నిర్మల్ కొయ్యబొమ్మకు ఊపిరి

నిర్మల్ కొయ్యబొమ్మకు ఊపిరి
  • ఉపాధి హామీ కింద పొనికి మొక్కల పెంపకం
  • తీరనున్న కర్ర కొరత ఇక్కట్లు
  • మామడ మండలంలో కమ్యూనిటీ ప్లాంటేషన్
  • పైలట్​ ప్రాజెక్ట్​ కింద పది ఎకరాల భూమి ఎంపిక
  • కళాకారుల ఉపాధికి ఇక గ్యారంటీ

నిర్మల్, వెలుగు: కొంతకాలంగా పొనికి  కర్ర కొరతతో కొట్టుమిట్టాడిన నిర్మల్ కొయ్య బొమ్మకు ఇక కొత్త ఊపిరి అందనుంది. ప్రసిద్ధి గాంచిన  కొయ్య బొమ్మల తయారీలో కీలకమైన పొనికి విస్తీర్ణం ఉమ్మడి అదిలాబాద్ జిల్లాతో పాటు పొరుగు జిల్లాల్లోని అడవుల్లో తగ్గింది.దీంతో కొయ్య బొమ్మల తయారీకి కష్టాలు ఎదురయ్యాయి. కళాకారుల ఉపాధిపై ఎఫెక్ట్​ చూపింది. హరిత హారంలో పొనికి మొక్కల పెంపునకు ప్రాధాన్యమివ్వకపోవడం,ప్రత్యేకంగా ప్లాంటేషన్ చేయకపోవడంతో పొనికి చెట్ల ఉనికి ప్రమాదంలో పడింది. అయితే ఇటీవల ఉపాధి హామీ పథకం కింద పొనికి మొక్కల పెంపునకు డీఆర్ డీవో పీడీ విజయలక్ష్మి యాక్షన్​ ప్లాన్​తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన ప్రపోజల్స్​పీడీ ఇప్పటికే కలెక్టర్ కు పంపించారు.

మొదటి నర్సరీ లింగాపూర్​లో..

జిల్లాలోని మామడ మండలం లింగాపూర్ వద్ద పొనికి నర్సరీ ఏర్పాటు చేయనున్నారు. మండలంలోని వాస్తాపూర్, గాయదిపల్లి  ప్రాంతాల్లో సాయిల్ టెస్ట్​ చేశారు. ఇక్కడ  కూడా పొనికి చెట్లు పెంచేందుకు అనుకూలంగా ఉన్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు.  పొనికి నర్సరీ కోసం హైదరాబాద్ నుంచి టిష్యూ కల్చర్ చేసిన మొక్కలు ఇక్కడికి తీసుకొస్తున్నారు. వీటితో లింగాపూర్, వాస్తాపూర్, గాయదిపల్లి గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మొక్కలను ఉపాధి హామీ కూలీలతో  పెద్ద ఎత్తున ప్లాంటేషన్ చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా పొనికి ప్లాంటేషన్ సక్సెస్​అయితే ఐదారేండ్లలో పొనికి కలప పెద్ద మొత్తంలో అందుబాటులోకి వస్తుంది. దీంతో నిర్మల్ కొయ్య బొమ్మల తయారీకి ఆటంకాలు తొలగిపోతాయి. 

పొనికి నిల్వలు తగ్గుతుండడం ఆందోళనకరం... 

కొంత కాలంగా పొనికి కర్ర దొరకక నానా కష్టాలు పడ్డం. ఇక్కడి అడవుల్లో కూడా పొనికి చెట్ల కొరత తీవ్రంగా ఉంది. ఏంచేయాలో తెలియక ఇబ్బందులు పడ్డం. ఈజీఎస్ ద్వారా పొనికి చెట్లు పెంచితే కొయ్య బొమ్మల మనుగడ కు సేఫ్టీ ఉంటది.
–నాంపల్లి రాజశేఖర్, కొయ్య బొమ్మల కళాకారుడు, నిర్మల్

10 ఎకరాల్లో

పొనికి మొక్కల ప్లాంటేషన్ పైలట్​ప్రాజెక్టు కింద పది ఎకరాల్లో చేపట్టేందుకు నిర్ణయించారు. మొదటగా లింగాపూర్ లో నర్సరీ ఏర్పాటు చేసి, ఆ తర్వాత  వాస్తాపూర్, గాయదిపల్లిలో కూడా ప్లాంటేషన్  ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత  జిల్లా వ్యాప్తంగా ఫారెస్ట్​ ఏరియాల్లోనూ, సర్కార్​ భూముల్లోనూ ప్లాంటేషన్ చేయనున్నారు.

ఉపాధిపై ఆశలు..

ఉపాధి హామీ పథకం కింద పొనికి మొక్కలు పెంచితే మా సమస్యలు తీరిపోతయ్. మా ఉపాధికి భరోసా కలుగుతది. ఇక్కడి ప్రభుత్వ సామిల్​లో పొనికి కలప కొనుగోలుకు అవకాశం ఇస్తున్నప్పటికీ నిల్వలు లేకపోవడం మాకు ఇబ్బందిగా ఉండేది. ప్లాంటేషన్​తొందరగా చేస్తే మంచిది.
–పెంటయ్య, కొయ్య బొమ్మల కళాకారుడు, నిర్మల్

కొయ్యబొమ్మల ఉనికి కాపాడేందుకే..

ప్రపంచ ప్రసిద్ధి పొందిన నిర్మల్ కొయ్య బొమ్మల ఉనికి కాపాడేందుకే పొనికి ప్లాంటేషన్ చేపట్టాలని నిర్ణయించాం. ఇప్పటికే లింగాపూ ర్ లో నర్సరీ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాం. హైదరాబాద్​నుంచి టిష్యూ కల్చర్ చేసిన మొక్కలు తీసుకొస్తున్నాం. పొనికి  చెట్ల పెంపకం విస్తృతంగా జరిగితే  కొయ్య బొమ్మల తయారీకి అడ్డంకులు ఉండవు.
–విజయలక్ష్మి, డీఆర్డీవో పీడీ, నిర్మల్