
న్యూయార్క్: బ్రిటన్ నంబర్‌వన్ ప్లేయర్ ఎమ్మా రదుకాను.. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో బోణీ చేసింది. ఆదివారం జరిగిన విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో రదుకాను 6–1, 6–2తో ఇనా షిబహర (జపాన్)పై గెలిచింది. 2021 టైటిల్ నెగ్గిన తర్వాత యూఎస్ ఓపెన్‌లో రదుకానుకు ఇదే తొలి విజయం కావడం విశేషం. 62 నిమిషాల మ్యాచ్‌లో రదుకాను మరో రికార్డును కూడా సొంతం చేసుకుంది. ఆమె కెరీర్‌లో అతి తక్కువ టైమ్‌లో నెగ్గిన గ్రాండ్ స్లామ్ మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.
2022, 2024లో తొలి రౌండ్‌లోనే ఓటమిపాలైన రదుకాను.. గాయంతో 2023 టోర్నీలో ఆడలేదు. గతంలో కంటే ఎక్కువగా ఈ ఏడాది డబ్ల్యూటీఏ టూర్ స్థాయి మ్యాచ్‌లను గెలిచిన రదుకాను ఫ్రెష్ ఫామ్, కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగింది. మ్యాచ్ మొత్తంలో రెండు ఏస్‌లు కొట్టిన ఎమ్మా.. తన సర్వీస్‌లో 82 శాతం పాయింట్లు రాబట్టింది. ఏడు బ్రేక్ పాయింట్లతో నాలుగింటిని కాచుకుంది.
6 అన్ ఫోర్స్‌డ్ ఎర్రర్స్‌తో పాటు ఏడు విన్నర్లు కొట్టింది. ఒక్క ఏస్ కూడా కొట్టని షిబహర ఐదు డబుల్ ఫాల్ట్స్ చేసింది. తన సర్వీస్‌లో 58 శాతం పాయింట్లకే పరిమితం కాగా, 12 విన్నర్లు, 36 అన్ ఫోర్స్‌డ్ ఎర్రర్స్ చేసింది. మరో మ్యాచ్‌లో కుడెర్మెటోవా (రష్యా)కు వాకోవర్ విజయం లభించింది. స్కోరు 2–2 ఉన్న దశలో నురియా పారిజాస్ డియాజ్ (స్పెయిన్) మ్యాచ్ నుంచి వైదొలిగింది. మెన్స్ సింగిల్స్‌లో డేవిడోవిచ్ ఫోకినా (స్పెయిన్) 6–1, 6–1, 6–2తో షెవెచెంకోవా (కజకిస్తాన్)పై నెగ్గాడు.