ఓరుగల్లు చెరువుల చెర వీడేదెన్నడు?

ఓరుగల్లు చెరువుల చెర వీడేదెన్నడు?
  •     ట్రై సిటీ చుట్టూ చెరువులన్నీ కబ్జా
  •     హద్దుల నిర్ణయంలో ఆఫీసర్ల  నిర్లక్ష్యం
  •     యథేచ్చగా పెరుగుతున్న ఆక్రమణలు
  •     ఏటా వరదలతో మునుగుతున్న కాలనీలు

హనుమకొండ, వెలుగు : ఓరుగల్లు నగరంలో చెరువుల కబ్జా యథేచ్చగా కొనసాగుతోంది. ఇప్పటికే సిటీ చుట్టూ ఉన్న వందల చెరువులు, కుంటలు ఆక్రమణకు గురికాగా..  వాటిలో చాలా వరకు కనుమరుగయ్యాయి. గత బీఆర్ఎస్  ప్రభుత్వంలో అప్పటి లీడర్ల సపోర్టుతో కొంత మంది కబ్జాదారులు రెచ్చిపోవడంతో చాలా చెరువులు రూపం కోల్పోయాయి. ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో చెరువుల కబ్జాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. 

ముఖ్యంగా వరంగల్  ట్రై సిటీ శివారులోని చెరువులు, కుంటలను ఇష్టారీతిన ఆక్రమించేస్తున్నారు. చెరువులు, కుంటల రక్షణకు సర్వేలు చేయడంతో పాటు ఎఫ్టీఎల్​ పరిధి మేరకు హద్దుల నిర్ణయించాల్సి ఉండగా.. కొన్నేండ్లుగా ఆ ప్రక్రియ ముందుకు కదలడం లేదు. దీంతో చెరువులు కబ్జాకు గురవుతున్నాయి. ఫలితంగా ఏటా వరదలు పోటెత్తి కాలనీలు మునిగిపోతున్నాయి.

తెగిపోయిన గొలుసుకట్టు 

ఓరుగల్లు  సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు కాకతీయు రాజులు నగరం చుట్టూ దాదాపు 2020కుపైగా  గొలుసుకట్టు చెరువులు, కుంటలు నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. ఏండ్లు గడుస్తున్న కొద్దీ వాటిలో  42 చెరువులు పూర్తిగా కనుమరుగయ్యాయి. మిగిలిన చెరువులనైనా రక్షించేందుకు చర్యలు తీసుకోవడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో  అవి కబ్జాదారుల పాలవుతున్నాయి.  భూముల ధరలు పెరగడం, వెంచర్ల బిజినెస్​ జోరుగా నడుస్తుండడం వంటి కారణాలతో కొంతమంది అక్రమార్కులు చెరువులను  సాఫ్​ చేసి దందా చేస్తున్నారు.  దీంతో చాలా చెరువుల గొలుసుకట్టు తెగిపోయి వరదలు ముంచెత్తుతున్నాయి.

ఎఫ్​టీఎల్ లోనే బీఆర్ఎస్​ లీడర్ల వెంచర్లు

గత బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో కొంతమంది ఎమ్మెల్యేల సపోర్టుతో కొందరు కబ్జాకోరులు రెచ్చిపోయారు. ఏకంగా చెరువుల్లోనే వెంచర్లు ఏర్పాటు చేశారు. ఎఫ్​టీఎల్​ లోనే వెంచర్లు చేస్తున్నా గ్రేటర్, కుడా ఆఫీసర్లు వారికి పర్మిషన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. భీమారంలోని శ్యామల చెరువు విస్తీర్ణం 67 ఎకరాల 22 గుంటలు కాగా.. అందులో చాలావరకు కబ్జాకు గురైంది. గత ప్రభుత్వ హయాంలో ఓ ఎమ్మెల్యే అండతో కొందరు శ్యామల చెరువును కబ్జా చేసి వెంచర్లు చేయడంతో పాటు ఇండ్లు కూడా కట్టారు. 

దీంతో చెరువు భూమి  సగం వరకు కనుమరుగైంది. ఇదే విషయమై స్థానికులు చాలా సార్లు ఆఫీసర్లకు వినతిపత్రాలు ఇచ్చారు. తాజాగా స్థానిక వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్  నాగరాజుకు ఫిర్యాదు చేశారు. గత సర్కారు పాలనలోనే హసన్​ పర్తి చిన్నంగి చెరువులో నడిమధ్య వరకు వెంచర్ల కాంపౌండ్లు వెలిశాయి. ఇక దేవన్నపేట బంధం చెరువు చాలా వరకు ఆక్రమణకు గురైంది. బీఆర్ఎస్​ పార్టీకి చెందిన ఓ మాజీ ప్రతినిధే ఆ చెరువును కబ్జా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దానికి కొంచెం దూరంలోనే ఓ చిట్​ఫండ్​ కంపెనీ వేసిన వెంచర్​ జయగిరి చెరువును సగం వరకు మింగేసింది. వరంగల్  రింగ్​ రోడ్డుకు ఆనుకుని భీమారం- చింతగట్టు మధ్యలో ఉన్న ఓ కుంట కూడా పూర్తిగా కనుమరుగైంది. 

కోమటిపల్లి సమీపంలోని గవ్వం చెరువు సగం వరకు కబ్జాకు గురవగా.. ఆ కబ్జా వెనుక ఓ మాజీ ప్రజాప్రతినిధి దగ్గరి బంధువు ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది. గోపాలపూర్​ ఊరచెరువు కూడా 20 ఎకరాలకుపైగా విస్తీర్ణం ఉండాల్సినప్పటికీ.. సగానికిపైగా ఆక్రమణకు గురై ఇండ్లు వెలిశాయి.  ఇక సిటీ మధ్యలో ఉన్న భద్రకాళి చెరువు కింద దాదాపు 330 ఎకరాలకుపైగా భూమి ఉండగా.. అందులో చాలా వరకు నిర్మాణాలు వెలిశాయి.  వంద ఎకరాల వరకు ఉండాల్సిన చిన్నవడ్డేపల్లి చెరువు చుట్టూ కూడా యథేచ్చగా కబ్జాలు జరుగుతున్నాయి. రంగశాయిపేట బెస్తం చెరువు, ఏనుమాముల కోట చెరువు, సాయి చెరువు ఇప్పటికే ఆక్రమణకు గురయ్యాయి.  

ఇందులో చాలా వరకు గత ప్రభుత్వ హయాంలో కబ్జాకు గురైనవే. గ్రేటర్​ 65వ డివిజన్​ దేవన్నపేట శివారులోని బంధం చెరువు శిఖం భూములు ఇప్పటికే ఆక్రమణకు గురయ్యాయి. గత బీఆర్ఎస్  ప్రభుత్వ హయాంలో కొందరు లీడర్ల సహాయంతో చెరువును చాలా వరకు కబ్జా చేయగా.. ఆఫీసర్లకు ఫిర్యాదులు వెళ్లాయి. అయినా అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా అదే చెరువు మరోసారి ఆక్రమణకు గురైంది. ఓ వ్యక్తి ఏకంగా చెరువులోనే మట్టితో దారి ఏర్పాటు చేసుకున్నాడు. దీంతో స్థానికులు ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది. కాజీపేట మండలం అమ్మవారిపేట రెవెన్యూ శివారులోని చెరువు శిఖం భూమి కొంత భాగాన్ని అదే గ్రామానికి చెందిన  మల్లయ్య అనే వ్యక్తి కబ్జా చేశాడు. మట్టితో చదును చేసి ఆక్రమించాడు. ఈ విషయం తెలుసుకున్న ఇరిగేషన్​ అధికారులు గత నెల 29న మడికొండ పీఎస్ లో ఫిర్యాదు చేయగా.. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

సర్వేల్లేవు.. బౌండరీల్లేవు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం 25 ఎకరాలలోపు విస్తీర్ణం కలిగిన చెరువులకు 9 మీటర్లు, 25 కంటే ఎక్కువ ఎకరాల పైబడి విస్తీర్ణం ఉన్న చెరువులకు 30 మీటర్ల వరకు బఫర్​ జోన్ గా ఉండాలని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఆ ప్రదేశంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ వరంగల్​ ట్రై సిటీ పరిధిలో బఫర్​ జోన్లు కనిపించకుండా పోతున్నాయి. ప్రస్తుతం వరంగల్  ట్రై సిటీ చుట్టూ చిన్నవి, పెద్దవి అన్నీ కలిపి దాదాపు 175 వరకు చెరువులు, కుంటలు ఉండగా.. వాటిని సర్వే చేసి, బౌండరీలు నిర్ణయించేందుకు రెండేండ్ల కింద ఆఫీసర్లు కసరత్తు చేశారు. 

వాటి విస్తీర్ణాన్ని బట్టి జీపీఎస్​ సర్వే చేయించి, హద్దులు నిర్ణయించేందుకు దాదాపు రూ.80 లక్షలతో ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. కానీ, ఆ తరువాత సర్వే, బౌండరీల ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇప్పటికీ వాటిని పట్టించుకున్న అధికారులు లేకపోవడంతో  గ్రేటర్  వరంగల్  చుట్టూ చెరువులు, కుంటలకు రక్షణ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో  హద్దులు లేక మళ్లీ ఆక్రమణలు సాగుతున్నాయి. ఇకనైనా గ్రేటర్​ పరిధిలోని లీడర్లు, ఆఫీసర్లు చొరవ తీసుకుని  చెరువులు, కుంటల రక్షణకు చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.