డ్రైవింగ్‌ లైసెన్స్‌ గడువు తీరిన ఏడాదిలోగా రెన్యువల్‌ చేసుకుంటే అర్హులే

డ్రైవింగ్‌ లైసెన్స్‌ గడువు తీరిన ఏడాదిలోగా రెన్యువల్‌ చేసుకుంటే అర్హులే
  • ఆ అభ్యర్థులను డ్రైవర్​ పోస్టుల ఎంపికలో పాల్గొననివ్వాలి
  • పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: డ్రైవింగ్‌  లైసెన్స్‌ గడువు పూరైన ఏడాదిలోగా రెన్యువల్‌  చేయించుకున్న అభ్యర్థులను విపత్తుల విభాగం, అగ్నిమాపక శాఖలో డ్రైవర్‌ పోస్టుల భర్తీ ఎంపిక ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతించాలని పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డును హైకోర్టు ఆదేశించింది. ఆ శాఖల్లో డ్రైవర్‌  పోస్టుల భర్తీ కోసం గతేడాది బోర్డు నోటిఫికేషన్‌  ఇచ్చింది. అభ్యర్థులకు రెండేండ్లు అంతకంటే ఎక్కువ డ్రైవింగ్‌  లైసెన్స్‌  ఉండాలని షరతు విధించింది. లైసెన్స్‌ రెన్యువల్‌  చేసుకునేందుకు మధ్య సమయాన్ని గ్యాప్‌ ఉన్నట్లుగా పరిగణించింది. ఈ నిబంధనను  సవాల్  చేస్తూ 16 మంది అభ్యర్థులు హైకోర్టులో వేసిన పిటిషన్లపై జస్టిస్‌ మాధవిదేవి ఇటీవల విచారించారు. 

గతంలో మధ్యంతర ఉత్తర్వుల తర్వాత వారు పరీక్షలు రాశారని, గతంలో రాసిన పరీక్షలు, ఫిజికల్​ టెస్టులు, డ్రైవింగ్‌ పరీక్షల ఫలితాలను విడుదల చేయాలని, ఎంపిక ప్రక్రియ చేపట్టాలని చెప్పారు. మోటార్‌  వెహికల్స్‌  లైసెన్స్‌  యాక్ట్‌  ప్రకారం లైసెన్స్‌ గడువు పూర్తయిన 30  రోజుల్లో రెన్యువల్‌ చేయించుకోవాలి. ఈ నిబంధననను 2019లో ప్రభుత్వం సవరించింది. దీని ప్రకారం ఏడాది ముందుగా లేదా గడువు ముగిసిన ఏడాది లోపు రెన్యువల్‌ చేసుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని పిటిషనర్లు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. కాగా, పిటిషనర్లు లైసెన్స్‌ గడువు ముగిసిన 204 రోజుల్లోగా రెన్యువల్‌  చేసుకున్నారని, పరీక్షలకు హాజరైన అభ్యర్థుల ఫలితాలను విడుదల చేయాలని రిక్రూట్‌మెంట్‌  బోర్డును కోర్టు ఆదేశించింది.