శుక్రవారంలోపు ట్విట్టర్ కొనుగోలు పూర్తి చేసే యోచనలో మస్క్

శుక్రవారంలోపు ట్విట్టర్ కొనుగోలు పూర్తి చేసే యోచనలో మస్క్

ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియను శుక్రవారం (అక్టోబరు 28)లోపే పూర్తిచేయాలని భావిస్తున్నట్లు ఎలన్ మస్క్ తన ఇన్వెస్టర్లకు వెల్లడించారు. ఈ ఒప్పందానికి కావాల్సిన నిధులను సమకూరుస్తున్న బ్యాంకర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మస్క్ ట్విట్టర్ కొనుగోలు కోసం బ్యాంకర్ల నుంచి 13 బిలియన్ డాలర్లను సమకూర్చుకుంటున్నారు. ఈ ప్రక్రియ దాదాపు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. సంబంధిత డ్యాక్యుమెంట్లపై బ్యాంకులు సంతకం చేస్తే మస్క్ ఖాతాలోకి నిధులు బదిలీ అయ్యే అవకాశం ఉంది.

ట్విట్టర్ కొనుగోలుకు కావాల్సిన నిధులను అందిస్తున్న బ్యాంకుల్లో మోర్గాన్ స్టాన్లీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా, బార్క్లేస్, ఎంయూఏఎఫ్జీ, బీఎన్పీ పరిబస్, మిజుహో, సోషియేట్ జనరేల్ వంటి సంస్థలు ఉన్నట్లు గతంలోనే బ్లూమ్బర్గ్ తెలిపింది. కొనుగోలు విషయంలో మస్క్ వ్యవహరిస్తున్న తీరుపై ఆయా బ్యాంకులు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించడం వంటి అంశాలతో బ్యాంకులు ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లోకి వెళ్లాయని.. అందుకే మస్క్ వారితో సమావేశమై శుక్రవారం వరకు డీల్ ముగిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ నెల 28లోపు ట్విట్టర్ కొనుగోలుపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని..లేకపోతే విచారణ ప్రారంభిస్తామని కోర్టు హెచ్చరించింది. కోర్టు విధించిన గడువులోపే డీల్ను క్లోజ్ చేయాలనే యోచనలో మస్క్ ఉన్నట్లు సమాచారం.