
నిజమే.. ఏనుగు పేడతో పేపర్ తయారవుతోంది. అయితే, ఇది మన దగ్గర కాదు.. శ్రీలంకలో. ఏనుగు పేడలో ఉన్న పీచు పదార్థానికి ఇతర వ్యర్థాలు కలిపి ఎకో పేపర్ తయారు చేశాడు తుసితా రాణాసింఘే. దీని కోసం శ్రీలంకలో కెగాల్లే జిల్లాలో ని పిన్నవలా ఏనుగుల శరణాలయంలోని ఏనుగుల పేడను వాడుతున్నాడు.
30 దేశాల్లో వినియోగం
ఏనుగులు శాకాహారులు కావడంతో అవి గడ్డి, ఆకులు తిని పీచు పదార్థాన్ని విసర్జిస్తాయి. ఈ పేడ పేపర్ తయారీకి కావాల్సిసిన ముడి సరుకుగా పని చేస్తుంది. ముందుగా పేడను శుభ్రం చేసి.. వేడి చేస్తారు. దానికి రంగులు కలిపి, కంప్రెస్ చేస్తారు. రీసైకిల్ చేయడానికి వీలుగా, నాణ్యమైన పేపర్ ను ఉత్పత్తి చేస్తారు. ఈ పేపర్ అచ్చం చెట్ల నుంచి తయారైన కాగితంలానే ఉంటుంది. ప్రసుత్తం ఈ పేపర్ ని 30 దేశాల్లో వాడుతున్నారు.
ప్రతి ఏనుగు రోజుకు పదహారుసార్లు మలాన్ని విసర్జిస్తుంది. దీంతో పేపర్ తయారీకి అవసరమైన ముడి సరుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైగా అడవులను నరకాల్సిన పని లేదు. కాగా, ఈ పరిశ్రమ ఏర్పాటుతో శ్రీలంకలోని చాలామంది నిరుద్యోగులకు పని దొరికింది. ఏనుగు పేడ సేకరించడమే వీళ్ల పని. వ్యాపారంలో వచ్చే లాభాల్లో కొంత భాగాన్ని ‘మిలీనియం ఎలిఫెంట్ ఫౌండేషన్ ’కు పంపిస్తోంది కంపెనీ.
ఏడుగురితో ప్రారంభమైన ఈ పరిశ్రమలో ప్రస్తుతం 150 మంది పని చేస్తున్నారు. పర్యావరణానికి హాని కలుగుకుండా నూతన ఆలోచనలతో సృష్టించిన ఈ పేపర్ పరిశ్రమకు ‘గ్లోబల్ కాంపిటీషన్స్’లో ‘గ్రీన్ లీడర్‌షిప్ ’ అవార్డు అందుకున్నాడు రాణా సింఘే. ‘ఏనుగు పేడతో పాపిరస్ అనే పేపర్ ని తయారు చేస్తారు. పాపిరస్ అనే పేపర్ ని పురాతన కాలంలో ఈజిప్టులో వాడేవాళ్లు. గత నలభై ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 400 శాతం పేపర్ ఉత్పత్తి పెరిగింది. దీంతో ప్రతి ఖండంలో దాదాపు 35 శాతం చెట్లు నరికివేశారు. ప్రతి నిత్యావసర వస్తువులకు పేపర్లు వాడుతుండటంతో చెట్లు అంతరించి పోతున్నాయ’ని తుసితా రాణాసింఘే. ‘గ్రీన్ లీడర్ షిప్ అవార్డుతో అప్పటి వరకు నన్ను ఎగతాళి చేసిన వాళ్లు కూడా నన్ను గుర్తించడం మొదలుపెట్టార’ని చెప్పారు.