దోడాలో ముగ్గురు టెర్రరిస్టులు హతం

దోడాలో ముగ్గురు టెర్రరిస్టులు హతం

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో మరోసారి ఎన్‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌ చోటుచేసుకుంది. దోడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో టెర్రరిస్టులు,  భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. ఈ నెల 11న చటర్‌‌‌‌‌‌‌‌గల్లా జాయింట్ చెక్‌‌‌‌‌‌‌‌పోస్ట్‌‌‌‌‌‌‌‌పై టెర్రరిస్టులు దాడి చేయడంతో ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. మరుసటి రోజు గండో ప్రాంతంలోని కోట ఎగువన టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు కూడా గాయపడ్డాడు. 

ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు, స్థానిక పోలీసులతో కలిసి యాంటీ-టెర్రరిస్ట్ ఆపరేషన్లను ముమ్మరం చేశాయి. దోడా జిల్లాలోకి చొరబడిన నలుగురు పాకిస్తాన్ టెర్రరిస్టులపై రూ. 5 లక్షల చొప్పున రివార్డు ప్రకటించాయి. 

అలాగే.. బుధవారం ఉదయం  9.50 గంటలకు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో గండోహ్ ప్రాంతంలోని బజాద్ గ్రామానికి చేరుకున్న భద్రతా బలగాలపై టెర్రరిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. వెంటనే అలర్ట్ అయిన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపి ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టాయని అధికారులు తెలిపారు. దోడా జిల్లాలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నారు.