సొంతగడ్డపై మాజీ మంత్రి ఈటల భావోద్వేగం

సొంతగడ్డపై మాజీ మంత్రి ఈటల భావోద్వేగం
  • కమలాపూర్ మండలంలో ఈటల రాజేందర్ పాదయాత్ర

వరంగల్ అర్బన్: ఏడు రోజులుగా పాదయాత్ర చేస్తున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం కమలాపూర్ మండల కేంద్రానికి చేరుకున్నారు. సొంతగడ్డకు చేరుకున్న సందర్భంగా  భావోద్వేగానికి లోనయ్యారు. టీఆర్ఎస్ పార్టీలో జరిగిన సంఘటనలు, అవమానాలను పూసగుచ్చినట్లు వివరించి చెప్పారు మాజీ మంత్రి ఈటల. ఎక్కడికెళ్లినా ప్రజలు అపూర్వంగా ఆదరిస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తూ ఏడు రోజులుగా పాదయాత్ర చేస్తూ నా మట్టిగడ్డ కమలాపూర్ కు చేరుకున్నానని వివరించారు.
మీరిచ్చిన ధైర్యంతోనే పాదయాత్ర చేస్తున్నా
 ‘‘కొందరు ఊసరవెళ్లులాంటి వాళ్లు ఉంటారని, వాళ్లను పట్టించుకోవద్దని ప్రజలు నాకు ధైర్యం చెబుతున్నారు. కేసీఆర్ కు హుజురాబాద్ గడ్డా సత్తా తేల్చి చెబుతామని ప్రజలు నాకు భరోసా ఇస్తున్నారు. మీరిస్తున్న ధైర్యంతో ఇంకా 15 రోజులు తప్పకుండా పాదయాత్ర చేస్తా. బక్కప్రాణం కాబట్టి ఎన్నికల వరకు ఆరోగ్యం దెబ్బతింటుందని భయం ఉన్నా.. నాకు వేరే మార్గం లేదు..’’ అని మాజీ మంత్రి ఈటల అన్నారు. కేసీఆర్ దగ్గర వందల కోట్ల డబ్బులు, అధికార యంత్రాంగం, పోలీసులున్నారు..టక్కుటమారా విద్యలు చేసే నాయకులున్నారు.. కార్యకర్తల్లాగే పోలీసులు ఇండ్లలోకి వెళ్లి మా వాళ్లను బెదిరిస్తున్నారు.. బిజినెస్ లు దెబ్బతీస్తామని బెదిరిస్తూనే.. డబ్బులిస్తామని కేసీఆర్ చెంచాలు ప్రలోభాలకు గురిచేస్తున్నారు.. ఒక్క ఈటల రాజేందర్ ను కొట్టడానికి ఇంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అవసరమా ? నాలాంటి ధర్మం కోసం కొట్లాడే నాయకున్ని ఓడించడానికి నాదగ్గరకు వచ్చారు.. అక్కడ మీ ప్రజలు కూడా ఇదంతా చూస్తున్నారు. అక్కడి ప్రజల చేతిలో మీకు గుణపాఠం తప్పదు.. ’’ అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు.  
ఓ ఎమ్మెల్యే చదువు చెప్పే స్కూలును బార్ గా  మార్చారు
తెలంగాణలో ఓ ఎమ్మెల్యే చదువు చెప్పే స్కూలును బార్ గా  మార్చారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. అంగట్లో పశువులను కొన్నట్లుగా నాయకులను కొంటున్నారని, సర్పంచులు, ఎంపీటీసీలు వాళ్లవైపు ఉంటే ప్రజలు వాళ్లవైపు ఉంటారా ? అని ప్రశ్నించారు. ఇప్పుడున్న సర్పంచుల, ఇతర ప్రజాప్రతినిధుల గెలుపులో నా పాత్ర లేదా  ? పిల్లల కోడిలాగా నేను వాళ్లను కాపాడుకోలేదా? కానీ నాకు జరిగిన అన్యాయంపై కనీసం అడిగే ఇంగిత జ్ఞానం వాళ్లకు లేదా?  నా పదవిని తీసేసింది కేసీఆర్ కాదా? అని ఆయన నిలదీశారు.  ‘‘నేను రాజీనామా చేయలేదు. మంత్రి పదవి తీసేసినా నేను తొందరపడలేదు. ఏం చేస్తాడో చూద్దామని ఊర్కున్నా. కానీ గొర్రెల మంద మీద తోడేళ్లు పడ్డట్టు.. నాకు అండగా ఉన్న నాయకులను వెలగట్టి తీసుకెళ్లారు. నాతోటి ఉన్నవాళ్లతోనే నాకు వ్యతిరేకమని చెప్పించారు..’’ అని ఈటల ఆరోపించారు.  
తెల్లారితే, రాత్రైతే నా వెనక కూర్చున్నోళ్లు ఇప్పుడు మాట తప్పారు
తెల్లారితే చాలు నా దగ్గరకు.. రాత్రైతే నా వెనుక వచ్చి కూర్చున్నోళ్లు మాట తప్పారని ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ను ఇప్పటిదాకా నేను ఒక్కమాట అనలేదు కానీ 2018లో నాపై జరుగుతున్న కుట్రను గమనించి ధర్మాన్ని కాపాడాలని మీకు ఆనాడే చెప్పాను అని గుర్తు చేశారు. వాళ్ల పార్టీ తరపున పోటీచేసిన నన్నే ఓడించడానికి అవతలి పార్టీ అభ్యర్థికి డబ్బులిచ్చి కుట్రలు, కుతంత్రాలు చేసారు, అప్పుడు నాతోటి ఉన్నోడే నాకు తూట్లు పొడిచిండు, బంగారు పల్లెంలో పెట్టి మంత్రి పదవులిచ్చారని చెబుతున్నారు, ముఖ్యమంత్రి పదవి నేనెప్పుడు కోరుకోలేదు. కాకపోతే మీ పద్దతులు మార్చుకోవాలని కోరాను, మంత్రిగా కాకున్నా సాటి మనిషిగా గౌరవించమని చెప్పానన్నారు. 
ఎమ్మెల్యేలమంతా కలసి సీఎంను కలవడానికి వెళ్తే ప్రగతి భవన్ గేటు దగ్గరే ఆపారు
కరీంనగర్ ఎమ్మెల్యేలమంతా కలిసి సీఎంను కలవాడనికి ఒకప్పుడు వెళ్తే ప్రగతి భవన్ గేటు దగ్గరే ఆపారని మాజీ మంత్రి ఈటల గుర్తు చేశారు. సీఎంకు ఏదైనా చెప్పాలనుకుంటే నా ద్వారా చెప్పాలని ఎమ్మెల్యేలందరూ భావించేవారని, మమ్మల్ని అక్కడ సెక్యూరిటీ ఆపితే.. ఇప్పటి కరీంనగర్ ఎమ్మెల్యే మంత్రి అయిన గంగుల స్పందిస్తూ..  “ఇంత అహంకారమేందన్నా” అన్నాడు,  “మంత్రికే విలువలేకుంటే ఎవరికి విలువనిస్తారని” ఆ మంత్రి అన్నాడు. “మరో ఉద్యమానికి కరీంనగర్ కేంద్ర బిందువు అవుతుందని” ఆ మంత్రే ఆనాడు అన్నాడు అని ఈటల రాజేందర్ తెలిపారు. ‘‘సంసారంలో ఎన్నికలహాలు వచ్చినా భరించేంత కాలం భరించాలి. వెంటనే విడాకులు తీసుకోరు. అరటాకుల్లాంటి మా బతుకులు చినిగిపోతాయని ఎంతో భరించాం. ఓపిక పట్టాం. 90 మంది ఎమ్మెల్యేలు గెలిచినా మూడు నెలల పాటు మంత్రి పదవి ఇవ్వకుండా, నాపై అనేక వార్తలు రాయించారు. మూడు నెలల తర్వాత నాకు మంత్రి పదవి ఇస్తాము రమ్మని పిలిచి.. నా సహచరుడు హరీశ్ ను మాత్రం పిలవలేదు. అప్పడే ఖతం పట్టిస్తున్నారని ఊహించా. మంత్రి పదవి ఇచ్చినట్లే ఇచ్చి.. ఓ రోజు “ఆరోగ్య మంత్రి అనారోగ్య చర్య”  అని, మరో పేపర్లో “గలీజు మంత్రి” అని తమ పత్రికలో రాయించారు.. అని ఆయన ఆరోపించారు. అప్పుడే విడాకులు తప్పవని భావించా, అప్పుడే నేను వారినడిగా.. ఈ వార్తలేంది.. తీసేస్తే తీసేయండని చెప్పినా.. అందుకే గులాబీ జెండాకు ఓనర్నని మాట్లాడాల్సి వచ్చింది.. ఆ దెబ్బకే నా సహచరుడు హరీశ్ రావుకు మంత్రి పదవి వచ్చిందిని ఈటల పేర్కొన్నారు. నన్ను ఓడించడానికి తెల్లరేషన్ కార్డులు, గొర్రెలు, ఫించన్లు ఇస్తామని ఆయా శాఖల మంత్రులు బతికుండగానే బొందపెట్టాలని చూస్తున్నారని, వీరందరినీ హరీశ్ రావు నడిపిస్తున్నాడని ఈటల ఆరోపించారు. 
ఇప్పుడు నాకు జరిగిన అవమానం నీకు జరగలేదా? నా ఇంట్లో వాళ్లు పడిన టెన్షన్ నీ ఇంట్లో వాళ్లు పడటంలేదా? నేను బయటకు వచ్చిన తర్వాత నీకు కేసీఆర్ మర్యాద ఇస్తుండవచ్చు. గౌరవంగా మాట్లాడుతుండొచ్చు. ఒకవేళ నాకేదైనా జరిగితే మీ గతి ఏంటి.? ఈటల లాంటోడే గాండ్రించి ఖతమై పోయిండు.. మీరెంతరా కొడుకా మలుచుకుని పండండి అంటాడు కేసీఆర్. మీరు మలుచుకుని పండడానికేనా.. అన్ని కులసంఘాల మీటింగులు పెడుతున్నారా ? ఉన్న నాలాంటి ఒక్కన్ని బొందపెడితే మీకు ఏం లాభం జరుగుతుంది.? అని ఆయన ప్రశ్నించారు. 
నన్ను కాపాడుకుంటారా.. కటికోళ్లకు అప్పజెబుతారా ఆలోచించండి
మీకు గొర్రెలు ఎందుకిస్తున్నరో యాదవులు ఆలోచించండి, యాదవ, కుర్మ సోదరులారా! నన్ను కాపాడుకుంటారా.. ? కటికోళ్లకు అప్పజెప్పుతారా ఆలోచించండి అని ఈటల రాజేందర్ సూచించారు.  2018లో గెలిచినప్పటి నుంచి ఒక్కరికైనా ఫించన్ ఇచ్చారా? చివరికి నేను కూడా ఇప్పించలేదు. ఆఖరికి ఫించన్లమంత్రి ఎర్రబెల్లి కూడా ఇవ్వలేదు. అదంతా కేసీఆర్ తాళం వేసుకున్నాడు. ఇప్పుడు మాత్రం హుజురాబాద్ ఎన్నికల కోసం ఒక్క హుజురాబాద్ లోనే 11 వేల ఫించన్లు ఇచ్చాడు. ఇప్పుడు రేషన్ కార్డులు, ఫించన్లు సాంక్షన్ నా రాజీనామా వల్ల వస్తున్నాయి. తీసుకుని నన్ను ఆశీర్వదించండి.. అని ఈటల కోరారు. 
సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్ లాంటి చోట్ల మాత్రమే పూర్తి స్థాయిలో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించారు, అదికూడా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కాంట్రాక్టర్లకు చెబితే వాళ్లు కట్టించారు, నేను కూడా కట్టించాను, కానీ వాళ్లంత ఎక్కువ కట్టించలేకపోయాను, మూడెకరాల భూమి హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేదు..  ఇప్పుడున్న రేటు ప్రకారం మూడెకరాల భూమికి 40 లక్షలు కావాలి..  అందుకే 40 లక్షల స్కీం పక్కన పెట్టి పది లక్షలు ఇస్తానంటున్నాడు అని మాజీ మంత్రి ఈటల వివరించారు.