
హైదరాబాద్: కర్రెగుట్టల వద్ద కాల్పుల మోత మోగింది. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక మహిళా నక్సల్ మృతి చెందగా.. ఇద్దరు జవాన్లు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. కాగా, మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర బలగాలు ఆపరేషన్ కగార్ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రె గుట్టలను భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలోనే మంగళవారం (మే 6) బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలోని కర్రెగుట్ట వద్ద కూంబింగ్ నిర్వహిస్తుండగా భద్రతా దళాలకు మావోయిస్టులు ఎదురు పడ్డారు.
దీంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు మరణించింది. తమ కంచుకోటైన కర్రెగుట్టల్లో మావోయిస్టులు అమర్చిన ప్రెజర్ కుక్కర్ బాంబులు పేలి ఒక జవాన్ మృతి చెందగా.. ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. జవాన్లను చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆపరేషన్ కర్రెగుట్టలో భాగంగా ఇప్పటి వరకు జరిగిన సెర్చ్ ఆపరేషన్లో మొత్తం నలుగు నక్సలైట్లు మృతి చెందగా.. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఆపరేషన్లో చాలా మంది మావోయిస్టు కీలక నేతలు చనిపోయారని, మరికొందరు గాయపడ్డారని సమాచారం. భౌగోళిక పరంగా అనేక సవాళ్లు ఎదురైతున్నప్పటికీ.. భద్రతా దళాలు మావోయిస్టుల అంతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఇప్పటివరకు వందల నక్సలైట్ రహస్య స్థావరాలు, బంకర్లను నాశనం చేశారు జవాన్లు. బీజాపూర్ నైరుతి సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా, సీఆర్పీఎఫ్ బృందం ముమ్మురంగా తనిఖీలు చేపట్టింది.