ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు చెల్లించలేదు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు చెల్లించలేదు

యాదాద్రి, వెలుగు: మునుగోడు ఉప ఎన్నిక ఉండడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు పోయిన నెల ఒకటో తారీఖునే జీతాలిచ్చిన ప్రభుత్వం.. ఈసారి మాత్రం వేయలేదు. జీతాలు పడ్తాయని గురువారం రాత్రి వరకు వేచి చూసిన ఉద్యోగులు... బ్యాంకుల నుంచి మెసేజ్ లు రాకపోవడంతో నిరాశ చెందారు. గురువారం మునుగోడు మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ నేతృత్వంలో మంత్రులతో రివ్యూ మీటింగ్​జరిగింది. ఉమ్మడి జిల్లాకు చెందిన ఆఫీసర్లు అందరూ అక్కడే ఉన్నారు. ‘‘ఎన్నికలు మొన్ననే ముగిసినయ్. టీఆర్ఎస్సే గెలిచింది. ఇప్పుడు అభివృద్ధి మీద రివ్యూ మీటింగ్​కూడా జరుగుతోంది. కాబట్టి ఈ నెల కూడా ఫస్ట్​కే జీతాలు వస్తాయి” అని ఉద్యోగులు అనుకున్నారు. కానీ వారు ఆశపడినట్టుగా జీతాలు పడలేదు.  

అప్పుడు ఎన్నిక ఉండడంతోనే...   

ఎప్పుడూ లేని విధంగా యాదాద్రి, నల్గొండ జిల్లాలోని దాదాపు 11 వేల మంది ఉద్యోగులకు నవంబర్ 1నే జీతాలు వేశారు. అయితే అప్పుడు పక్కనే ఉన్న సూర్యాపేట జిల్లా ఉద్యోగులకు మాత్రం వేయలేదు. మునుగోడు ఉప ఎన్నిక కారణంగా నియోజకవర్గంలోని ఏడు మండలాలు యాదాద్రి, నల్గొండ జిల్లాల్లో ఉండడంతోనే జీతాలు పడ్డాయని ఉద్యోగులు నిర్ధారణకు వచ్చారు. దీనిపై అప్పట్లో సోషల్​ మీడియాలో జోరుగా కామెంట్స్ వచ్చాయి. దీంతో అదే నెల 2న సూర్యాపేట జిల్లాలోని 7 వేల మంది ఉద్యోగులకు కూడా జీతాలు వేశారు. 

సర్కార్ పై ఉద్యోగుల సెటైర్లు.. 

ఈసారి ఒకటో తారీఖున జీతాలు వేయకపోవడంతో సర్కార్ పై ఉద్యోగులు సెటైర్లు వేస్తున్నారు. ఈ నెలలో ఎన్నిక లేకపోవడంతో జీతాలు వేయలేదని కొందరు..  అప్పు పుట్టలేదు కావచ్చు అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఈడీ, ఐటీ దాడులతో సర్కారు పెద్దలే పరేషాన్​లో ఉంటే.. మనకెట్ల జీతాలు వస్తాయ్? అంటూ ఇంకొందరు సెటైర్లు వేస్తున్నారు. కొన్నేండ్లుగా ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు పడడం లేదు. జిల్లా పేరులోని మొదటి అక్షరం ప్రకారం ప్రతి నెల 15 వరకు కాస్తా అటుఇటుగా జీతాలు వేస్తున్నారు. ఈ లెక్కన యాదాద్రి జిల్లా ఉద్యోగులకు ప్రతి నెల 10 నుంచి 17 మధ్య వేస్తున్నారు.