మూసీ నదీ తీరంలో ఉపాధి, ఆర్థికాభివృద్ధి పెరిగేలా చూడాలె: రేవంత్ రెడ్డి

మూసీ నదీ తీరంలో ఉపాధి, ఆర్థికాభివృద్ధి పెరిగేలా చూడాలె: రేవంత్ రెడ్డి
  • సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశం  

హైదరాబాద్, వెలుగు: మూసీ నది హైదరాబాద్ లోకి ప్రవేశించే ప్రాంతం నుంచి నగరం చివరి వరకూ ఉన్న పరివాహక ప్రాంతం మొత్తాన్ని డెవలప్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సిటీలో మూసీ పరివాహక ప్రాంతాన్నంతా ఉపాధి, ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా మార్చాలన్నారు.  మంగళవారం సెక్రటేరియేట్​లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పై సీఎం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు,  దామోదర రాజనర్సింహ, అక్బరుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మొత్తం మూసీ పరివాహక ప్రాంతాన్ని పర్యాటకులను ఆకర్షించేలా, సొంతంగా ఆదాయం పెంపొందించుకునేలా తీర్చిదిద్దాలని సూచించారు. ఇందుకుగాను మూసీ నది వెంట బ్రిడ్జిలు, కమర్షియల్, షాపింగ్ కాంప్లెక్సులు, అమ్యూజ్ మెంట్ పార్కులు, హాకర్ జోన్ లు, పాత్-వేలను ప్రభుత్వ, ప్రయివేటు పార్ట్నర్ షిప్ విధానంలో నిర్మించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మూసీ నదిలో కాలుష్యాన్ని తగ్గించి, మురుగు నీరు ప్రవహించకుండా అవసరమైన ప్రాంతాల్లో  మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్నారు. నదిలో శుద్ధి చేసిన నీరు ప్రవహించేందుకు చర్యలు చేపట్టడంతోపాటు నీటి మట్టం తగిన స్థాయిలో ఉండేలా చెక్ డ్యాంలు కట్టాలన్నారు. సమీక్షకు  సీఎస్ శాంతి కుమారి, మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ అర్వింద్ కుమార్, జలమండలి ఎండీ దాన కిషోర్, సీఎంవో అధికారులు శేషాద్రి, శివధర్ రెడ్డి, షానవాజ్ ఖాసీం, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, ఇతర అధికారులు హాజరయ్యారు.