హెచ్​సీఎల్ టెక్​​పై లేబర్​ మినిస్ట్రీకి ఉద్యోగుల ఫిర్యాదు

హెచ్​సీఎల్ టెక్​​పై లేబర్​ మినిస్ట్రీకి ఉద్యోగుల ఫిర్యాదు

న్యూఢిల్లీ: ఐటీ ఉద్యోగుల యూనియన్​ నాసెంట్​ ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ ఎంప్లాయీస్​ సెనేట్​ (నైట్స్​) లేబర్​ అండ్​ ఎంప్లాయ్​మెంట్​ మినిస్ట్రీకి హెచ్​సీఎల్​టెక్నాలజీస్​పై ఫిర్యాదు చేసింది. ఈ కంపెనీ తాజాగా ప్రకటించిన ఎంగేజ్​మెంట్​ పెర్​ఫార్మెన్స్​ బోనస్​ (ఈపీబీ) పే స్ట్రక్చర్​పై తమ అభ్యంతరాలతో ఈ కంప్లెయింట్​ను ఫైల్​ చేశారు. కొవిడ్​కు ముందు తరహాలో ఈపీబీ అమలు చేయాలని హెచ్​సీఎల్​ టెక్​ ఇటీవల నిర్ణయించింది. బెంచ్​లో ఉండే ఉద్యోగులకు ఈపీపీ చెల్లించరు.

తగ్గిన నెలవారీ జీతాలతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు ఈ కొత్త విధానం నచ్చలేదు. ఏప్రిల్​ 1 నుంచి హెచ్​సీఎల్​ టెక్​ కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చింది. కొత్త పాలసీ  తెస్తున్న విషయాన్ని ఉద్యోగులకు ఒక్క రోజు ముందు మాత్రమే ఈమెయిల్​ ద్వారా తెలియచేసింది.  మరోవైపు,  ఎంగేజ్​మెంట్​ పెర్​ఫార్మెన్స్​ బోనస్​ (ఈపీబీ) ఈ 3 బ్యాండ్ ​దాకా ఉన్న ఉద్యోగులకు చెల్లిస్తూనే ఉన్నామని హెచ్​సీఎల్​ టెక్​ పేర్కొంది.

నెలవారీగా ఫిక్స్​డ్​ రేటు కింద ఈపీబీని గతంలో ఇచ్చేవారని, బెంచ్​లో ఉన్న ఉద్యోగులకు కూడా చెల్లించే వారని నైట్స్​ ప్రెసిడెంట్​ హర్​ప్రీత్​ సింగ్​ సలూజ చెప్పారు. ఈ పాలసీని కంపెనీ హఠాత్తుగా మార్చి వేసిందని విమర్శించారు. దీంతో లేబర్​ మినిస్ట్రీ వద్ద  నైట్స్​ ఫిర్యాదు చేసిందని చెప్పారు.