ముసలి ఏనుగుతో ఉత్సవమా?

ముసలి ఏనుగుతో ఉత్సవమా?
  • సోషల్​ మీడియాలో నెటిజన్లు ఫైర్​
  • వెనక్కి తగ్గిన శ్రీలంక గుడి

ఏనుగు అనగానే మనకు భారీ ఆకారం, కండ పుష్టే గుర్తుకొస్తది. కానీ ఈ ఏనుగు మాత్రం ఎముకలు తేలి స్కెలెటన్​లా మారిపోయింది. దాని పేరు టికిరి. వయసు 70 ఏళ్లు. శ్రీలంకలో ఉంటుంది.  ఈ ఏనుగునే శ్రీలంకలోని ప్రముఖ గుడి ‘టెంపుల్​ ఆఫ్​టూత్​’లో ఏటా నిర్వహించే పెరాహెరా ఫెస్టివల్​లో పరేడ్​ చేయించేందుకు నిర్వాహకులు ప్రయత్నించారు. అయితే ఓ బుద్ధిస్ట్​ పేజీలో ఆ ఏనుగు ఫొటోలను షేర్​ చేయడం, నెటిజన్లు విమర్శలు గుప్పించడంతో నిర్వాహకులు వెనక్కి తగ్గారు. ‘‘సరైన పోషకాహారం లేక టికిరి బాగా జబ్బు పడింది. ఈ ఏడాది నిర్వహించే పెరాహెరా ఉత్సవంలో పాల్గొనబోతున్న 60 ఏనుగుల్లో ఇదీ ఒకటి. రోజు తప్పించి రోజు సాయంత్రం కాగానే దానితో పరేడ్​ చేయిస్తున్నారు. శిక్షణ ఇస్తున్నారు. పొద్దుపోయే దాకా దాన్ని ఇబ్బంది పెడుతున్నారు” అంటూ పోడి మల్లి అనే వ్యక్తి పోస్ట్​ చేశాడు. ఇలా బక్కచిక్కిపోయిన ఏనుగును హింసపెట్టడం అమానవీయ చర్య అని కొందరు పెదవి విరుస్తున్నారు. చావుకు దగ్గరవుతున్న దానిని ఇలా పనుల పేరిట హింసించడం తగదంటున్నారు.