృష్టి సారించాలని ఆలోచిస్తున్నాయి.

ప్రభావం ఎక్కువే...

ఇండియా ఎలక్ట్రానిక్స్  సెమీకండక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ చందాక్ మాట్లాడుతూ,  మెడికల్ ఎలక్ట్రానిక్స్, టెలికాం పరికరాలు వంటి ఉత్పత్తులపై టారిఫ్​లు గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.   కంపెనీలు ఆసియా, యూరప్, రష్యా వంటి ఇతర మార్కెట్లకు వెళ్లాలని సూచించారు. 

ఇండియా సెల్యులార్  ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్  ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 46-–50 బిలియన్​డాలర్లకు చేరుకుంటాయి. జూన్ క్వార్టర్​లో 12.4 బిలియన్ల ఎగుమతులు నమోదయ్యాయి. ఈ అంచనాల్లో సెమీకండక్టర్ టారిఫ్​ల ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోలేదు.