కోలిండియా తీరుపై సంఘాల మండిపాటు

కోలిండియా తీరుపై సంఘాల మండిపాటు
  • వాయిదా పడ్డ జేబీసీసీఐ మీటింగ్​
  • ప్రొటెస్ట్​ డే నిర్వహించాలని నిర్ణయం​

మందమర్రి, వెలుగు: బొగ్గు గని కార్మికుల 11వ వేజ్​బోర్డు ఆరో జేబీసీసీఐ మీటింగ్ ​ఎలాంటి ఫలితం తేలకుండానే వాయిదా పడింది. శుక్రవారం కోలిండియా చైర్మన్​ప్రమోద్ ​అగర్వాల్ ​అధ్యక్షతన  కలకత్తాలో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో జేబీసీసీ సంఘాలైన బీఎంఎస్, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ ప్రతినిధులు, ఆయా బొగ్గు పరిశ్రమల యాజమాన్యాలు పాల్గొన్నాయి. చర్చల వివరాలను జేబీసీసీ మెంబర్లు , కార్మిక నేతలు కె.లక్ష్మారెడ్డి(బీఎంఎస్), వాసిరెడ్డి సీతారామయ్య(ఏఐటీయూసీ), రియాజ్​అహ్మద్​(హెచ్ఎంఎస్) తెలిపారు. మినిమం గ్యారంటీ బెనిఫిట్​విషయంలో సీఐఎల్​యాజమాన్యం, కార్మిక సంఘాల ప్రతినిధుల మధ్య  ప్రధాన చర్చ జరిగింది. 50 శాతం మినిమం గ్యారంటీ బెనిఫిట్(ఎంజీబీ)​ పెరుగుదలకు సంఘాల ప్రతినిధులు పట్టుబట్టారు. కనీసం 35 శాతం పెరుగుదలకు కార్మిక సంఘాలు ప్రతిపాదన తీసుకువచ్చి చివరకు 30 శాతం ఇవ్వాలని డిమాండ్​ చేశారు.  దీనికి కోలిండియా యాజమాన్యం మూడు శాతం  తర్వాత 10 శాతం వరకు పెరుగుదలకు ప్రతిపాదన తెచ్చింది. రూ. కోట్ల డివిడెండ్ ​ఇస్తూ కార్మికులకు జీతాలు పెంచితే కంపెనీ నష్టాల్లోకి పోతుందని చెప్పుకొచ్చింది. దీన్ని కార్మిక సంఘాల ప్రతినిధులు తప్పుబట్టారు. కనీసం 30 శాతం ఎంజీబీ ప్రకటించాలని పట్టుబట్టారు. రెండుసార్లు జరిగిన చర్చల్లో ఎలాంటి ఫలితం రాలేదు.  యాజమాన్యం చర్చల్లో మొదటి నుంచి మొండిగానే వ్యవహరించడంతో కార్మిక సంఘాల ప్రతినిధులు కోలిండియా, సింగరేణి వ్యాప్తంగా ప్రొటెస్ట్​ డే నిర్వహించాలని నిర్ణయించారు. చివరకు దీపావళి బోనస్​పై ఈ నెల 27న ఢిల్లీలో చర్చలు జరుగనున్నాయని, దాని తర్వాత మళ్లీ చర్చలు జరుపుదామని యాజమాన్యం చెప్పడంతో సమావేశం వాయిదా పడింది.  అక్టోబర్​ నెలాఖరులోపు  మళ్లీ చర్చలు  జరిగే చాన్స్​ ఉందని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. 

9 నుంచి కాంట్రాక్టు కార్మికుల సమ్మె
గోదావరిఖని, వెలుగు:  సింగరేణిలో పని చేస్తున్న 22 వేల మంది కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 9 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చినట్టు సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల రాష్ట్ర జేఏసీ తెలిపింది. శుక్రవారం గోదావరిఖని సీఐటీయూ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో జేఏసీ మీటింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. వివిధ యూనియన్ల ప్రతినిధులు జి.సత్యనారాయణ, బి.మధు, ఎ.వెంకన్న, యాకూబ్‌‌‌‌‌‌‌‌ షావలి, కె.విశ్వనాథ్‌‌‌‌‌‌‌‌, జి.రమేశ్‌‌‌‌‌‌‌‌ మాట్లాడారు. సింగరేణిలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచడం లేదని, కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పర్మినెంట్ కార్మికులతో సమానంగా కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నప్పటికీ వేతనాల్లో వ్యత్యాసం ఉందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును సైతం లెక్కచేయకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సమ్మె నోటీస్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన నాటినుంచి 9 సార్లు మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌తో చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి పురోగతి లేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు దిగుతున్నామని, కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.