న్యూఢిల్లీ:సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ప్రతిపక్ష పార్టీలు తొలిసారి భేటీకానున్నాయి. శుక్రవారం పార్లమెంట్ సెంట్రల్ హాలులో జరగనున్న ప్రతిపక్ష పార్టీల సమావేశానికి కాంగ్రెస్ నేతృత్వం వహించనుంది. దీనికి డీఎంకే, ఎన్సీపీ, టీడీపీ, జేడీఎస్, ఆర్జేడీ, సీపీఐ, సీపీఎం, జేఎంఎం, ఇండియన్ ముస్లింలీగ్, కేసీఎం, ఆర్ఎస్పీ పార్టీలకు చెందిన నేతలు హాజరుకానున్నారు. ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ నాయకులు కూడా సమావేశానికి వచ్చే అవకాశాలున్నాయి. వీరంతా ఓటమికి గల కారణాలను విశ్లేషించుకోవడంతోపాటు భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నారు. జూన్6 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానుండటంతో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చించనున్నారు. ఎన్నికల అంశాలతోపాటు ఈవీఎంల పనితీరు, 50 శాతం వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానిగా మోడీ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాతి రోజే ప్రతిపక్షాలు భేటీ కానుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
సీపీపీ లీడర్‌గా రాహుల్?
ఎన్నికల ఫలితాలు వెలువడి వారం తర్వాతగానీ కాంగ్రెస్పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) భేటీకి ముహుర్తం ఖరారైంది. శుక్రవారం(జూన్ 1న) సీపీపీ జరపాలని అధిష్టానం డిసైడైంది. ఎన్నికల్లో దెబ్బతిన్న కాంగ్రెస్, 52 సీట్లకే పరిమితం కావడం, నైతిక బాధ్యతగా చీఫ్ పదవికి రాహుల్ రాజీనామా చేస్తాననడం తదితర పరిణామాలతో పార్టీలో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. శుక్రవారం నాటి భేటీలోనే సీపీపీ నేతను ఎన్నుకోనున్నారు. పార్టీ బాధ్యతల నుంచి తప్పుకునే పక్షంలో సీపీపీ లీడర్ బాధ్యతలు తీసుకునేందుకు రాహుల్ ఓకే చెప్పినట్లు సమాచారం.
