రిటైర్డ్​ ఎంప్లాయీస్​కూ పూర్తిస్థాయిలో అందని పెన్షన్లు

రిటైర్డ్​ ఎంప్లాయీస్​కూ పూర్తిస్థాయిలో అందని పెన్షన్లు
  • శాలరీలకు ప్రతి నెలా రూ.4,500 కోట్లు అవసరం
  • ఈ నెలలో జీతాల కోసం రూ.2,200 కోట్ల సర్దుబాటు
  • రోజుకు ఒక జిల్లాకు చొప్పున విడుదల
  • రాబడిలో ఎక్కువ మొత్తం కిస్తీలు, వడ్డీలకే పోతున్న వైనం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెరుగుతున్నా.. కొత్త అప్పులు పుడుతున్నా ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు మాత్రం అందడం లేదు. 8వ తేదీ వచ్చినప్పటికీ ఈ నెలలో ఇంకా ఉద్యోగులందరికీ జీతాలు జమ కాలేదు. 13 జిల్లాల్లోని ఉద్యోగులు శాలరీల కోసం ఎదురుచూస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకూ పెన్షన్లు సకాలంలో అందడం లేదు. 12 జిల్లాల్లో రిటైర్డ్‌‌ ఉద్యోగులకు పింఛన్లు అందాల్సి ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకు, రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్లకు నెలకు సగటున రూ.4,500 కోట్లు అవసరం పడతాయి. అయితే ఉద్యోగుల జీతాల కోసం ఇప్పటివరకు రూ.2,200 కోట్లు విడుదల చేసి శాఖల వారీగా సర్దుబాటు చేసినట్లు తెలిసింది. వీటిని ఒక్కో జిల్లాకు ఒక్కో రోజు చొప్పున జీతాలు జమ చేస్తున్నారు. అప్పు పుట్టకపోవడంతో శాలరీలు లేట్ అవుతున్నట్లు మొదట్లో అందరూ అనుకున్నారు. ఇప్పుడు అప్పులు తీసుకుంటున్నా.. వివిధ రూపాల్లో రాబడి పెరిగినా జీతాలు ఆలస్యం కావడంపై ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఒక్కో జిల్లాకు ఒక్కో తేదీన ఎంతకాలం

రెండేండ్ల కింద దాకా రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ ఒకటో తేదీనే జీతాలు పడేవి. అయితే రేండేండ్ల నుంచి 15, 20 రోజులపాటు చెల్లింపులు చేస్తూ వస్తోంది. కొన్ని సార్లు జిల్లాలకు ఒక రోజు చొప్పున జీతాలు రిలీజ్​ చేస్తున్నారు. హైదరాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, యాదాద్రి, ఆసిఫాబాద్, రంగారెడ్డి, నిర్మల్, వనపర్తి, నల్గగొండ, మహబుబాబాద్, ములుగు, జనగాం, భూపాలపల్లి, నారాయణపేట, నిజామాబాద్, మేడ్చల్, గద్వాల్, కామారెడ్డి, కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లోని ఉద్యోగులకు ఈ నెలలో శాలరీలు పడ్డాయి. వీటిలో ఒక్కో తేదీన ఒక్కో జిల్లాకు జీతాలు జమ చేశారు. ఇంకా 13 జిల్లాల్లోని ఉద్యోగులకు జీతాలు ఎప్పుడిస్తారనేది స్పష్టత లేదు. 14వ తేదీ వరకు జీతాల విడుదల పూర్తవుతుందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

అప్పులు.. ఆదాయం సర్దుబాటు అయితలె

ఈ ఆర్థిక సంవత్సరం మొదట్లో ఉద్యోగులకు జీతాలు లేట్ అయితే.. అప్పులు పుట్టడం లేదంటూ ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చింది. అయితే జులై నుంచి రాష్ట్ర సర్కార్ మళ్లీ అప్పులు తీసుకోవడం మొదలుపెట్టింది. ఈ మూడు నెలల్లో రూ.20 వేల కోట్ల వరకు అప్పులు చేసింది. ఈ నెల 6న రూ.2 వేల కోట్లు తీసుకున్నది. అయినా ఉద్యోగులకు జీతాలు సర్దుబాటు చేయలేదు. ఒక నెలలో రూ.4 వేల నుంచి రూ.5 వేల కోట్ల దాకా అప్పులు తీసుకుంటున్నా జీతాలు టైంకు ఇవ్వడం లేదు. ఆదాయం విషయానికొస్తే  స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్లు, ఎక్సైజ్, జీఎస్టీ, భూముల అమ్మకం వంటి వాటితో ప్రతి నెలా రూ.10 వేల కోట్ల దాకా వస్తోంది. వీటికి అప్పులు 
కలిపితే సగటున రూ.13 వేల కోట్లు అవుతుంది. ఇందులో నుంచే గతంలో తీసుకున్న అప్పులకు కిస్తీలు, వడ్డీలు చెల్లిస్తోంది. ఇలా ప్రతినెలా రూ.4 వేల కోట్ల దాకా కడుతున్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. మిగిలిన సొమ్ములను కాంట్రాక్టర్లకు ఎక్కువగా చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో స్కీములకు నిధులు, ఉద్యోగులకు జీతాలు టైమ్​కు అందడం లేదని అధికారులు చెబుతున్నారు.

ప్రతి నెలా ఎదురుచూపులే

నెలనెలా జీతాల కోసం ఉద్యోగులు ఎదురుచూడాల్సి వస్తోంది. ఏ జిల్లా ఉద్యోగులకు జీతాలెప్పుడు వస్తాయోనని వాట్సాప్ గ్రూపుల్లో చర్చించుకుంటున్నారు. జీతాలు సకాలంలో రాకపోవడంతో బ్యాంకు లోన్లకు గడువులోగా ఈఎంఐలు చెల్లించలేకపోతున్నామని, దీంతో బ్యాంకులు పెనాల్టీలు వేసి సొమ్ము చేసుకుంటున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. ఉద్యోగులు వ్యక్తిగత అవసరాల కోసం పెట్టుకున్న బిల్లులు కూడా సరైన టైమ్ కి రావడం లేదు. సరెండర్ లీవ్​ల బిల్లులు, సప్లిమెంటరీ బిల్లులను కూడా లేట్ గా ఇస్తున్నారని చెబుతున్నారు. అత్యవసరం ఉండి జీపీఎఫ్ లోన్ కు అప్లయ్ చేసుకుంటే అవి కూడా లేట్ గా ఇస్తున్నారని అంటున్నారు.