
- హిమాచల్ ప్రదేశ్‌లో ఘటన
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని సర్మూర్ జిల్లా భార్లీ గ్రామంలో జరిగిన ఒక పెండ్లి అందరి గుండెల్ని కదిలించింది. 2024 ఫిబ్రవరిలో అరుణాచల్ ప్రదేశ్‌లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుడు అశీష్ కుమార్ సోదరి అరాధన పెండ్లిలో అతని సహచర సైనికులు సోదరుడి పాత్ర పోషించారు. అరాధనను పెండ్లి మండపానికి సైనికులు గౌరవంగా తీసుకెళ్లారు. 19 గ్రెనాడియర్ బెటాలియన్‌కు చెందిన సైనికులు తమ యూనిఫాంలో ఈ బాధ్యతలు నిర్వహించారు. అంతేకాదు, ఆమెకు ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో బహుమతి కూడా ఇచ్చారు. ఆమె జీవితంలో అశీష్ లేని లోటును కొంతైనా తీర్చే ప్రయత్నం చేశారు.
పొయంటా, షిల్లై ప్రాంతాల నుంచి మాజీ సైనికులు కూడా ఈ పెండ్లికి వచ్చి.. ఈ భావోద్వేగ ఘటనలో పాలుపంచుకున్నారు. అశీష్ లేని ఈ రోజున సైనికులు తమ ప్రేమ, ఆదరణతో ఆ లోటును తీర్చారు. పెండ్లికి వచ్చిన అతిథులు, కుటుంబ సభ్యులు ఈ దృశ్యం చూసి కన్నీరు ఆపుకోలేకపోయారు. "సైనికుల సోదరప్రేమకు ఇది నిజంగా గొప్ప ఉదాహరణ" అని ఒక వారంతా చెప్పుకొన్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఈ రకమైన చర్యలు సైనికుల మానవత్వ గుణాన్ని, దేశభక్తిని మరింత మెరుగుపరుస్తాయని నెటిజన్లు పోస్టులు పెట్టారు.