పల్లె, పట్టణ ప్రగతికి ఉపాధి నిధులే దిక్కు

పల్లె, పట్టణ ప్రగతికి ఉపాధి నిధులే దిక్కు
  • రూ.478 కోట్లకు రాష్ట్ర సర్కారు ఇస్తోంది సగం లోపే
  • కరోనాతో భారీగా కోత.. ఆ తర్వాతా పెంచని వైనం
  • కేంద్రం నుంచి వచ్చిన 70% నిధులే వినియోగం
  • నిధుల కటకటతో ఇప్పుడు మరింత కోతకు ప్రయత్నాలు

హైదరాబాద్  : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు ఎక్కువ నిధులు ఉపాధి హామీ నుంచే అందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులే ఇందులో 70 శాతం వరకు ఉంటున్నట్టు తెలుస్తోంది. కరోనా టైంలో సర్దుబాటు పేరుతో పల్లె, పట్టణ ప్రగతికి నిధులు తగ్గించిన రాష్ట్ర సర్కార్.. ఇప్పటికీ అంతే మొత్తం రిలీజ్​ చేస్తోంది. ఇప్పుడు అప్పులు పుట్టకపోవడంతో ఫండ్స్​కు కటకట ఉండటంతో పల్లె, పట్టణ ప్రగతికి రాష్ట్రం తరఫున ఇచ్చే నిధులు మరింత కోత పెడుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వం చేయాలని చెబుతున్న కార్యక్రమాలకు నిధులు సరిపోవడం లేదని ఆఫీసర్ల నుంచి విజ్ఞప్తులు వెళ్తున్నా పట్టించుకోవడం లేదు. వీలైనన్ని పనులు ఉపాధి హామీ కింద వచ్చేలా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు తెలిసింది. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను జూన్ 3 నుంచి 15 రోజుల పాటు నిర్వహించాలని ఇటీవల సీఎం కేసీఆర్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఉపాధి నిధుల కింద వచ్చేలా పనులు
పల్లె ప్రగతిలో భాగంగా చేపడుతున్న అనేక పనులకు ఉపాధి నిధులే ఖర్చు చేస్తున్నారు. పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, డంప్​ యార్డులు, నర్సరీలు, డ్రయింగ్​ ఫ్లాట్​ఫామ్స్, మల్టీ లేయర్​ ఎవెన్యూ ప్లాంటేషన్​ వంటివన్నీ ఉపాధి నిధులతోనే చేస్తున్నారు. 2014–15 నుంచి ఇప్పటి వరకు ఉపాధి నిధుల కింద రాష్ట్రానికి కేంద్రం దాదాపు రూ.28 వేల కోట్లు రిలీజ్​ చేసింది. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో వైకుంఠధామాలు నిర్మించాలని 2019లో నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఉపాధి హామీలో ఈ పనులను ప్రతిపాదించి, ఇప్పటి వరకు 12,622 గ్రామాల్లో నిర్మాణాలు పూర్తి చేశారు. వీటన్నింటికి 80 శాతం ఫండ్స్​ ఉపాధి హామీ నుంచే ఖర్చు చేశారు. 12,737 గ్రామాల్లో ఉపాధి హామీ నిధులతోనే డంపింగ్​ యార్డులను కట్టారు.

చెప్పిన దాంట్లో ఇచ్చేది సగం లోపే!
పల్లె, పట్టణ ప్రగతికి ప్రతి నెలా కేంద్రం ఇచ్చే నిధులకు అదనంగా కొంత రాష్ట్ర వాటా కలిపి ప్రభుత్వం ఫండ్స్​ రిలీజ్​ చేస్తోంది. ప్రారంభంలో పల్లె, పట్టణ ప్రగతికి కలిపి నెలకు రూ.478 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో పల్లె ప్రగతికి రూ.308 కోట్లు, పట్టణ ప్రగతికి రూ.148 కోట్లు ఇవ్వాలి. కొన్ని నెలలు టంచన్ గా నిధులు రిలీజ్​ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ తర్వాత కోత పెట్టడం మొదలుపెట్టింది. కరోనాతో ఇంకింత నిధులు అధికారికంగానే తగ్గించింది. పల్లె ప్రగతికి రూ.227 కోట్లు, పట్టణ ప్రగతికి రూ.112 కోట్లు (ఇందులో జీహెచ్​ఎంసీకి రూ.59 కోట్లు, మున్సిపాలిటీలకు రూ.53 కోట్లు) ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఇప్పుడు ఇస్తున్న నిధులు చూస్తే తొలుత ప్రకటించిన దాంట్లో సగం కంటే తక్కువే ఉంటున్నాయి. దీంట్లో కేంద్రం నుంచి వచ్చిన నిధులే 70 శాతం ఉంటున్నట్లు ఆఫీసర్లు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఫండ్స్​కు కటకట ఉండటంతో నిధులు కోత పెడుతున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తల కోసం : -

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశారా..? చలాన్ కట్టేందుకు ఆఫర్


టీచర్ల మధ్య ‘మ్యూచువల్’ పంచాది