
న్యూఢిల్లీ: ఒకప్పుడు 340 బిలియన్ డాలర్ల విలువైన సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా రికార్డు కొట్టిన ఎలాన్ మస్క్ తాజాగా ఒక స్థానం వెనక్కి తగ్గారు. లూయిస్ విట్టన్ అధిపతి బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఆయనను వెనక్కి నెట్టి మొదటి ర్యాంకు సంపాదించుకున్నారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, 51 ఏళ్ల ఎలాన్ మస్క్ సంపద జనవరి నుంచి 100 బిలియన్ డాలర్లు 164 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఆర్నాల్ట్ సంపద 171 బిలియన్ డాలర్ల కంటే ఇది 7 బిలియన్ డాలర్లు తక్కువ. ఆయన సంపద ఎక్కువగా ఫ్యాషన్ బ్రాండ్ ఎల్వీఎంహెచ్లోని 48శాతం వాటా నుంచి వచ్చింది. 2021 సెప్టెంబర్ లో మస్క్ మొదటిసారి అత్యంత సంపన్నుల జాబితాలో నంబర్2గా రికార్డులకు ఎక్కారు. ఇప్పుడు మళ్లీ అదే స్థానానికి వచ్చారు. 2022లోనే ఆయన సంపద విపరీతంగా తగ్గింది.
మస్క్ ఈ ఏడాది ఏప్రిల్‌లో 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను కొనడానికి ఆఫర్ ఇచ్చారు. ఫెడరల్ రిజర్వ్, ఇతర సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను పెంచడంతో సమస్యలు ఎదురయ్యాయి. మస్క్ కలల కంపెనీ టెస్లా షేర్ల విలువ తగ్గింది. దీంతో కంపెనీ వాల్యుయేషన్ బాగా పడిపోయింది. 2022లో ఈ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ స్టాక్ 50 శాతానికిపైగా పడింది. మస్క్ ట్విట్టర్ ఒప్పందం నుంచి బయటపడేందుకు నెలల తరబడి ప్రయత్నించినా విజయం సాధించలేదు. ట్విట్టర్లో స్పామ్ ఖాతాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒప్పందం నుంచి వైదొలుగుతానని ఒకదశలో ప్రకటించారు. చివరికి ట్విట్టర్‌కు యజమానిగా మారారు. నిధుల కోసం టెస్లా షేర్లలో 15 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను అమ్మేశారు. ఈ ఏడాది- ఏప్రిల్‌లో సుమారు 8.5 బిలియన్ డాలర్ల షేర్లను, ఆగస్టులో మరో 6.9 బిలియన్ డాలర్ల షేర్లను అమ్మి ట్విట్టర్ కోసం నగదును సమకూర్చుకున్నారు. ఆయన అక్టోబర్‌లో ట్విట్టర్ కొన్నాక బ్లూమ్‌బర్గ్ వెల్త్ ఇండెక్స్ ప్రకారం మస్క్ సంపద 10 బిలియన్ డాలర్లు తగ్గింది. ఈ సోషల్-మీడియా ప్లాట్‌ఫారమ్ నుంచి కొందరు ఉద్యోగులను కూడా తొలగించారు.