కోకాకోలాను కూడా కొంటా

కోకాకోలాను కూడా కొంటా

వాషింగ్టన్: టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ మరో కీలక ప్రకటన చేశారు. ఇటీవల ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన ప్రపంచ కుబేరుడు.. తర్వాత కోకాకోలా కంపెనీని కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు. కొకైన్‌ను తిరిగి తీసుకువచ్చేందుకు కోకాకోలాను కొనుగోలు చేయనున్నట్లు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. అలాగే ఐస్ క్రీం మెషీన్లను ఉంచడానికి మెక్ డొనాల్డ్ కంపెనీని కూడా కొంటున్నట్లు తెలిపాడు. అయితే ట్విట్టర్ ను కొన్న మస్క్... ఓనర్ గా ట్విట్టర్ లో సరదాగా పై పోస్టులు పెట్టారు. ‘చూడండి... నేను అద్భుతాలు చేయలేను..కానీ సాధ్యమైనంత వరకు ట్విట్టర్ ను ఫన్ క్రియేట్ చేయడానికే ఉపయోగిస్తా’ అంటూ ట్వీట్ చేశారు.

ఇప్పటికే 44 బిలియన్లకు ట్విట్టర్ మస్క్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. సంస్థ ఒక్కో షేరును 54.20 డాలర్లకు కొనుగోలు చేశారు. ఈ మొత్తాన్ని మస్క్‌ నగదు రూపంలో చెల్లించనున్నారు. తాజాగా కోకాకోలాను కూడా కొనుగోలు చేయనున్నట్లు మస్క్ ప్రకటించడంతో... మస్క్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. 9.2 శాతం వాటాతో ట్విట్టర్ లో అడుగుపెట్టిన మస్క్... ఇప్పుడు ఏకంగా ట్విట్టర్ సంస్థనే సొంతం చేసుకున్నారు. అయితే మస్క్ ఆఫర్ కు మొదట నో చెప్పిన ట్విట్టర్ తర్వాత సంస్థను అమ్మడానికి ఒప్పుకుంది. అయితే... మస్క్ మదిలో ఏముందో తెలియదు కానీ కోకాకోలా మస్క్ పోస్ట్ కు ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.